అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు | Dalit Unions Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు

Published Mon, Jan 6 2020 4:23 AM | Last Updated on Mon, Jan 6 2020 4:37 AM

Dalit Unions Fires On Chandrababu - Sakshi

దళిత ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ను దూషిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దళిత, ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు తన కుల అహంకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డాయి. విజయకుమార్‌కు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాయి. మరోవైపు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ చట్టం కింద కేసు పెట్టాలంటూ పోలీస్‌స్టేషన్లలో దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు.

సాక్షి, అమరావతి :  బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు (బీసీజీ) నివేదికలోని అంశాలను మీడియాకు వివరించిన ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌పై మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఐదుగురు మంత్రులు తీవ్రంగా ఖండించారు. విజయకుమార్‌పై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని మంత్రులు నారాయణస్వామి, విశ్వరూప్, సుచరిత, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పాకే చంద్రబాబు బయటకు రావాలన్నారు. మున్సిపల్‌ శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి హోదాలో విజయకుమార్‌ బీసీజీ నివేదికపై మీడియాకు వివరించారని వారు గుర్తుచేశారు. దీనిపై చంద్రబాబు చేసిన విమర్శలు చౌకబారుగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అలాగే, విజయకుమార్‌ను ‘గాడు’ అనడం ద్వారా తన కుల దురహంకారాన్ని మరోసారి చంద్రబాబు చాటుకున్నారని మంత్రులు ధ్వజమెత్తారు. ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా? అని సీఎంగా ఉన్నప్పుడు వ్యాఖ్యానించిన చంద్రబాబు.. బీసీల తోకలు కత్తిరిస్తానని, ఎస్టీ మహిళల మీద చేయిచేసుకోవడం లాంటి సంఘటనలతో పలుమార్లు కులపరంగా తనకున్న దురహంకార నిజస్వరూపం బయటపడిందని మంత్రులు గుర్తుచేశారు. విజయకుమార్‌ బాధ్యతలేంటో.. ఆయన కులం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసని, అయినా ఉద్దేశపూర్వకంగానే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ప్రకటనలో మంత్రులు పేర్కొన్నారు. చంద్రబాబు ఇకపై నోటిని అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  

విజయకుమార్‌కు క్షమాపణ చెప్పాలి 
విజయకుమార్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లుగా అంబేడ్కర్‌ విగ్రహం పాదాలు పట్టుకుని క్షమాపణ అడగాల్సిందిగా చంద్రబాబును మంత్రులు డిమాండ్‌ చేశారు. అలాగే, స్వయంగా విజయకుమార్‌ వద్దకు వెళ్లి, ఆయనక్కూడా మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఇది జరిగే వరకూ చంద్రబాబు ఏ గ్రామంలో అడుగుపెట్టదలుచుకున్నా అక్కడి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలందరూ బాబును ఛీకొట్టాలన్నారు.

జ్యుడీషియల్‌ విచారణ చేయించాలి
చంద్రబాబు నాయుడు చేసిన సామాజిక నేరాలపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీ వేసి.. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. విజయకుమార్‌ను ‘వాడు’ అని సంబోధించడంలోనే చంద్రబాబులో ఉన్న అహంకారం ఏంటో తెలుస్తోంది. ఆయన గతంలోనూ దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలి. ఎన్నో కేసుల నుంచి, కోర్టుల నుంచి మాజీ సీఎం తప్పించుకు తిరుగుతున్నారు. చంద్రబాబు దోపిడీదారు, అవినీతిపరుడు. దళితులను అవమానించటమేగాక దాడులు చేయించిన ఘనుడు. గతంలో నాయీబ్రాహ్మణులనూ తోకలు కత్తిరిస్తానని బెదిరించారు. తాను ఉన్న సభలో జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు మాట్లాడలేదు.   
 – కత్తి పద్మారావు, దళిత  ఉద్యమ నేత

చంద్రబాబూ.. నోరు అదుపులో పెట్టుకో 
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి. దళిత ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ను ‘గాడు’ అని సంబోధించడం ఆయన కుల అహంకారానికి నిదర్శనం. ముఖ్యమంత్రి పదవి పోయేసరికి చంద్రబాబుకు చిన్న మెదడు దెబ్బతింది. ఆయన ఒక మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నాడు.  
    – కిషోర్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు

అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం హేయం. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా మాల ఉద్యోగులతో సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. 
    – నక్కా రాజశేఖర్, ఏపీ మాల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు 

దళితులు తలుచుకుంటే రోడ్డెక్కలేరు
ప్రణాళికా సంఘం కార్యదర్శిగా విజయకుమార్‌ తన బాధ్యతల నిర్వహణలో భాగంగా బీసీజీ నివేదికను రాష్ట్ర ప్రజలకు చదివి వినిపించారు. అతన్ని పట్టుకుని ‘విజయకుమార్‌ గాడు’ అని చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయటం దుర్మార్గం. రాష్ట్రంలోని దళితులు తలచుకుంటే చంద్రబాబు రోడ్లపై తిరగలేరు. విజయ్‌కుమార్‌ను అవమానించినందుకు బాబు అంబేద్కర్‌ విగ్రహం పాదాల వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పకపోతే దళిత జాతి ఆయనను క్షమించదు.     
    – ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

అనుచిత వ్యాఖ్యలు చేసే చరిత్ర ఆయనదే
బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికను మీడియాకు వివరించిన ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ను ‘గాడు’ అని సంబోధిస్తూ మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు తీరు ఆయనలోని నిరాశ, నిస్పృహలతో పాటు కుల అహంకారాన్ని బయటపెట్టింది. విజయకుమార్‌కు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. అధికారులను, ఉద్యోగులను బెదిరించడంతో పాటు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసే చరిత్ర  చంద్రబాబుదే. 
    –  ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి  

క్షమాపణ చెప్పకుంటే ఆందోళన
దళిత వర్గానికి చెందిన ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ని తీవ్రస్థాయిలో కించపరుస్తూ ‘వాడు’ అంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో మా ఉద్యోగ సంఘం చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది.
– రెడ్డిచర్ల ధనుంజయ్, సెర్ప్‌ ఎల్‌4, ఎల్‌5 స్థాయి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు 

బాబు అహంకారానికి నిదర్శనం
విజయకుమార్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం. ప్రభుత్వ పథకాల అమలు, పేదలకు సేవలందించడంలో విజయకుమార్‌ ఎప్పుడూ ముందుంటారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా, తూర్పు గోదావరి జిల్లా జేసీగా, ఎస్సీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌గా విశేష సేవలందించారు. 
– తాళ్ళూరి బాబూరాజేంద్ర ప్రసాద్‌ ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు 

క్షమాపణ చెప్పాల్సిందే..
విజయకుమార్‌ను కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక దళిత ఐఏఎస్‌ అధికారి విషయంలో ఆయన అలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 
– ఎస్‌.కృష్ణమోహన్‌రావు, ఏపీ మున్సిపల్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు  

ప్రతిపక్ష నేతను అరెస్టు చేయాలి
దళిత ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం చంద్రబాబును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద వెంటనే అరెస్టు చేయాలి.  అధికారం కోల్పోయిన చంద్రబాబు మతిభ్రమించి కుల అహంకారంతో దళిత అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 
– మేడిద బాబూరావు, ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సెక్రటరీ జనరల్‌ 

ఆందోళనలు చేస్తాం
రాష్ట్ర ప్రతినిధిగా మాట్లాడిన దళిత ఐఏఎస్‌ అధికారిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ఎస్సీ కమిషన్లు ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తాం.
– గోళ్ల అరుణ్‌కుమార్,మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు  

ప్రతి ఒక్కరూ ఖండించాలి
విజయకుమార్‌ను అవమానించిన చంద్రబాబుపై సుమోటోగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. గతంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బయ్యారపు ప్రసాదరావును డీజీపీగా రాకుండా ఆయన అడ్డుకున్నారు. ఇప్పుడు విజయకుమార్‌ను అవమానించిన చంద్రబాబు తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలి.     
–  పెరికే వరప్రసాదరావు, ఇండియన్‌ దళిత క్రిస్టియన్‌ రైట్స్‌ జాతీయ అధ్యక్షుడు 

ఐఏఎస్‌ అధికారిపై వ్యాఖ్యలు సరికాదు
ఒక బాధ్యతగల ఐఏఎస్‌ అధికారిని అవమానించేలా ప్రతిపక్షనాయకుడు దుర్భాషలాడటం సరికాదు. ప్రభుత్వానికి అందిన నివేదికలోని అంశాలను విజయకుమార్‌ సవివరంగా చెప్పడాన్ని సహించుకోలేక చంద్రబాబు పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఈ విధానం మంచిది కాదు. 
– ఏపీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి  జి.హృదయ రాజు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement