సాక్షి, హైదరాబాద్: మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదికకానుంది. ఈ నెల 27 నుంచి 31 వరకు అంతర్జాతీయ కణ జీవశాస్త్ర సదస్సు(ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ సెల్ బయాలజీ) జరగనుంది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) ఆధ్వర్యంలో షామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్‌లో ఈ సదస్సు జరగనుంది.
జీవ వైజ్ఞానిక శాస్త్రంలో మూడు అగ్రగామి సంస్థలైన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ సెల్ బయాలజీ (ఐఎఫ్‌సీబీ), ఏషియన్ పసిఫిక్ ఆర్గనైజేషన్ ఫర్ సెల్ బయాలజీ (ఏపీఓసీబీ), ఇండియన్ సొసైటీ ఫర్ సెల్ బయాలజీ (ఐఎస్‌సీబీ)లు తొలిసారిగా ఒకే వేదికను పంచుకోనుండటం విశేషం.
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ సెల్ బయాలజీ సంస్థ తొలిసారిగా అంతర్జాతీయ కణ జీవ శాస్త్ర సదస్సులో పాల్గొంటోంది. 30 దేశాల నుంచి 300 సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు, 1,400 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు సదస్సుకు రానున్నారు. ప్రీ కాంగ్రెస్ సెషన్, 8–9 ప్లీనరీ సెషన్లు, 20 టాపికల్ సెషన్లు జరగనుండగా, 150 మంది వక్తలు ప్రసంగించనున్నారు.
ఎన్నో దేశాలు పోటీ పడినా..
ఏషియన్ పసిఫిక్ ఆర్గనైజేషన్ ఫర్ సెల్ బయాలజీ నాలుగేళ్ల కింద సింగపూర్‌లో సమావేశమై ఈ సదస్సును భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. నాలుగేళ్ల కోసారి నిర్వహించే ఈ సదస్సును దక్కించు కోవడానికి ఎన్నో దేశాలు పోటీపడగా, తొలిసారిగా భారత్‌కు అవకాశం లభించింది. ఈ సదస్సు నిర్వహించే అవకాశం ఒక్క దేశానికి సగటున 40 ఏళ్లలో ఒకేసారి దక్కుతుంది.
గత మూడు దశాబ్దాలుగా కణ జీవశాస్త్ర రంగ పరిశోధనల్లో భారత్ కృషితో సదస్సు నిర్వహణకు అవకాశం లభించిందని ఇండియన్ సొసైటీ ఫర్ సెల్ బయాలజీ డైరెక్టర్ సత్యజీత్ మేయర్ పేర్కొన్నారు. కణ జీవ శాస్త్రంలో విద్యా ర్థులకు అపార అవకాశాలున్నాయని, హైద రాబాద్, గుంటూరులో జాతీయ, అంతర్జా తీయ శాస్త్రవేత్తలతో విద్యార్థులకు ఉప న్యాసం ఇప్పించనున్నామని తెలిపారు.
మార్టిన్ ఉపన్యాసంతో ప్రారంభం..
అమెరికాకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మార్టిన్ చాల్ఫీ ప్రారంభోపన్యాసంతో 27న మధ్యాహ్నం 2 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది. కేంద్రం, తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు, బయోటెక్ పరిశ్రమలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. కణ జీవశాస్త్రంలో కొత్త ఆవిష్కరణల నుంచి ఔషద ఉత్పత్తుల అభివృద్ధికి ప్రోత్సాహమందించాలనే లక్ష్యంతో జరిగే ఈ సమావేశంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాస్త్ర సహాయ మంత్రి సుజనా చౌదరి పాల్గొంటారు.
సదస్సు ముగింపు రోజు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.సీసీఎంబీ శాస్త్రవేత్తలు వి.రాధ, మధుసూదన్‌రావు, చడ్రక్‌లతో కలసి సంస్థ డైరెక్టర్ గురువారం సదస్సు వివరాలను వెల్లడించారు. మూలకణాలు, కణజాల నిర్మాణం, క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ పద్ధతులు, ఆరోగ్య, వ్యాధి నిర్ధారక పరీక్షల్లో కణ జీవశాస్త్ర ఉపయోగాలు వంటి అంశాలను చర్చించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment