గోదావరికి ఎర్ర నీరు
* దవళేశ్వరం ఆనకట్ట నుంచి 37 వేల క్యూసెక్కులు సముద్రంలోకి
* ఎగువన తగ్గుముఖం పట్టిన వర్షాలు.. తగ్గనున్న వరద
కొవ్వూరు : గోదావరిలోకి వరద జలాలు పెరిగాయి. దీంతో ధవళేశ్వరం ఆనకట్టకున్న 175 గేట్లలో 120 గేట్లను ఎత్తి 37,054 క్యూసెక్కుల మిగులు జలాలను అధికారులు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం వద్ద 50 గేట్లను ఎత్తి 15,541 క్యూసెక్కులు, ర్యాలీ ఆర్మ్‌లో 30 గేట్ల ద్వారా 9,325 క్యూసెక్కులు, మద్దూరు ఆర్మ్‌లో 15 గేట్లు ఎత్తి 4,615 క్యూసెక్కులు, విజ్జేశ్వరం ఆర్మ్‌లో 25 గేట్లు ఎత్తి 7,573 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 11,600 క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాల నిమిత్తం వదులుతున్నారు. తూర్పు డెల్టాకు 3,300, సెంట్రల్ డెల్టాకు 2,300, పశ్చిమ డెల్టాకు 6 వేల క్యూసెక్కుల చొప్పున సాగునీటిని విడిచిపెడుతున్నారు.
ఎగువ ప్రాంతంలో తగ్గుతున్న నీటిమట్టం
గోదావరి ఎగువ ప్రాంతంలో గురువారం నీటిమట్టం తగ్గుముఖం పట్టాయని కేంద్ర జలసంఘం అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతంలో గురువారం వర్షాలు పడలేదని, దీంతో నీటిమట్టాలు తగ్గుతున్నట్టు తెలిపారు. దుమ్ముగూడెంలో గురువారం ఉదయం 4.58 మీటర్లు ఉన్న నీటిమట్టం సాయంత్రానికి 6.10 మీటర్లకు పెరగగా భద్రాచలంలో 8.9 మీటర్లు ఉన్న నీటిమట్టం సాయంత్రానికి 11.7 మీటర్లకు పెరిగింది. ఈ నీరు ధవళేశ్వరం ఆనకట్ట వద్దకు చేరుకోడానికి 18 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. బుధవారం గోదావరి పరివాహకంలో వర్షాలు కురిశాయని, గురువారం వర్షం పడకపోవడంతో నీటిమట్టాలు తగ్గుతున్నాయన్నారు. దిగువున ఉన్న ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.