ఏలూరు సిటీ : డీఎస్సీ-2014 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ప్రభుత్వ నిర్వాకం వల్ల ఎన్నడూలేనంత గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు. డీఎస్సీ విషయంలో జాప్యం చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదని తెలిసి కూడా సెకండరీ గ్రేడ్ పోస్టు (ఎస్జీటీ)లకు బీఎడ్ అభ్యర్థులను అనుమతించాలని రాష్ట్ర సర్కారు కోరింది. గతంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసిన ఈ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించినా.. మన రాష్ట్ర సర్కారు తిరిగి అదే విషయాన్ని కేంద్రానికి నివేదించింది. రెండు రోజుల క్రితం కేంద్రం దీనికి ససేమిరా అనడంతో కొత్త సాకులు వెదికేందుకు సిద్ధమవుతోంది.
వాస్తవానికి సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. ఎస్జీటీలకూ అవకాశం కల్పిస్తామంటూ ఇప్పటివరకూ జాప్యం చేశారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేయడంతో ప్రస్తుతం బీఎడ్ కోర్సు చేస్తున్న అభ్యర్థులకు మార్చి నెలలో పరీక్షలుం టాయి కాబట్టి.. వారికీ డీఎస్సీలో అవకాశం కల్పిస్తామని, అందుకోసం భారీ ఎత్తున పోస్టులు ప్రకటిస్తామనే కొత్త సాకును సర్కారు తెరపైకి తెస్తోంది.
మరోవైపు పాఠశాలల్లో ఆర్ట్స్, క్రాఫ్ట్స్, పీఈటీ వంటి 500 మంది ఇన్‌స్ట్రక్టర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తామ ని చెబుతోంది. 6 నెలల కాలానికి మాత్రమే ఉండే ఈ పోస్టులను భర్తీ చేయడం ద్వారా వారిని బోధనకు ఉపయోగించుకోవాలనే ఎత్తుగడతో ఉంది. ఖాళీ పోస్టుల్లో వీరిని భర్తీ చేయడం ద్వారా చివరకు టీచర్ పోస్టులు ఖాళీ లేవని చెప్పి డీఎస్సీ నోటిఫికేషన్‌ను మరికొంత కాలం జాప్యం చేయాలనే ఎత్తుగడ కనిపిస్తోంది. మరోవైపు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్), డీఎస్సీ నిర్వహణపైనా సరైన ప్రణాళిక లేకపోవడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు.
భారీ పోటీ
జిల్లాలో బీఎడ్ పూర్తిచేసి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వారు సుమారు 30 వేలకు పైగా ఉండగా, స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య 122 మాత్రమే ఉన్నట్టు విద్యాశాఖ చెబుతోంది. రిజర్వేషన్లు, రోస్టర్ విధానం నేపథ్యంలో ఈ పోస్టులకు పోటీ భారీగా ఉంటుందని చెబుతున్నారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. సబ్జెక్టు టీచర్ల పోస్టులు భర్తీ చేస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భారీగా పెరుగుతాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోగా పోస్టులను తగ్గించే పనిలో ఉంది.
ఇక భాషాపండితుల పోస్టులు 83, మైదాన ప్రాం తంలో ఎస్జీటీ పోస్టులు 358, ఏజెన్సీలో 36 వరకు ఉన్నాయి. విద్యాహక్కు చట్టం మేరకు ప్రాథమిక పాఠశాలల్లోని పోస్టులకు సంబంధించి ఎస్జీటీ కేటగి రీలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) అభ్యర్థులతోనే భర్తీ చేయాలనే కేంద్రం విధించిన నిబంధనలు బీఎడ్ అభ్యర్థులకు శాపంగా మారాయి. ఈ నిర్ణయంలో వెసులుబాటు కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. ఇప్పటివర కూ ఆశగా ఎదురుచూసిన బీఎడ్ అభ్యర్థులు కనీసం డీఎస్సీ నోటిఫికేషన్ అ యినా ప్రకటించాలని కోరుతున్నారు.
సిలబస్ గందరగోళం
సహజంగా డీఎస్సీ ప్రకటన వెలువడుతుందంటే బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు షార్ట్‌టెర్మ్, లాంగ్‌టెర్మ్ కోచింగ్‌లకు వెళుతుంటారు. కానీ డీఎస్సీ ప్రకటిస్తే ఏ సిలబస్ చదవాలో తెలియని సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సిలబస్ మారింది. ఇప్పుడు పాత సిలబస్‌లో పరీక్షలు నిర్వహిస్తారా, లేక కొత్త సిలబస్‌లోనా అనేది ప్రశ్నార్థకంగా మారిం ది. ఒకవేళ పాత సిలబస్‌తో టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తే పుస్తకాలు దొరకక ఇబ్బందులు తప్పవని అభ్యర్థులు చెబుతున్నారు.
స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచాలి
బీఎడ్ కోర్సు పూర్తిచేసి డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం కల్పిస్తుందని ఆశపడ్డాం. వ్యయప్రయాసలతో శిక్షణ పొందినా ఫలితం లేకుండా పోతోంది. ఎప్పుడు డీఎస్సీ ప్రకటిస్తారా అని ఏ ఉద్యోగానికి వెళ్లకుండా శిక్షణ పొందుతున్నాం. ఆలస్యం కావడంతో నష్టపోతున్నాం. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచి న్యాయం చేయాలి.
- ఎంవీ సురేష్‌కుమార్, బీఎడ్ అభ్యర్థి, ఏలూరు.
సాకుల షాకు
Published Tue, Nov 4 2014 8:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement
Advertisement