బాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం: ధర్మాన
బాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం: ధర్మాన
Published Tue, Feb 28 2017 9:53 PM | Last Updated on Sat, Jul 28 2018 2:46 PM
రావులపాలెం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా పూర్తిగా వైఫల్యం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ టీడీపీ అమలు చేయకుండా, అసలు గుర్తే లేనట్టు నటిస్తూ ప్రజలను మోసం చేస్తోందన్నారు.
రెండున్నరేళ్ల తరువాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులు ఓ వైపు చెబుతూనే మరో వైపు డబ్బులు లేక సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నామని చెప్పడం ప్రజలను మోసగించడమేనని చెప్పారు. వీటిలో ఏది వాస్తవమో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా 12.5 శాతం జీడీపీ వచ్చిందని, వచ్చే ఏడాది 15కు చేరుతుందని అంకెల్లో చెబుతున్న ప్రభుత్వం.. వాస్తవ పరిస్థితులను వెల్లడించడం లేదన్నారు. జీతాలు సక్రమంగా ఇవ్వకుండా, ఇళ్ల స్థలాలు, గృహ రుణాలు తదితర సంక్షేమ పథకాల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా నిధుల్లేవంటూ ప్రభుత్వం మోసం చెబుతుందన్నారు.
రాష్ట్ర చరిత్రలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సాధించిన 9.6 శాతం జీడీపీ అప్పట్లో రికార్డని అన్నారు. అప్పట్లో ఊహించని రెవెన్యూ రావడంతో బడ్జెట్‌లో చెప్పిన కార్యక్రమాలతోపాటు ఆర్థిక సంవత్సరం మధ్యలోనే పేదల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా ఉండాలని, అయితే టీడీపీ కక్ష సాధింపు, పక్షపాత ధోరణితో తమ వారికే కట్టబెడుతోందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో 50 శాతం మంది బాధితులుగా మారి ప్రభుత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నారు.
చంద్రబాబు సర్వేలన్నీ ఆయనకు వ్యతిరేకంగా రావడంతో ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారని చెప్పారు. ప్రజల తరపున పోరాడుతున్న జగన్‌ను కేసుల పేరుతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, దీనికి భయపడేది లేదని చెప్పారు. వాటిని ఎదుర్కొంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి జగన్ నాయకత్వంలో వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు జగన్ వెంట ఉన్నారని, ఎన్నికల్లో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, రాష్ట్ర కార్యదర్శులు కర్రి నాగిరెడ్డి, కర్రి పాపారాయుడు తదితరులు పాల్లొన్నారు.
Advertisement
Advertisement