సాక్షి, అమరావతి: ఐఏఎస్ అధికారులు దాచుకోవడానికి కూడా వీలు లేని కీలకమైన సంక్షేమ పథకాల లబ్ధిదారుల సమగ్ర సమాచారం ఐటీ గ్రిడ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా టీడీపీ సామాన్య కార్యకర్త మొబైల్‌లో కూడా ప్రత్యక్షం కావడం వెనుక ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ప్రత్యక్ష ప్రమేయం ఉందన్న వాస్తవం క్రమంగా వెలుగులోకి వస్తోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి హోదాతోపాటు మంత్రి హోదాలోనూ ఉన్న సీఎం తనయుడు నారా లోకేష్ ఇందులో కీలక పాత్ర పోషించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో తమ పార్టీకి ఉపయోగపడేలా ఐటీ గ్రిడ్ సంస్థ ద్వారా లోకేష్ ఓ విశ్లేషణ తయారు చేయించారు. ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు)
చంద్రబాబు 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గాల వారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందనే వివరాలను దీంట్లో పొందుపరిచారు. ఇందుకోసం ఈ వివరాలన్నీ ఐటీ గ్రిడ్ సంస్థకు ప్రభుత్వ పెద్దలు అప్పగించేశారు. శాఖల వారీగా, సంక్షేమ కార్యక్రమాల వారీగా ఏ గ్రామంలో ఎవరికి ప్రభుత్వ సాయం ఎంత అందిందనే వివరాలను సీఎంవో సూచనల మేరకు ఐటీ గ్రిడ్ కంపెనీకి చేరవేసినట్లు పలువురు అధికారులు అనధికారిక సంభాషణల్లో వెల్లడిస్తున్నారు. సీఎంవో కోరగానే ‘ఆన్‌లైన్’ డేటా వివరాలను ప్రతి శాఖ పరిధిలో సేకరించి అందచేసినట్లు పేర్కొంటున్నారు. ఆ తర్వాత ఆ వివరాలన్నీ ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చేరి ఉంటాయని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. (డేటా చోర్.. బాబు సర్కార్)
ఏడాది నుంచే పక్కాగా...
‘ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ సిస్టమ్స్’ పేరుతో నియోజకవర్గాలవారీగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమగ్ర సమాచారంతోపాటు మండలాలు, గ్రామాలవారీగా ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందన్న వివరాలను ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ క్రోడీకరించి తిరిగి ప్రభుత్వ పెద్దలకు అందజేసింది. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ప్రభుత్వం ఎంత వెచ్చించిందనే వివరాలను వీటి ఆధారంగానే ఇటీవల టీడీపీ నాయకులు తరచూ చెబుతూ వస్తున్నారు. ఇవన్నీ ఐటీ గ్రిడ్ ద్వారా నియోజకవర్గాలవారీగా లోకేష్ తయారు చేయించిన విశ్లేషణ వివరాలేనని చెబుతున్నారు. 2019 ఎన్నికల కోసం ఏడాది నుంచే ఐటీ గ్రిడ్ సంస్థ ద్వారా ఈ విశ్లేషణ రూపొందిస్తున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు, లోకేష్ ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశాల్లో వివరిస్తూ వీటిపై ప్రచారం చేయాలని చెబుతూ వచ్చారు. ప్రభుత్వం ఐటీ గ్రిడ్ సంస్థకు ఇచ్చిన సమాచారం టీడీపీ సేవామిత్ర యాప్‌లోకి చేరిపోయినట్లు భావిస్తున్నారు. (డేటా స్కామ్ డొంక కదులుతోంది!)
ప్రభుత్వ ఖర్చా.. పార్టీ ఖర్చా?
టీడీపీకి సాంకేతిక అంశాల్లో సహాయ సహకరాలు అందించే ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కే లోకేష్ తన మంత్రిత్వ శాఖలో పలు కాంట్రాక్టులు అప్పగించారు. ఈ నేపథ్యంలో ‘ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ సిస్టమ్స్’ కార్యక్రమం ఎవరి ఖర్చుతో చేపట్టారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
రైతుల భూముల వివరాలు కూడా లీకే?
రాష్ట్రంలో రైతులందరి భూముల వివరాలు, ఏ సర్వే నెంబరులో ఎవరికి ఎంత భూమి ఉందనే వివరాలు కూడా ఐటీ గ్రిడ్ సంస్థకు చేరి ఉంటాయని అధికారవర్గాలు అనుమానిస్తున్నాయి. నియోజకవర్గాలవారీగా ప్రభుత్వ కార్యక్రమాలపై విశ్లేషణ పేరుతో పింఛన్ల పంపిణీ, రేషన్ కార్డుల వివరాలు, మీభూమిలో రైతుల డేటా, పసుపు కుంకుమ లబ్ధిదారులు, ఉపాధి పనులతోపాటు కూలీలకు ఎంత మొత్తం చెల్లింపులు జరిగాయి?, రుణ మాఫీ రైతుల వివరాలు, వారి బ్యాంకు ఖాతాలు, సీఎం సహాయ నిధి ద్వారా ఏ ఊరికి ఎంత సాయం అందింది?, ఇతర సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఆన్‌లైన్ డేటా వివరాలను సీఎంవో తీసుకుందని అధికార వర్గాలు అంటున్నాయి.
బూఫ్రాగ్ – లోకేష్ – ఐటీ గ్రిడ్
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఐటీ గ్రిడ్’, బ్లూప్రాగ్ సంస్థలతో మంత్రి లోకేష్‌కు సన్నిహిత సంబంధం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ సంస్థ డైరెక్టర్ అశోక్ ఎక్కువగా మంత్రి లోకేష్ కార్యాలయంలోనే ఉంటారని అధికారులు అంటున్నారు. అందువల్లే లోకేష్ అధికారికంగా నిర్వహించే డ్యాష్ బోర్డును ఐటీ గ్రిడ్ సంస్థకు అప్పగించారని అధికారులు అంటున్నారు. బ్లూప్రాగ్ సంస్థ మంత్రి లోకేష్ ద్వారా పలు కాంట్రాక్టులు దక్కించుకుంది. (చంద్రబాబు, లోకేశ్ మార్గదర్శనంలో...క్యాష్ ఫర్ ట్వీట్!)
ఉపాధి కూలీల మస్టర్ల తయారీ కాంట్రాక్టుతోపాటు స్వచ్ఛ భారత్ కింద నిర్మించిన మరుగుదొడ్ల జియోట్యాగింగ్ బాధ్యతను ఈ ఐటీ గ్రిడ్ కంపెనీకే అప్పగించారు. ఇందుకోసం గ్రామీణాభివృద్ధి శాఖ ఏటా రూ.కోటికిపైగా చెల్లిస్తుండగా, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద రూ.2.5 కోట్లు చెల్లించినట్లు సమాచారం. డ్వాక్రా మహిళల ఎం బుక్ వివరాల నిర్వహణను బ్లూప్రాగ్ సంస్థకు అప్పగించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఏటా కోటి రూపాయల వరకు చెల్లిస్తోంది. పంచాయతీరాజ్ శాఖలోనే ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుకు కరెంట్ స్తంభాల జియో ట్యాగింగ్‌ను ఈ కంపెనీకే అప్పగించారు. ఇలా అనేక కాంట్రాక్టులు ‘బ్లూప్రాగ్’కు కట్టబెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment