దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం | Dasara Arrangements Are Completed In Vijayawada Durga Temple | Sakshi
Sakshi News home page

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం

Published Sat, Sep 28 2019 10:52 AM | Last Updated on Sat, Sep 28 2019 7:53 PM

Dasara Arrangements Are Completed In Vijayawada Durga Temple - Sakshi

విద్యుత్‌ దీపాల వెలుగుల్లో ఇంద్రకీలాద్రి

సాక్షి, ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 10 రోజుల పాటు జరిగే వేడుకలకు రాష్ట్ర నలుమూల నుంచి గాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తొలి రోజున ఉదయం 9 గంటలకు దర్శనంఉత్సవాలలో భాగంగా తొలి రోజైన 29వ తేదీ ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉత్సవాలలో తొలి రోజు ఆదివారం కావడంతో అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక కుంకుమార్చన, విశేష ఛండీయాగాలు ప్రారంభం అవుతాయి. ఆదివారం ఉత్సవాలలో తొలి రోజు కావడంతో రికార్డు స్థాయిలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.

వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు
అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులు వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్‌ల ద్వారా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. భవానీపురం వైపు నుంచి వచ్చే భక్తులు హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ నుంచి ప్రారంభయ్యే క్యూలైన్లను టోల్‌గేటు వద్ద మొయిన్‌ క్యూలైన్‌లో కలుపుతారు. కొండపై భాగంలో క్యూలైన్లు దాదాపు పూర్తి కాగా, కొండ దిగువన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దుర్గాఘాట్, దర్గా, రథం సెంటర్‌లో క్యూలైన్లు పనులు పూర్తి కావాల్సి ఉంది. మరో వైపున ఉత్సవాలకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఆదివారం నాటికి పనులు పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. 

ఉత్సవాల నాటికి రెండు లక్షల లడ్డూలు సిద్ధం
దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు ప్రసాదాలు అందేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కొండ దిగువన ఉన్న లడ్డూ తయారీ కేంద్రంలో రోజుకు లక్ష లడ్డూలను తయారు చేసే విధంగా సిబ్బందిని నియమించారు. ఆదివారం ఉత్సవాలు ప్రారంభం అయ్యే నాటికి రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేస్తామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మరో వైపున కొండపైన పాత వేద పాఠశాలలో పులిహోర ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన మేరకు పులిహోర తయారు చేస్తామని, ప్రతి రోజు 10 నుంచి 15 క్వింటాళ్లకు పైగా పులిహోర ప్రసాదం తయారు చేసే విధంగా సిబ్బంది అందుబాటులో ఉన్నారని  అధికారులు వివరిస్తున్నారు. ప్రసాదాల విక్రయాల కోసం దేవస్థానం కనకదుర్గనగర్‌లో  ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేశారు.

అర్జున వీధిలో అన్నదానం..
దసరా ఉత్సవాలలో నిత్యం వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అర్జున వీధిలో దేవస్థానం నిర్మించిన షెడ్డులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. ఇక మూలా నక్షత్రం, విజయదశమి రోజున భక్తుల రద్దీకి అనుగుణంగా  ప్రసాద వితరణ చేస్తామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.

మెట్ల మార్గంలో హోమగుండం
దసరా ఉత్సవాల పది రోజులు భక్తులు అమ్మవారి దీక్షను స్వీకరించడం జరుగుతుంది.  భక్తులు అమ్మవారికి ఇరుముడులను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని మెట్ల మార్గం దిగువన దేవస్థానం హోమ గుండాన్ని ఏర్పాటు చేసింది. హోమ గుండం సమీపంలోనే ఇరుముడులను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది దసరా ఉత్సవాల చివరి రెండు రోజులలో సుమారు 2 లక్షలు పైగా భవానీలు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఈ దఫా కూడా ఇదే తరహాలో భవానీలు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.

లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఇన్‌చార్జి మంత్రితో పాటు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌లు పరిశీలించారు. తొలుత కెనాల్‌రోడ్డులో ఏర్పాటు చేసిన క్యూలైన్లు.. తర్వాత సీతమ్మ వారి పాదాల వద్ద కేశఖండన శాలను పరిశీలించారు. ఉత్సవ ఏర్పాట్ల గురించి దేవస్థాన ఈవో ఎంవీ సురేష్‌బాబు, దేవస్థాన ఇంజినీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాలకు 15 నుంచి 18 లక్షల మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, ఆ రద్దీని తట్టుకునేలా ఏర్పాట్లు ఉండాలన్నారు.

5న సీఎం పట్టువస్త్రాల సమర్పణ..
కన్నబాబు మాట్లాడుతూ అక్టోబర్‌ 5వ తేదీన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారన్నారు. ఉత్సవాల సందర్భంగా గతంలో ఎదురైన ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని మరింత సమర్థంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉత్సవాలలో దేవదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్ల సేవలను వినియోగిస్తున్నామన్నారు.

తుది దశకు పనులు..
దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ దసరా ఉత్సవాల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వృద్ధులు, వికలాంగులకు అమ్మవారి దర్శనం త్వరతిగతిన పూర్త అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యటనలో సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డీసీసీ సీహెచ్, విజయరావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చక్రపాణి తదితరులు ఉన్నారు.

సాక్షి, అమరావతి: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసే భక్తులు, యాత్రికుల భద్రత దృష్ట్యా పటిష్ట చర్యలు చేపడుతున్నామని విజయవాడ పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు చెప్పారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ.. వీఐపీల రాక కారణంగా వారు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 4,500 మంది అధికారులు, సిబ్బందిని మోహరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయవాడ కమిషనరేట్‌ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు..అంచనా 16 లక్షల మంది..ఈ ఏడాది జరిగే దసరా ఉత్సవాలకు సుమారు 16 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు సీపీ చెప్పారు. సాధారణ రోజుల్లో 50వేల నుంచి లక్ష మంది వరకు, మూలా నక్షత్రం రోజున 2.5లక్షల మంది వస్తారని.. ప్రారంభోత్సవం ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయన్నారు. తెప్పోత్సవం సందర్భంగా కూడా భక్తుల సంఖ్య అధికంగా ఉంటారని భావిస్తున్నామని.. దీంతో అదే స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

25 సెక్టార్లుగా విభజన..
ఈ ఏడాది బందోబస్తును 25 సెక్టార్లుగా విభజించి, కమిషనరేట్‌ పరిధిలోని 2వేల మంది సిబ్బందితోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చే మరో 2,500 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని సీపీ తెలిపారు. వీరితోపాటు 35 సాయుధ పోలీసు ప్లటూన్‌లను వినియోగిస్తున్నామన్నారు. ఎక్కువ మందిని ఆలయం, దుర్గా ఘాట్, పరిసర ప్రాంతాల్లో మోహరించామని.. మిగిలిన వారిని ట్రాఫిక్, కీలకమైన చోట్ల ఉంచుతామని చెప్పారు. మొత్తం మూడు విడతల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు.

సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా
నగరంలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఈసారి ఎక్కువ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. డ్రోన్లను వినియోగిస్తున్నామని.. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామని చెప్పారు. సీసీ కెమెరాలతో పాటు, మఫ్తీలో పోలీసు సిబ్బంది గమనిస్తుంటారని.. చోరీలు, వంటి వాటిని అరికట్టే లక్ష్యంతో వీరు పనిచేస్తారని తెలిపారు. çకంట్రోల్‌ రూమ్‌ల ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. ఒకటో పట్టణ స్టేషన్, నగర పోలీసు కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని.. 24 గంటల పాటు ఇక్కడ సిబ్బంది పరిశీలిస్తుంటారని పేర్కొన్నారు. వర్షాలు పడుతున్నందున విధుల్లో ఉన్న సిబ్బందికి రెయిన్‌ కోట్లు కూడా ఇస్తున్నామన్నారు.

భవానీ సేవాదళ్‌ ఆసరా
గత ఏడాది మాదిరిగానే ఈసారి భవానీ సేవాదళ్‌ సిబ్బంది ద్వారా వృద్ధులు, దివ్యాంగులకు సాయం అందిస్తారని చెప్పారు. మొత్తం 120 మంది విధుల్లో ఉంటారని.. ప్రతి షిఫ్ట్‌లో 40 మంది పనిచేస్తారన్నారు.

భక్తుల సౌకర్యార్థం సమాచార కేంద్రాలు.. 
ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం నగరంలో ఏడు చోట్ల పోలీసు శాఖ ఆధ్వర్యంలో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆలయంలో రద్దీ ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోవచ్చని తెలిపారు. పరిస్థితిని బట్టి దర్శనానికి వెళ్లొచ్చని. వన్‌టౌన్, భవానీపురం, పోలీసు కంట్రోల్‌ రూమ్, పోలీసు కమిషనర్‌ కార్యాలయం, స్టేట్‌ గెస్ట్‌ హౌస్, కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం, పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్‌లో వీటిని ఏర్పాటు చేశామన్నారు.

వీఐపీల దర్శనానికి ప్రత్యేక సమయాలు..
అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వీఐపీలు కూడా రానున్నారన్నారు. దీని వల్ల సాధారణ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రముఖులకు నాలుగు సమయాల్లో ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. వీఐపీలు కచ్చితంగా ఆ సమయాలలోనే రావాల్సి ఉంటుందన్నారు. ఉదయం 7 నుంచి 8, 11 నుంచి 12, మధ్యాహ్నం 3 నుంచి 4, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు అనుమతించే ఆలోచన ఉందని చెప్పారు. 

పార్కింగ్‌కు ప్రత్యేక యాప్‌.. 
ఆలయానికి సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం సమీపంలో పలుచోట్ల పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేశామని సీపీ చెప్పారు. దాదాపు 12 చోట్ల ద్విచక్ర వాహనాలు, కార్లు నిలిపేందుకు ఆస్కారం ఉదన్నారు. దీని కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ యాప్‌ను రూపొందించామని.. మొబైల్‌లోనే తమ సమీపంలోని పార్కింగ్‌ ప్రాంతాలను చూసుకునే అవకాశంతోపాటు అక్కడ ఎంత జాగా ఉందో కూడా తెలుసుకోవచ్చన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement