ఇకపై రోజుకో ధర..
► పెట్రోల్, డీజిల్ విక్రయాలకు రోజువారీ ధరలు
► 16వ తేదీ నుంచి నూతన విధానం అమలు
కర్నూలు (వైఎస్‌ఆర్ సర్కిల్): ఇప్పటి వరకు ప్రతి పదిహేను రోజులకోసారి మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇకపై రోజురోజుకూ మారనున్నాయి. నూతన విధానం ఈ నెల 16వతేదీ నుంచి అమలులోకి రానుంది. ఈ విధానం వల్ల ఒక్కసారిగా ధరలు పెరిగాయన్న భావన వాహనదారుల్లో కలిగే అవకాశం ఉండవకపోచవ్చని పలువురు పేర్కొంటున్నారు. రాష్ట్రానికి సంబంధించి పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కొత్త విధానాన్ని మే 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా విశాఖపట్టణంలో అమలు చేశారు.
ఈ ప్రయోగం ఫలించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు నిర్ణయించా రు. ప్రభుత్వరంగ చమురు సంస్థలు దేశ వ్యాప్తంగా ఇదే విధానం అమలు చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటి వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల ఆధారంగా 15 రోజులు డాలర్ విలువను పరిగణనలోకి తీసుకొని పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటిస్తూ వస్తున్నారు. కొత్త విధానం ప్రకారం పట్టణాల మధ్య, బంకుల మధ్య ధరల్లో తేడాలుండే అవకాశం ఉంది. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ బంకుల మధ్య ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. అలాగే వేర్వేరు ప్రాంతాల్లో రవాణా ఛార్జీలను బట్టి ధరల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది.
రోజూ ధరల ప్రదర్శన..:
ఆయా పెట్రోల్‌బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ఏ రోజుకా రోజు బోర్డులను ఏర్పాటు చేసి ప్రదర్శించనున్నారు. అలాగే ఆయా ప్రభుత్వ రంగసంస్థల ఆయిల్ కంపెనీల యాప్‌ల ద్వారా కూడా ధరలను వినియోగదారులకు తెలియజేయనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రతి బంకులోనూ ధరల బోర్డులు ప్రదర్శించాలి. తద్వారా పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో పారదర్శకత ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయ పడుతోంది.
అలాగే ఐవోసీ, బీపీసీ, హెచ్‌పీసీఎల్ కంపెనీల బంకుల్లో కూడా ధరల వ్యత్యాసం ఉంటుంది. వినియోగదారుడు ఏ బంకులో ఏ రోజు ధర తక్కువగా ఉంటుందో తెలుసుకుని ఆ బంకులో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే పరిస్థితి రానుంది. ఇప్పటి వరకు ఉన్నట్టుండి ధరలు పెరగడం, తగ్గడం లాంటి ఘటనలతో ఒక పక్క ఆయిల్ కంపెనీలు, మరో పక్క వినియోగదాఆరులు నష్టపోతుండే వారు. ఇక పై దీనికి ఆస్కారం ఉండదని ప్రభుత్వం చెబుతోంది.
ధరలను బట్టి మసలుకోవచ్చు...
పెట్రోల్ ధరలను ఎప్పటికప్పుడు ప్రకటించడం ద్వారా ధరల వ్యత్యాసాన్ని బట్టి పర్యటించే ప్రదేశాలను తగ్గించుకొని పొదుపు మార్గాలను పాటించే అవకాశం ఉంది. ధరల పట్టికను ఏర్పాటు చేస్తే వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. – కృష్ణమోహన్, ప్రభుత్వ ఉద్యోగి