
టీడీపీ హయాంలో దళితులకు రక్షణ లేదు
- వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రంలో దళితులకు రక్షణలేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జునఅన్నారు. దళితులపై జరిగిన దాడులు, దళిత ఉద్యోగులపై వేధింపులు, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చేసిన ఖర్చులన్నింటిపైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ కర్నూలు జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడిని టీడీపీ మద్దతుదారులు చంపించారని, అనంతపురం జిల్లా రాప్తాడు, తాడిపత్రి ప్రాంతాల్లో 9 మంది దళితులపై టీడీపీ వాళ్లు దాడి చేశారని చెప్పారు.
శ్రీకాకుళంలో ఒక దళిత ఎస్‌ఐ మరణానికి ఒక ఎమ్మెల్యే, పొన్నూరు పరిధిలోని సొసైటీ సీఈఓ కూచిపూడి గాంధీ ఆత్మహత్యకు మరో ఎమ్మెల్యే కారణమని ఆయన విమర్శించారు. నర్సారావుపేటలో మరో ఎస్‌సి ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం టీడీపీ నేతలేనన్నారు. వీటన్నింటిపైనా కేసులు నమోదు చేశారా? ఏం చర్యలు తీసుకున్నారు? అని ప్రభుత్వాన్ని మేరుగ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో అధికారులందరూ తమ వాళ్లే ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం దారుణమన్నారు. దళితుల ఉద్యోగులను కీలక స్థానాల్లో లేకుండా చేస్తున్నారని, వారిని సస్పెండ్ చేయిస్తూ ఇష్టానుసారం వేధింపులకు గురి చేస్తున్నారని నాగార్జున ఆవేదన వ్యక్తం చే శారు.