తీరప్రాంతాల్లో హుదూద్ విధ్వంసం; నలుగురు మృతి
విశాఖపట్నం/భువనేశ్వర్: హుదూద్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలపై విరుచుకుపడింది. భారీ వర్షాలు, భీకర గాలులతో అతలాకుతలం చేసింది. దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో ప్రపంచ గాలులు వీస్తున్నాయి. తుఫాన్ కారణంగా సంభవించిన విధ్వంసానికి నలుగురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు రెండున్న లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలో లక్ష మందిని పునరావాస కేంద్రాలకు పంపారు. ఇంకా వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
తుఫాన్ ప్రభావం ఎక్కువగా విశాఖ నగరంపై పడింది. ప్రపంచ పవనాల ధాటికి చెట్లు, విద్యుత్ సంభాలు కూలిపోయాయి. ముందుజాగ్రత్తగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థను నిలిపివేశారు. తుఫాన్ కారణంగా ఇప్పటివరకు 70 ఇళ్లు దెబ్బతిన్నాయని, 34 జంతువులు మృతి చెందాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి ఆదివారం సాయంత్రం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు, ఒడిశాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.