మృతిచెందిన యూసుఫ్
బుడిబుడి నడకలతో, వచ్చీరాని మాటలతో ఇంట్లో వారందరికీ సంతోషం పంచిన ఆ చిన్నారికి మొదటి పుట్టిన రోజు చివరిదయింది. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు, బంధు మిత్రుల ఆప్యాయతల నడుమ నిండు నూరేళ్లు జీవించాల్సిన వాడు పుట్టిన ఏడాదికే కానరాని లోకాలకు తరలిపోయాడు. తమకు జీవనాధారమైన ఆటో కన్నపేగును చిదిమేసిన విషయాన్ని తలచుకుని ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పండుగ రోజు జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
సాక్షి, జూపాడుబంగ్లా : మండలంలోని 80 బన్నూరులో శనివారం ఆటో కిందపడి ఓ చిన్నారి దుర్మరణం పాలయ్యాడు. మృతుడి బంధువుల కథనం మేరకు..గ్రామానికి చెందిన ఇలాష్‌బాషా, ఆశ్మ దంపతులకు కుమారుడు యూసుఫ్(ఏడాది)ఉన్నాడు. కుమారుడి పుట్టినరోజు, రంజాన్ పండుగ ఒకే రోజు రావటంతో ఆ ఇంట్లో బంధువులతో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం ఇంట్లో అందరూ పండగ హడావుడిలో ఉండగా తండ్రి కుమారుడి తీసుకుని ఇంటికి సమీపంలో ఉన్న మినరల్‌వాటర్ ప్లాంటు వద్దకు వెళ్లాడు. తండ్రి ఆటోలోని ట్యాంకులో నీటిని నింపుకొని గ్రామంలోకి వెళ్లేందుకు యత్నించాడు. ఈక్రమంలో ఆటో వెనక్కు నడపడంతో వెనుక ఉన్న చిన్నారిపై దూసుకెళ్లింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటిదాకా వచ్చీరాని మాటలతో అందర్నీ నవ్వించిన యూసుఫ్ మృతిచెందాడనే వార్తతో కుటుంబ సభ్యులు నిశ్చేష్టులయ్యారు. ఘటన స్థలికి చేరుకుని గుండెలు అవిసేలా రోదించారు. పండగ వాతావరణం కాస్త విషాదభరితంగా మారింది. గ్రామంలోని ముస్లింలు, చుట్టుపక్కల వారు మృతి చెందిన బాలుణ్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఎవ్వరికీ ఎలాంటి హానీ చెయ్యని తమకు పండుగరోజు, పుట్టిన రోజునాడే అల్లా తమ బిడ్డను తీసుకెళ్లాలా అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment