పవన్ జనసేన సభకు పోలీసుల ఆంక్షలు
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'జనసేన' పార్టీ ఆవిర్భావ సభకు సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. సభను సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటలలోపే ముగించాలని పోలీసులు ఆదేశించారు. అంతే కాకుండా సభకు కేవలం 4వేల మందికి మాత్రమే పాసులకు జారీ చేయాలని సూచించారు. పాసులు లేనివారిని లోనికి అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇక పవన్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా నోవాటల్ హోటల్ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 200మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
‘జన సేన’ లక్ష్యాన్ని ప్రకటించడానికి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. పవన్ కల్యాణ్ సన్నిహితులు, అభిమానులు మొత్తంగా ఐదు వేల మంది కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికీ బార్ కోడ్ కలిగిన పాసులను జారీ చేశారు. పాసులపై పార్టీ లోగోను ముద్రించారు. ఆ బార్ కోడ్ ప్రకారం వారికి కేటాయించిన సీటులో మాత్రమే కూర్చోవాలని నిబంధన పెట్టారు. సాయంత్రం 6.30 గంటలకు పవన్ కల్యాణ్ సమావేశపు వేదికపై నుంచి 45 నిమిషాల పాటు ప్రసంగించనున్నాడు. పార్టీ విధివిధానాలను అతడు స్వయంగా వెల్లడించనున్నాడు.