- ట్రాఫిక్ నియంత్రణపై నిఘా
- జనమైత్రి సంఘాల విస్తృతం
- నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ
మచిలీపట్నం క్రైం : నేరాలను అరికట్టేందుకు పోలీసులు పగలు, రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని ఎస్పీ జె.ప్రభాకరరావు ఆదేశించారు. జరుగుతున్న చోరీలను అరికట్టాలంటే పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. విధుల్లో అలసత్వం వహించినా, స్టేషన్‌కు వచ్చే బాధితుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
గురువారం ఆయన తన కార్యాలయంలో జిల్లాలోని ఇతర అధికారులతో కలిసి నేరసమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయం కోసం స్టేషన్‌లను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో జరుగుతున్న చోరీలపై ప్రత్యేక పోలీసు నిఘా ఉంచాలని చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో జనమైత్రి సంఘాలను మరింత విస్తరింపజేయాలని సూచించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తుండాలని చెప్పారు. బందరు, గుడివాడ, నూజివీడు, నందిగామ, జగ్గయ్యపేట, హనుమాన్‌జంక్షన్‌లలో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందన్నారు.
ఈ నేపథ్యంలో ఆయా సబ్‌డివిజన్‌లలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రోడ్లపై పశువులు సంచరించకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.ఆటోల్లో పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించుకుంటున్న డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనవసరమైన విషయాల్లో ఏ ఒక్కరినీ లాకప్‌లో పెట్టవద్దని సూచించారు.
ఒకవేళ ఎవరినైనా లాకప్‌లో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడితే సదరు విషయాన్ని అదే రోజు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం జిల్లాలోని వివిధ స్టేషన్‌లలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లపై ఆరా తీశారు. వాటి పరిష్కారానికి సత్వరమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ బీడీవీ సాగర్, బందరు, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ డీఎస్పీలు డాక్టర్ కేవీ శ్రీనివాసరావు, జీ నాగన్న, కే సూర్యచంద్రరావు, డీసీహెచ్ హుస్సేన్, కే హరిరాజేంద్రబాబు, ఎస్బీ సీఐ పీ మురళీధర్, డీసీఆర్‌బీ సీఐ బాలరాజు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.