తీరానికి శరాఘాతం
కొన్ని రోజులుగా కోస్తా వెన్నులో చలి పుట్టించిన ‘హుదూద్’..జిల్లా పాలిట పెనుముప్పు కాకుండానే నిష్ర్కమించింది. పొరుగునున్న విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సృష్టించిన విలయాన్ని చూస్తే..ఈ తుపాను ‘తూర్పు’ను చాలావరకూ కనికరించిందనే చెప్పొచ్చు. తీరప్రాంత మండలాల్లో ఒకింత ఉగ్రరూపం ప్రదర్శించిన ఈ విపత్తు.. జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో తన ప్రతాపాన్ని చూపకుండా దయ తలచినట్టే!
సాక్షి ప్రతినిధి, కాకినాడ :‘హుదూద్’ ఉపద్రవం ఏం ప్రళయం సృష్టిస్తుందో; ఎన్ని కష్టనష్టాల పాలు చేస్తుందోనని బిక్కుబిక్కుమన్న జిల్లావాసులు.. చివరికి తుపాను తీవ్రమైన చేటు కలిగించకుండానే తీరం దాటిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం విశాఖ జిల్లా పూడిమడక వద్ద తీరం దాటిన తుపాను.. జిల్లాపై భయపడినంత క్రౌర్యాన్ని చూపకుండా విడిచి పెట్టింది. అయితే తీరప్రాంతంలోని మండలాల్లో తుపాను తాకిడి తీవ్రంగానే ఉంది. తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లోని తీరగ్రామాలపై ‘హుదూద్’ కన్నెర్రజేసింది. ఈ ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వీచిన బలమైన ఈదురుగాలులతో జనజీవనం స్తంభించింది. ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటపై సముద్రం విరుచుకుపడింది. శనివారం రాత్రి నుంచే ఉవ్వెత్తున ఎగసిపడ్డ కెరటాలు.. ఈ గ్రామంలో తీరానికి ఆనుకుని ఉన్న మత్స్యకారుల ఇళ్లను కబళించాయి. కొమ్మల నుంచి రాలిన పండ్లలా.. 50 ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. మరో 25 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
150 కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. కట్టుబట్టలతో, ప్రాణాలు అరచేతపట్టుకుని బయటపడ్డ మత్స్యకారులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఒక్క ఊరిలోనే నష్టం రూ.కోటి వరకు ఉంటుందని అంచనా. సామర్లకోటలో 29వ వార్డుకు చెందిననేమాని వెంకట్రావు(60) నేరేడు చెట్టు విరిగి మీద పడటంతో మృతి చెందాడు. సీతానగరం మండలం రఘుదేవపురం పంచాయతీ పరిధిలోని నల్గొండకు చెందిన బందెల ప్రసాద్ (40) విద్యుదాఘాతానికి బలయ్యాడు. ఆదివారం రాత్రి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రసాద్‌కు విద్యుత్ స్తంభం నుంచి తెగిపడిన తీగ తగిలి ప్రాణాలు కోల్పోయాడు.కాగా రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన ఉప్పులూరి రాజ్‌కుమార్ ఎలియాస్ మోషే (20) విశాఖ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మరణించాడు. ఓ స్కూలు బస్సుపై క్లీనర్‌గా పని చేస్తున్న మోషే విద్యుత్ కాంట్రాక్టు పనులూ చేస్తుంటాడు. విశాఖలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరికొందరితో కలిసి ఈపీడీసీఎల్ వ్యాన్‌లో వెళుతుండగా విశాఖ సమీపంలో పెనుగాలులు వీచాయి. ఆ ఉధృతికి కిందపడిన మోషే అక్కడికక్కడే మరణించాడు.
చొచ్చుకు వచ్చిన కడలి, కోతకు గురైన తీరం
కోనసీమలో తీర ప్రాంత మండలాలైన కాట్రేనికోన, తాళ్లరేవు, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లిలలో బలమైన ఈదురుగాలులతో తీరంలో సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఉప్పాడ వద్ద బీచ్‌రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. ఈ రోడ్లో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట గ్రామాల్లోకి సముద్రం నీరు చొచ్చుకు వచ్చింది. ఆ గ్రామాల నుంచి సుమారు 5,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తొండంగి మండలంలో సముద్రం 30 మీటర్లు ముందుకు వచ్చింది. పాతచోడిపల్లిపేట, కోదాడ-ఎ.కొత్తపల్లి, పెరుమాళ్లపురం తదితర ప్రాంతాల్లో రెండు మీటర్ల మేర తీరం కోతకు గురైంది. ఈ మండలంలోని శృంగవృక్షం, ఎ.కొత్తపల్లి, గోపాలపట్నం గ్రామాల్లోని అరటితోటలు గాలికి నేలనంటాయి. కొన్నిచోట్ల గాలి తాకిడికి వరి చేలు నేలకొరిగాయి. జిల్లాలో 16 మండలాల్లో 78 గ్రామాల్లో తుపాను ప్రభావం కనిపించింది. ఆ గ్రామాల నుంచి 31,804 మందిని జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన 67 పునరావాస కేంద్రాలకు తరలించారు. 28 వేల ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. తొండంగి మండలంలో పలు పునరావాస కేంద్రాలకు సకాలంలో భోజనం అందక బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాకపోకలు నిలిచి బోసిపోయిన రహదారులు
రైళ్లు, అంతర్ జిల్లాల బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో, 16వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేయడంతో ఇటు విశాఖపట్నం, అటు విజయవాడ వైపు రోడ్లు వెలవెలబోయాయి. వాకలపూడి-ఉప్పాడ రోడ్డు, కోటనందూరు-నర్సీపట్నం రోడ్డు తుపాను తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ రోడ్లపై పలుచోట్ల చెట్లు పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జిల్లా అంతటా ఆదివారం ఉదయం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరించారు. జిల్లావ్యాప్తంగా 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు తొమ్మిది, 11 కేవీ సబ్ స్టేషన్లు 12 దెబ్బతిన్నాయి. తుపానుతో వాటిల్లిన పరిస్థితిని, సహాయక చర్యలను ఉపముఖ్యమంత్రి ఎన్.చినరాజప్ప, కలెక్టర్ నీతూప్రసాద్ కలెక్టరేట్ నుంచి సమీక్షించారు. తుపాను తాకిడి ఎక్కువగా ఉన్న తుని, యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో విద్యాసంస్థలకు సోమవారం కూడా సెలవు ప్రకటించారు. రైల్వేశాఖ తుపాను బాధితులకు ఆశ్రయం కల్పించేందుకు తునిలో 16, సామర్లకోటలో 15 కోచ్‌లను అందుబాటులో ఉంచింది.