
శ్రీనివాసులు
పెనుకొండ/చెన్నేకొత్తపల్లి : రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో మంత్రి పరిటాల సునీత ఒత్తిడి నేపథ్యంలో అప్పట్లో పోలీసులు ఇద్దరు వైఎస్సార్‌సీపీ వర్గీయులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. మృతుడు మరో ప్రాంతంలో తిరుగుతుండటాన్ని గుర్తించిన గ్రామస్తులు అతడిని పోలీసుస్టేషన్‌లో అప్పగించిన ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల దర్యాప్తు ఏ స్థాయిలో సాగుతుందో ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌లో చెన్నేకొత్తపల్లి మండలం హరేన్‌చెరువుకు చెందిన తలారి శ్రీనివాసులు (38) హత్యకు గురైనట్లు పెనుకొండ పోలీసులు 2017 మార్చి 20న కేసు నమోదు చేశారు. హత్య చేశారనే అభియోగంతో హరేన్‌చెరువుకు చెందిన భాస్కర్‌రెడ్డి, ఓబిరెడ్డి అనే వ్యక్తులను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.
ఆ తర్వాత పోలీసులు అప్పగించిన మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. సీన్ కట్‌చేస్తే.. మృతుడు తలారి శ్రీనివాసులును హరేన్‌చెరువు గ్రామస్తులు శనివారం ధర్మవరంలో గుర్తించి అతన్ని చెన్నేకొత్తపల్లి పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయకుండా అమాయకులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గొల్లపల్లి రిజర్వాయర్‌లో చనిపోయినది శ్రీనివాసులు కాదని తేలడంతో అప్పట్లో వెలుగుచూసిన మృతదేహం ఎవరిదనే ప్రశ్న ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది. కేసును మూసివేసి చేతులు దులుపుకున్న వారికి ఈ కేసు కత్తి మీద సాముగా మారనుంది.
కేసు పూర్వాపరాలివీ..
చెన్నేకొత్తపల్లి మండలంలోని హరియాన్‌చెరువు గ్రామానికి చెందిన తలారి శ్రీనివాసులు మండల కేంద్రంలోని గంగన ఓబిరెడ్డి రైస్‌మిల్‌లో దినసరి కూలీ. అయితే, 2017 మార్చి 19న తన బంధువుల ఊరికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఈ విషయమై తలారి శ్రీనివాసులు భార్య చిలకమ్మ చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో మర్నాడు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో అదే ఏడాది ఏప్రిల్ 4న పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఓ గుర్తు తెలియని శవం లభ్యమైంది. అది చెన్నేకొత్తపల్లిలో అదృశ్యమైన తలారి శ్రీనివాసులదేనని పెనుకొండ పోలీసులు గుర్తించి అతని కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించగా వారు అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో శనివారం స్థానికులు గుర్తించిన శ్రీనివాసులును చెన్నేకొత్తపల్లి పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. విషయం అతని కుటుంబ సభ్యులకు తెలియజేసిన సీఐ సిద్ధా తేజమూర్తి, తహసీల్దార్ తుకారంలు భార్య చిలకమ్మకు శ్రీనివాసులును అప్పగించారు. మరోవైపు.. ఈ అంశంపై మాట్లాడేందుకు పోలీసులెవరూ నోరు మెదపడంలేదు. తలారి శ్రీనివాసులు సైతం నోరు విప్పడంలేదు.
అప్పట్లో పోలీసుల తీవ్ర వేధింపులు..
కాగా, చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో తలారి శ్రీనివాసులు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టకుండా రైస్‌మిల్ యజమాని వైఎస్సార్‌సీపీ నాయకులు గంగన ఓబిరెడ్డి, ఆయన సోదరుడు భాస్కర్‌రెడ్డిలను అప్పట్లో తీవ్ర వేధింపులకు గురిచేశారు. మీరే చంపినట్లు ఒప్పుకోవాలని మంత్రి పరిటాల సునీత ప్రోద్బలంతో అప్పటి సీఐ యుగంధర్, ఎస్‌ఐ మహమ్మద్ రఫిలు తీవ్ర ఒత్తిడి చేశారు. తాజాగా.. శ్రీనివాసులు తిరిగి ప్రత్యక్షం కావడంతో పోలీసులు అధికార పార్టీకి ఏ విధంగా కొమ్ము కాశారనే విషయం అర్థమవుతోంది.
విచారణ చేపడతాం
అప్పట్లో ఈ కేసును ఎస్‌ఐ లింగన్న చూశారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో చనిపోయిన వ్యక్తి హరేన్‌చెరువుకు చెందిన తలారి శ్రీనివాసులుగా గుర్తించి కేసు నమోదు చేసి అనుమానితులను రిమాండ్‌కు పంపడం వాస్తవమే. తాజాగా ఆయన బతికే ఉన్న నేపథ్యంలో కేసును పునఃసమీక్షిస్తాం.
– జనార్ధన్, ఎస్‌ఐ, పెనుకొండ
Comments
Please login to add a commentAdd a comment