వృద్ధురాలిని ఆస్పత్రికి తరలిస్తున్న సీఐ నరసింహమూర్తి
వీరులపాడు (నందిగామ) : నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిని వృద్ధాప్యంలో రోడ్డున పడేశా రు. ఇద్దరు కుమార్తెలు తల్లికున్న ఆస్తిని, నగలను పంచుకొన్నారు. ఏమీ కాని దానిలా ఒంటరిగా రేకుల షెడ్డుకు పరిమితం చేశారు. తిండి, తిప్పలు లేక అలమటిస్తున్నా పట్టించుకొనే వారు లేక పండుటాకు పడిన అవస్థలు వర్ణనాతీతం. కని పెంచిన తల్లి అనే కనికరం లేకుండా కుమార్తెలు ప్రవర్తించిన హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టించింది. సేకరించిన సమాచా రం మేరకు వివరాలిలా ఉన్నాయి. వీరులపాడు మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొత్తా లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. భర్త కృష్ణ ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. కూలీనాలీ చేసుకొంటూ తమకున్నంతలో కుమార్తెలను పెంచి పెద్ద చేసి ఓ అయ్య చేతిలో పెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన అరెకరం భూమితో పాటు రెక్కల కష్టంతో వెనకేసుకున్న సుమారు రూ.10 లక్షలను వడ్డీకి తిప్పుతూ లక్ష్మి బతుకుతోంది.
ఆస్తి కాజేసిన కుమార్తెలు..
కొంత కాలం క్రితం లక్ష్మికున్న అరెకరం భూమి, నగదు, బంగారు ఆభరణాలను కుమార్తెలు ఇద్దరు పంచుకొని ఎవరి దారిన వారు వెళ్లిపోయా రు. దీంతో లక్ష్మి అనాధలా గ్రామంలో ఉంటోం ది. ఆరోగ్యం క్షీణించటంతో తన పనులు కూడా చేసుకోలేని నిస్సహాయ స్థితికి చేరింది. అయినా కుమార్తెలు కన్నెత్తి కూడా చూడకపోవటంతో తిండి, తిప్పలు లేక నానా అవస్థలు పడుతోంది. విషయం తెలుసుకొన్న నందిగామ రూరల్ సీఐ నవీన్ నరసింహమూర్తి అక్కడకు చేరుకుని వృద్ధురాలిని 108 సహాయంతో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆయన మాట్లాడుతూ కుమార్తెలు మధిర, ఖమ్మం జిల్లాలో నివాసముంటున్నారని చెప్పారు. తల్లి గురించి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించినా వారి నుంచి స్పందన లేదన్నారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కూడా కుమార్తెలు ఆదరించకుంటే అనాధాశ్రమంలో చేర్పించనున్నట్లు తెలిపారు. వృద్ధురాలి విషయంలో సీఐ చొరవను పలువురు అభినందించారు. ఆయనతో పాటు ఎస్‌ఐ లక్ష్మణ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment