పాడి రైతు నష్టాల‘పాలు’ | Dairy Farming Is Weaken By TDP Government | Sakshi
Sakshi News home page

పాడి రైతు నష్టాల‘పాలు’

Published Tue, Apr 2 2019 7:06 AM | Last Updated on Tue, Apr 2 2019 7:08 AM

Dairy Farming Is Weaken By TDP Government - Sakshi

కేంద్రంలో పాలు పోస్తున్న దృశ్యం

సాక్షి, దర్శి (ప్రకాశం): ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ డెయిరీ లాభాల కోసం ఒక పథకం ప్రకారం ప్రభుత్వ డెయిరీని నిర్వీర్యం చేసి ప్రకాశం జిల్లా పాడి రైతులను నష్టాల్లో ముంచింది. పాడి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. గత సంవత్సరం అక్టోబర్‌ నెలలో హెరిటేజ్‌ డెయిరీలో 10 శాతం వెన్న ఉన్న పాల ధర రూ.54 ఉండగా ప్రభుత్వ డెయిరీని నిర్వీర్యం చేసి నెల రోజుల్లో మూడు విడతలుగా రూ.3.50 ధరను తగ్గించారు. ఆ ఒక్క డెయిరీ మాత్రమే ధర తగ్గించడంతో ఇతర డెయిరీలకు పాలు పోసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో  మిగతా డెయిరీలపై సామ, దాన, భేద, దండోపాయాలతో వారి చేత కూడా రేట్లు తగ్గించేలా అధికారాన్ని అడ్డంపెట్టి చంద్రబాబు అనుకున్నది సాధించారు. కరువుతో ఇబ్బందులు పడుతూ పాల ధరలు పెరుగుతాయన్న ఆశతో ఎదురు చూస్తున్న పాడి రైతులకు ఇది గట్టి ఎదురు దెబ్బగా మారింది. జిల్లాలో సుమారు 90 డెయిరీలు ఉండగా ఆ డెయిరీలకు గ్రామాల నుంచి పాలుపోసే కేంద్రాలు 4500ల వరకు ఉన్నాయి. జిల్లాలో ప్రతి రోజు సుమారు 6 లక్షల లీటర్ల పాలు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి.

పథకం ప్రకారం ప్రభుత్వ డెయిరీ నిర్వీర్యం
హెరిటేజ్‌ లాభం కోసం ఇక్కడ ప్రభుత్వ డెయిరీని నష్టాల బాట పట్టించారు. ప్రభుత్వ డెయిరీ సుమారు రూ.80 కోట్లు అప్పుల్లో ఉండగా...పాడి రైతులకు మరో రూ.35 కోట్లు బకాయిలు ఉన్న సమయంలో డెయిరీని మూసివేశారు. దీంతో పాడి రైతులు, ఉద్యోగులకు నెలల తరబడి రావాల్సిన బకాయిలు, జీతాలు నిలిచిపోయాయి. బకాయిలు, జీతాలు చెల్లించాలని కోరుతూ రైతులు, ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు, నిరాహార దీక్షలు చేశారు. ఆ సమయంలో శిద్దా వెంకటేశ్వరరావు చైర్మన్‌గా నియమితులై పాడి రైతుల బకాయిలకు, ఉద్యోగుల జీతాలకు తాను కోట్లాది రూపాయలు చెల్లించి డెయిరీని మళ్లీ లాభాల బాటలోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. మళ్లీ డెయిరీ ప్రారంభమైతే హెరిటేజ్, ఇతర ప్రైవేటు డెయిరీలకు ముప్పు కలుగుతుందని భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు అంగీకరించలేదు.

కొన్ని నెలలు గడిచిన తరువాత గ్రామాల్లో పాడి రైతులు తమ బకాయిలు ప్రభుత్వం ఎగ్గొడితే సహించేది లేదని గ్రామాల్లో కూడా తిరగనివ్వమని టీడీపీ నేతలను నిలదీయడం మొదలు పెట్టారు. దీనికి తోడు ఎన్నికలు కూడా సమీపించడంలో పాడి రైతులు తమకు ఓట్లేయరన్న ఆలోచనలో టీడీపీ నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. పాడి రైతులకైనా డబ్బు ఇస్తేనే గ్రామాల్లోకి వెళ్ల గలుగుతామని చెప్పడంతో సుమారు రూ.35 కోట్లు పాడి రైతులకు చెల్లించింది. ఈ లోపు ప్రభుత్వ డెయిరీకి సంబంధించిన ఖాతాలన్నీ హెరిటేజ్, ఇతర డెయిరీలు కైవసం చేసుకున్నాయి. ఆ తరువాత మళ్లీ డెయిరీని ప్రారంభించి పాలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పాడి రైతులు మాత్రం ప్రభుత్వ డెయిరీకి పాలు పోస్తే డబ్బులు వస్తాయో లేదోనని ఆ డెయిరీకి పాలు పోసేందుకు మొగ్గు చూపలేదు. దీంతో తాము ఆడిందే ఆట పాడిందే పాటగా హెరిటేజ్, ఇతర ప్రైవేటు డెయిరీల వంతైంది.

