దగ్గుబాటి పయనమెటో?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ను వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ వీడుతారనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో దగ్గుబాటి జోక్యం చేసుకోకపోవడంతో పాటు, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు.
తాజాగా ఆయన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయకపోవడం చర్చనీయాంశమైంది. పార్టీ అభ్యర్థులు ఎవరూ నచ్చలేదని తిరస్కార ఓటు వేయడం గమనార్హం. ఎన్నికల కమిషన్ తొలిసారిగా రాజ్యసభ ఎన్నికల్లో తిరస్కార ఓటును ప్రవేశపెట్టగా దాన్ని మొదటిసారి ఉపయోగించుకున్న నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. సమైక్యాంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా విభజనను నిరసిస్తూ రాజీనామా చేసిన కేవీపీ లాంటి నాయకులు మళ్లీ రాజ్యసభ సభ్యత్వం కోసం పోటీచేయడం తనకు నచ్చలేదని దగ్గుబాటి పేర్కొంటున్నారు.
తిరస్కార ఓటు వేస్తాననే విషయాన్ని తాను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలియజేశానని, ఆయన అనుమతితోనే ఓటు వేసినట్లు చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు దగ్గుబాటి సుముఖంగా లేరనే విషయం తేటతెల్లమవుతోంది. ఆయన్ను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ పర్చూరు నియోజకవర్గంలో ఇటీవల బ్యానర్లు వెలిశాయి. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు బ్యానర్లు చింపి కాల్చివేశారు. టీడీపీలోకి వస్తే ఆయన్ను అడ్డుకుంటామని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పై తన ధిక్కార స్వరాన్ని దగ్గుబాటి వినిపించారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందని, దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన సభ్యులకు ఓటు వేయకుండా తిరస్కరించినట్లు తెలిపారు. పైగా తాను 30 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్నానని, ఇంకా సాధించాల్సిందేమీ లేదని కూడా అన్నారు. ఆయన సతీమణి కేంద్రమంత్రి పురందేశ్వరి కూడా పార్టీపై వ్యతిరేకత వ్యక్తం చేసే అంశం తనకు సంబంధం లేనిదన్నారు.
ఏది ఏమైనా దగ్గుబాటి, పురందేశ్వరి దంపతులు తమ రాజకీయ జీవితం కోసం కొత్త వ్యూహాన్ని పన్నినట్లు స్పష్టమవుతోంది. పురందేశ్వరి కూడా త్వరలోనే మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.