ఆ పల్లె ఇళ్లు.. కడలికి పల్లీలు
పిఠాపురం :ఎన్నోసార్లు ఆ ఊరిపై దాడి చేసినా కసి తీరని కడలి.. మరోసారి రాకాసి కెరటాల కత్తులు దూసింది. ఆకలితో నకనకలాడేవాడు పల్లీలను నోట వేసుకున్నట్టు.. ఒకదాని వెనుక ఒకటిగా అనేక ఇళ్లను మింగేసింది. రోడ్లను కాటేసింది. వలనూ, తననూ నమ్ముకున్న మత్స్యకారుల జీవితాన్ని వెతల పాలు చేసింది. ‘హుదూద్’ తుపాను దెబ్బకు కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటలో దాదాపు 200 ఇళ్లుండగా 50 సముద్రంలో కలిసిపోయాయి. మరో 25 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన ఈ ఉత్పాతం ఆదివారం కొనసాగుతోంది. మరికొన్ని ఇళ్లు కూడా ఏ క్షణమైనా కడలిలో కలిసే స్థితిలో ఉన్నాయి. ఊళ్లోని 300 కుటుంబాల్లో 150 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు.
సుమారు కోటి రూపాయల వరకు ఆస్తినష్టం సంభవించినట్టు అంచనా. కళ్లెదుటే ఇళ్లు ఒకటొకటిగా కుప్పకూలి కడలి కడుపులో కలిసిపోతున్నా చేయగలిగింది లేక మత్స్యకారులు నిస్సహాయంగా చూడాల్సి వచ్చింది. వీలైన సామాన్లను దొరకపుచ్చుకుని ‘బతుకు జీవుడా!’ అనుకుంటూ పరుగు తీశారు. కొందరికి ఆ కొద్దిపాటి సామగ్రిని దక్కించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా.. ఎనుబోతు చిగురాకును మేసినట్టు.. వారి ఇళ్లను కడలి కబళించింది. కెరటాలు గ్రామంలోకి సుమారు 40 మీటర్ల మేర చొచ్చుకు వచ్చాయి. ఊరిలోని సిమెంటురోడ్డు సైతం కెరటాల ఉధృతికి సముద్రంలో కలిసిపోయింది. తీరంలోని అనేక చెట్లు కూకటివేళ్లతో సముద్రంలో కలిసిపోయాయి. తీరానికి సమీపంలోని సుబ్బంపేట, పల్లెపేట, కొత్తపేట, రంగంపేట, మాయాపట్నం సూరాడపేట తదితర మత్స్యకార గ్రామాలు సముద్రం చొచ్చుకు రావడంతో జలమయమయ్యాయి. అనేక ఇళ్లు నీటిలో చిక్కుకున్నాయి.
బీచ్‌రోడ్డు తునాతునకలు..
ఉప్పాడ తీరం వెంబడి వేసిన జియోట్యూబ్ రక్షణగోడ కూడా తుపాను ధాటికి తలవంచక తప్పలేదు. ఈ గోడ అనేకచోట్ల అలల తాకిడికి కొట్టుకుపోయింది. బీచ్‌రోడ్డు వెంబడి వేసిన రాళ్లగోడ కూడా ఛిద్రమైంది. విరుచుకుపడే కెరటాలకు తోడు భారీ రాళ్లు ఎగిరి పడడంతో పాటు రోడ్డు తునాతునకలై కొట్టుకుపోయింది. తీరంలో కెరటాలు సుమారు 10 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతూ తీరప్రాంతాన్ని తీవ్ర కోతకు గురిచేస్తున్నాయి. రక్షణగా వేసిన రాళ్లే ప్రస్థుతం రోడ్డును తునాతునకలు చేస్తున్నాయి.