ప్రకాశం పాడి రైతులకు తీరని అన్యాయం
దీన్ని సాకుగా పెట్టుకుని పక్కన ఉన్న గుంటూరు జిల్లాలో లీటరు పాలకు రూ.57 చెల్లిస్తుంటే ప్రకాశం జిల్లాలో మాత్రం రూ.52 మాత్రమే చెల్లిస్తున్నారు. ఒక లీటరుకు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రూ.5లు తేడా ఉండగా గుంటూరు జిల్లాలో ఈ ధరకు గతంలో మరో రూ.4 బోనస్‌ కూడా ఇచ్చారు. ఆ బోనస్‌ను ప్రస్తుతం రూ.6.50  పెంచారు. అంటే ఈ లెక్క ప్రకారం ఒక పాడి రైతుకు గుంటూరు జిల్లాకు ప్రకాశం జిల్లాకు ఒక లీటరు పాలకు రూ.11.50 తేడా ఉంది. ఈ లెక్కన రోజూ జిల్లాలో 6 లక్షల లీటర్ల పాలకు రూ.69 లక్షలు, నెలకు రూ.20.70 కోట్లు ప్రకాశం జిల్లా పాడి రైతులను ప్రభుత్వం నష్టాల పాలు చేసింది.

ప్రకాశం పాడి రైతులపైనే హెరిటేజ్‌ వివక్ష
అయితే గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా శివారు ప్రాంతాల్లో రైతులు ప్రకాశం జిల్లాల్లో ఉన్న డెయిరీలకు పాలు సరఫరా చేస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు సరఫరా చేసే పాలకు మాత్రం గుంటూరు జిల్లాలో ఇచ్చే ఎక్కువ ధరలనే ఇక్కడ డెయిరీలు ఇవ్వడం గమనార్హం. దీంతో హెరిటేజ్‌ ఎక్కువ ధర చెల్లించడంతో ఇతర డెయిరీలు గుంటూరు జిల్లా వారికి ఆ ధరలు చెల్లించలేక అక్కడ ఖాతాలను వదిలేసుకుంటున్నారు. అటువంటి ఖాతాలను హెరిటేజ్‌ చేజిక్కించుకుని వారికి మాత్రం అధిక ధరలను ఇవ్వడమే కాక ఇక్కడ డెయిరీలను కూడా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే నష్టాల బాటలో పాడి రైతు
ఈ పాటికే పాడి రైతులు నష్టాల బాట పట్టారు. పాలు ధరలు గిట్టుబాటు కాక గేదెలను మండీకి తరలిస్తారు. ఇక్కడ వరిగడ్డి దొరక్క తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ప్రకాశం జిల్లాకు వరిగడ్డి లారీల ద్వారా కొనుగోలు చేసి తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. లారీ ఎండు గడ్డి కొనాలంటే రూ.25 వేల వరకు ధర పలుకుతోంది. వర్షాలు లేక, బోర్లు అడుగంటి గ్రామాల్లో పచ్చిగడ్డి మొత్తం ఎండిపోయింది. అసలే నష్టాల్లో ఉన్న పాడి రైతుకు ధర తగ్గించడం మూలిగే నక్కపై తాటికాయ పడిన సామెతగా తయారైందని పాడి రైతులు వాపోతున్నారు.

ఎన్నికలు ముగిస్తే డెయిరీ మూసేందుకు సిద్ధం
ఎన్నికలు ఉన్నాయన్న నెపంతోనే కేవలం ప్రభుత్వ డెయిరీని కొనసాగిస్తున్నారు. ఎన్నికలు పూర్తయితే డెయిరీని మూసివేసి మళ్లీ పాడి రైతులకు ధరలు తగ్గించి హెరిటేజ్‌ లాభాలు పొందేందుకు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డెయిరీ తెరిచిన తరువాత కూడా మూడు నెలల జీతాలు చెల్లించనట్లు సమాచారం. ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తే పాడి రైతులు తీవ్ర నష్టాల పాలయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాడి రైతులకు అండగా జగన్‌
జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే జిల్లా డెయిరీ అభివృద్ధి చెందుతుందని పాడి రైతులు అభిప్రాయపడుతున్నారు. పాడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో  2017 డిసెంబర్‌ 30న లీటరు పాలకు రూ.4 రాయితీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీతో జిల్లాలోని పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరువు కోరల్లో చిక్కిన ప్రకాశం జిల్లా పాడి రైతులకు వైఎస్సార్‌ రైతు బరోసా ఆసరాగా నిలుస్తోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement