వదలని వరద | Flowing Flood in Godavari | Sakshi
Sakshi News home page

వదలని వరద

Published Thu, Aug 8 2019 4:55 AM | Last Updated on Thu, Aug 8 2019 5:06 AM

Flowing Flood in Godavari - Sakshi

బుధవారం విజయనగరం జిల్లా తోటపల్లి బ్యారేజి వద్ద పరవళ్లు తొక్కుతున్న నాగావళి

సాక్షి నెట్‌వర్క్‌: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఉప నదులైన శబరి, ఇంద్రావతితోపాటు సీలేరు, కొండవాగుల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద బుధవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినా సాయంత్రం మళ్లీ జారీ చేశారు. 10,45,342 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఆనకట్ట వద్ద బుధవారం రాత్రి 8 గంటలకు 12.20 అడుగుల నీటిమట్టం నమోదైంది. భద్రాచలం వద్ద నీటిమట్టం సాయంత్రం 5 గంటలకు 41.10 అడుగులకు చేరుకుంది. వరద మరింత పెరిగితే పశ్చిమ గోదావరి జిల్లా పాత పోలవరం గ్రామాన్ని ఆనుకుని ఉన్న నెక్లెస్‌ బండ్‌కు గండి పడే అవకాశం ఉంది.

పోలవరం మండలంలోని 19 గ్రామాలకు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ, లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. కపిలేశ్వరపురం, పి.గన్నవరం, కొత్తపేట, రావులపాలెం, అల్లవరం, ముమ్మిడివరం, కాజులూరు, రాజమహేంద్రవరం రూరల్‌ మండలాల్లో సుమారు 17 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. రాజోలు నియోజక వర్గంలో వెయ్యికిపైగా గృహాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అల్లవరం మండలంలో 40 ఇళ్లు ముంపులో చిక్కుకున్నాయి. పల్లిపాలెంలో 60 ఇళ్లు నీట మునిగాయి. కె.గంగవరం మండలం కోటిపల్లిలో 250 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. దేవీపట్నం మండలంలో 4,500 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు.

శ్రీశైలానికి భారీ వరద
కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. శ్రీశైలం జలాశయంలోకి బుధవారం సాయంత్రం 6 గంటలకు 2,81,388 క్యూసెక్కులు చేరగా కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జున సాగర్‌కు.. కల్వకుర్తి ఎత్తిపోతల, హంద్రీ–నీవా, పోతిరెడ్డిపాడు ద్వారా 81,458 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 155 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మరో 61 టీఎంసీలు చేరితే జలాశయం పూర్తిగా నిండుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల నుంచి దిగువకు 4.50 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్టు కర్ణాటక సర్కార్‌ బుధవారం తెలిపింది. భీమా నదిపై ఉజ్జయిని జలాశయం నిండిపోవడంతో గేట్లు ఎత్తేసి 1.75 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం 4.50 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. 

ఉగ్రరూపం దాల్చిన వంశధార, నాగవళి
వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. తీర గ్రామాలను వంశధార ముంచెత్తింది. తోటపల్లి బ్యారేజిలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. జియ్యమ్మవలస మండలం బాసంగిలో 30 ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి బాధితుల్ని పరామర్శించారు. శ్రీకాకుళం జిల్లాకు వరద ముప్పు పొంచి ఉంది. వసప, నివగాం మాతల రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ముంపు గ్రామాల్లో మంత్రుల పర్యటన
దేవీపట్నం ముంపు గ్రామాల్లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు నాగులపల్లి ధనలక్ష్మి, జక్కంపూడి రాజా, తెల్లం బాలరాజు, పార్టీ నేత అనంత ఉదయభాస్కర్, ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌ రేఖారాణి, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ నయీం అస్మీ, ఐటీడీఏ పీఓ నిషాంత్‌కుమార్‌ బుధవారం పర్యటించారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని మంత్రి అనిల్‌ అభయమిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement