dhavaleswaram dam
-
వదలని వరద
సాక్షి నెట్వర్క్: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఉప నదులైన శబరి, ఇంద్రావతితోపాటు సీలేరు, కొండవాగుల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద బుధవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినా సాయంత్రం మళ్లీ జారీ చేశారు. 10,45,342 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఆనకట్ట వద్ద బుధవారం రాత్రి 8 గంటలకు 12.20 అడుగుల నీటిమట్టం నమోదైంది. భద్రాచలం వద్ద నీటిమట్టం సాయంత్రం 5 గంటలకు 41.10 అడుగులకు చేరుకుంది. వరద మరింత పెరిగితే పశ్చిమ గోదావరి జిల్లా పాత పోలవరం గ్రామాన్ని ఆనుకుని ఉన్న నెక్లెస్ బండ్‌కు గండి పడే అవకాశం ఉంది. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ, లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. కపిలేశ్వరపురం, పి.గన్నవరం, కొత్తపేట, రావులపాలెం, అల్లవరం, ముమ్మిడివరం, కాజులూరు, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో సుమారు 17 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. రాజోలు నియోజక వర్గంలో వెయ్యికిపైగా గృహాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అల్లవరం మండలంలో 40 ఇళ్లు ముంపులో చిక్కుకున్నాయి. పల్లిపాలెంలో 60 ఇళ్లు నీట మునిగాయి. కె.గంగవరం మండలం కోటిపల్లిలో 250 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. దేవీపట్నం మండలంలో 4,500 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. శ్రీశైలానికి భారీ వరద కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. శ్రీశైలం జలాశయంలోకి బుధవారం సాయంత్రం 6 గంటలకు 2,81,388 క్యూసెక్కులు చేరగా కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జున సాగర్‌కు.. కల్వకుర్తి ఎత్తిపోతల, హంద్రీ–నీవా, పోతిరెడ్డిపాడు ద్వారా 81,458 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 155 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మరో 61 టీఎంసీలు చేరితే జలాశయం పూర్తిగా నిండుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి దిగువకు 4.50 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్టు కర్ణాటక సర్కార్ బుధవారం తెలిపింది. భీమా నదిపై ఉజ్జయిని జలాశయం నిండిపోవడంతో గేట్లు ఎత్తేసి 1.75 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం 4.50 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. ఉగ్రరూపం దాల్చిన వంశధార, నాగవళి వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. తీర గ్రామాలను వంశధార ముంచెత్తింది. తోటపల్లి బ్యారేజిలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. జియ్యమ్మవలస మండలం బాసంగిలో 30 ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి బాధితుల్ని పరామర్శించారు. శ్రీకాకుళం జిల్లాకు వరద ముప్పు పొంచి ఉంది. వసప, నివగాం మాతల రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు గ్రామాల్లో మంత్రుల పర్యటన దేవీపట్నం ముంపు గ్రామాల్లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు నాగులపల్లి ధనలక్ష్మి, జక్కంపూడి రాజా, తెల్లం బాలరాజు, పార్టీ నేత అనంత ఉదయభాస్కర్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ రేఖారాణి, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ నయీం అస్మీ, ఐటీడీఏ పీఓ నిషాంత్‌కుమార్ బుధవారం పర్యటించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని మంత్రి అనిల్ అభయమిచ్చారు. -
వరద గోదారి
భయం గుప్పెట్లో ‘పశ్చిమ’ - మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో నీటిమట్టం - 26 గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు - ఆనకట్ట వద్ద 14.70 అడుగులు దాటిన నీటిమట్టం - నీట మునిగిన కాజ్‌వేలు - లంక గ్రామాల్లో పంటల్ని ముంచెత్తిన వరద - అప్రమత్తమైన అధికార యంత్రాంగం సాక్షి, ఏలూరు/కొవ్వూరు : గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటి ప్రవాహం మూడో ప్రమాద హెచ్చరికకు చేరువ అవుతోంది. సోమవారం రాత్రి 10గంటలకు ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 14.70 అడుగులకు చేరింది. మంగళవారం నాటికి 17 అడుగులకు దాటిపోయే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించారుు. పోల వరం మండలంలోని ఏజెన్సీ ప్రధాన రహదారి నీటమునగడంతో 26 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయూరుు. లంక గ్రామా ల్లో పంటలు ముంపుబారిన పడ్డాయి. పోలవరం మండలం కొత్తూరు, కోండ్రుకోట కాజ్వేతోపాటు కడెమ్మ వంతెన మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. పెరవలి మండలంలో లంకలు నీటమునిగాయి. 4వేల ఎకరాల్లో అరటి, కంద, బొప్పాయి, ఆకు కూరలు, కొబ్బరి, తమలపాకు తోటలు ముంపుబారిన పడ్డాయి. ఆచంట మండలంలోని లంక గ్రామాల ప్రజలు ముంపు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అనగారలంక, కోడేరులంక, అయోధ్యలంక, మర్రిమూల, పుచ్చల్లంక గ్రామాలకు ముంపు ముప్పు పొంచివుంది. కోడేరులంక వద్ద రెండు ఇంజిన్ పడవలు సిద్ధం చేశారు. యలమంచిలి మండలం కనకాయలంక వద్ద కాజ్వే పూర్తిగా నీట మునిగింది. కాజ్వే మీదుగా రాకపోకలు సాగిం చే వీలు లేకపోవడంతో నాటు పడవలను ఏర్పాటుచేశారు. లంక గ్రామాలైన దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, యలమంచిలిలంక, బాడవ గ్రామాలకు ముంపు పొంచివుంది. కలెక్టర్ కె.భాస్కర్ పోలవరం కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు మండలాల్లో పర్యటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ డీఈలు, ఏఈలను ఎస్ఈ టీవీ సూర్యప్రకాష్ అప్రమత్తం చేశారు. ప్రమాద స్థాయిలో నీటి ప్రవాహం గోదావరిలో నీటి ప్రవాహం ప్రమాద స్థారుులో కొనసాగుతోంది. సోమవారం ఉదయం 9గంటలకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 11.75 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను, సాయంత్రం 5గంటలకు 13.75 అడుగులు దాట డంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలంలో సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 56 అడుగులకు చేరింది. అక్కడ మరో రెండు, మూడు అడుగుల మేర నీరు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద కూడా నీటిమట్టం మరింతగా పెరగనుంది. ఆనకట్ట వద్ద నీటిమట్టం 17.75 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఆనకట్ట వద్ద సోమవారం రాత్రి 7గంటలకు నీటిమట్టం 14.30 అడుగులకు, రాత్రి 10గంటలకు 14.70 అడుగులకు చేరింది. 175 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తివేశారు. రాత్రి 7 గంటలకు 14,20,937 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. వరద ముంపులో గోష్పాద క్షేత్రం కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం పూర్తిగా నీటముని గింది. సుమారు ఆరు అడుగుల మేరకు నీరు ఆల యాలను చుట్టుముట్టి ప్రవహిస్తోంది. ఆలయాల్లోకి ఎవరూ వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం నుంచి ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు నిలిచిపోయాయి. కలెక్టర్ కె.భాస్కర్, ఎమ్మెల్యే కేఎస్ జవహర్, మునిసిపల్ చైర్మన్ సూరపనేని చిన్ని వరద ఉధృతిని పరిశీలించారు. అప్రమత్తంగా ఉన్నాం గోదావరి వరదను దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ భాస్కర్ తెలిపారు. జిల్లాస్థాయి అధికారులను ఒక్కొక్కరిని ఒక్కో మండలానికి ఇన్చార్జిలుగా నియమించామన్నారు. పోలవరం ఎగువ ప్రాంతంలోని 26 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పరిస్థితిని సమీక్షించే బాధ్యతను డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డికి అప్పగించామన్నారు. కేంద్ర జల సం ఘం అధికారుల అంచనాల కంటే వరద ఎక్కువగా వస్తోందన్నారు. ముందస్తుగా పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఏటిగట్ల ఎప్పుటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులను ఆదేశించామని, ఇసుక బస్తాల సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచనలు ఇచ్చామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. నిలిచిన వినాయక నిమజ్జనాలు గోదావరిలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో గోష్పాద క్షేత్రం వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనాలను అధికారులు నిలిపివేశారు. నిమజ్జనానికి తరలివస్తున్న విగ్రహాలను పోలీసులు రాజమండ్రి పంపించారు. ఎగువ ప్రాంతంలో వరద క్రమేణా పెరుగుతుండటంతో మద్దూరులంక గ్రామానికి వరద ముప్పు పొంచి ఉంది. తహసిల్దార్ పి.కనకరాజు ఆధ్వర్యంలో రెవెన్యూ యంత్రాంగం షిఫ్ట్‌ల వారీగా నియమించారు. నది ఒడ్డున ఉంటున్న 20 కుటుంబాలను మద్దూరు హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించినట్టు తహసిల్దార్ తెలిపారు. -
గోదావరికి ఎర్ర నీరు
* దవళేశ్వరం ఆనకట్ట నుంచి 37 వేల క్యూసెక్కులు సముద్రంలోకి * ఎగువన తగ్గుముఖం పట్టిన వర్షాలు.. తగ్గనున్న వరద కొవ్వూరు : గోదావరిలోకి వరద జలాలు పెరిగాయి. దీంతో ధవళేశ్వరం ఆనకట్టకున్న 175 గేట్లలో 120 గేట్లను ఎత్తి 37,054 క్యూసెక్కుల మిగులు జలాలను అధికారులు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం వద్ద 50 గేట్లను ఎత్తి 15,541 క్యూసెక్కులు, ర్యాలీ ఆర్మ్‌లో 30 గేట్ల ద్వారా 9,325 క్యూసెక్కులు, మద్దూరు ఆర్మ్‌లో 15 గేట్లు ఎత్తి 4,615 క్యూసెక్కులు, విజ్జేశ్వరం ఆర్మ్‌లో 25 గేట్లు ఎత్తి 7,573 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 11,600 క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాల నిమిత్తం వదులుతున్నారు. తూర్పు డెల్టాకు 3,300, సెంట్రల్ డెల్టాకు 2,300, పశ్చిమ డెల్టాకు 6 వేల క్యూసెక్కుల చొప్పున సాగునీటిని విడిచిపెడుతున్నారు. ఎగువ ప్రాంతంలో తగ్గుతున్న నీటిమట్టం గోదావరి ఎగువ ప్రాంతంలో గురువారం నీటిమట్టం తగ్గుముఖం పట్టాయని కేంద్ర జలసంఘం అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతంలో గురువారం వర్షాలు పడలేదని, దీంతో నీటిమట్టాలు తగ్గుతున్నట్టు తెలిపారు. దుమ్ముగూడెంలో గురువారం ఉదయం 4.58 మీటర్లు ఉన్న నీటిమట్టం సాయంత్రానికి 6.10 మీటర్లకు పెరగగా భద్రాచలంలో 8.9 మీటర్లు ఉన్న నీటిమట్టం సాయంత్రానికి 11.7 మీటర్లకు పెరిగింది. ఈ నీరు ధవళేశ్వరం ఆనకట్ట వద్దకు చేరుకోడానికి 18 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. బుధవారం గోదావరి పరివాహకంలో వర్షాలు కురిశాయని, గురువారం వర్షం పడకపోవడంతో నీటిమట్టాలు తగ్గుతున్నాయన్నారు. దిగువున ఉన్న ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.