దళితులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
నెల్లూరు (సెంట్రల్): దళితులు, పేదలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఒక హోటల్‌లో మాజీ కార్పొరేటర్ స్వర్ణవెంకయ్య ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మాలమహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూపూడి మాట్లాడుతూ దళితులు, పేదల వల్లే నాయకులు అధికారంలోకి వస్తున్నారన్నారు. అగ్రవర్ణాలకు అనుకూలంగా బడ్జెట్ ఉందే తప్ప దళితులు, పేదలకు ఏదో మమ అనిపించేలా ప్రవేశ పెట్టారని ఎద్దేవా చేశారు.
దళితులు, పేదలు పారిశ్రామికంగా ఎదగాలంటే వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్‌లో దళితులకు ప్రత్యేక కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే దళితులకు దక్కాల్సిన పథకాలను సాధించుకుందామని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని దళితులందరూ ఏకమై అభివృద్ధి కోసం పోరాటాలు సాగిద్దామన్నారు. కులం కోసం చిరంజీవి, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీలు మనకవసరం లేదన్నారు. రాష్ర్టంలో ఎక్కువ ఓట్లు మనకే ఉన్నాయన్నారు. మనమందరం ఒకే తాటిపై ఉంటే రానున్న ఎన్నికల్లో ప్రతి పార్టీ మన వెనుకే ఉంటుందన్నారు. దళితుల అభివృద్ధికి చేయూతనిచ్చే వారికే మన మద్దతు ఇస్తామన్నారు.