ఆదోని/కోడుమూరు: డీలర్ల అతి తెలివి నిరుపేదలకు శాపంగా మారింది. బోగస్ కార్డులను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి.. లబ్ధిదారులకు నెల సరుకులను దూరం చేసింది. అన్ని అర్హతలున్నాకార్డు రద్దు కావడంతో ఎన్నో కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా రేషన్ కార్డులకు ఆధార్ నెంబర్లను అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమాన్ని అధికారులు డీలర్లకు అప్పగించారు.
నియోజకవర్గంలో 76,844 తెల్ల రేషన్‌కార్డులు ఉండగా.. 124 మంది డీలర్లు ఉన్నారు. ఆధార్ అనుసంధానం చేసే సైట్‌లోకి లాగిన్ అయ్యేందుకు వీరందరికీ ఒకే పాస్‌వర్డ్ కేటాయించారు. డీలర్లు వారి పరిధిలోని వినియోగదారుల నుంచి ఆధార్ కార్డుల జిరిక్స్ కాపీలను సేకరించుకుని నెట్ సెంటర్లు, తహశీల్దార్ కార్యాలయాల్లో ఆధార్ నెంబర్లను అనుసంధానం చేశారు. ఆధార్ నెంబర్లు ఇవ్వకపోతే రేషన్ కార్డులను బోగస్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమ వద్దనున్న బోగస్ కార్డులు రద్దయితే అక్రమార్జనకు తెరపడుతుందని భావించిన కొందరు డీలర్లు సరికొత్త ఎత్తుగడ వేశారు.
నిరుపేదల కడుపు మాడ్చయినా తమ జేబులు నింపుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందరికీ ఒకే పాస్‌వర్డ్ కేటాయించడం వీరి ఆలోచనలకు కలిసొచ్చింది. ఇతర డీలర్ల పరిధిలోకి చొరబడి అర్హుల రేషన్ కార్డులకు అనుసంధానం చేసిన ఆధార్ నెంబర్లను బోగస్ కార్డులకు జతచేశారు. ఇలా డీలర్లు ఎవరికి వారు బోగస్‌లను కాపాడుకోవడంతో వేలాది మంది నిరుపేదలు కార్డులను కోల్పోయారు. నియోజకవర్గంలో ఆధార్ నెంబర్లు అనుసంధానం కాని 15,154 కార్డులు రద్దయ్యాయి. ఫలితంగా 3,273 మెట్రిక్ టన్నుల బియ్యం కోటాకు కత్తెర పడింది.
ఇందులో సగానికి పైగా అర్హులైన వారే కావడం గమనార్హం. వీరంతా మూడు నెలలుగా రేషన్ అందక.. కూలీ పనులను వదులుకుని డీలర్లు, అధికారుల చుట్టూ ఆధార్ జిరాక్స్ కాపీలతో ప్రదక్షిణ చేస్తున్నారు. తమ తప్పేమీ లేదని.. ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో తెలియదంటూ అధికార యంత్రాంగం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. మరోసారి ఆధార్ జిరాక్స్ కాపీ ఇవ్వమనే ఉచిత సలహాతో తిప్పిపంపుతున్నారే తప్ప.. డీలర్ల మాయాజాలాన్ని గుర్తించకపోవడం గమనార్హం. తెలిసినా.. ఎక్కడ తమ మామూళ్లకు గండి పడుతుందోనని మౌనం దాలుస్తున్నారనే చర్చ జరుగుతోంది.
నోటికాడి కూడు లాగేసినారు
కూలీ పని చేసుకునేటోళ్లం. ఆధార్ కార్డు అడిగితే డీలర్‌కు ఇచ్చినాం. అయినా కార్డు రద్దు చేసినారు. అన్నీ సక్రమంగా ఉన్నా ఇలా చేస్తే ఎవరికి సెప్పుకోవాల. నాలెక్క సానా మందికి కార్డులు పోయినాయి. సారోళ్లకు సెబితే మళ్లీ ఆధార్ కార్డు జిరాక్సు ఇవ్వండి చూస్తామంటున్నారు. కార్డు ఎప్పుడొస్తాదంటే ఎవరూ సరిగా సెప్పరు. మూన్నెల్లు అయితాంది. కడుపు మాడ్చుకుంటున్నాం. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవాల.
- రాణి, ఆదోని
ముసలోళ్లం.. ఎట్టా బతికేది
నా వయసు 70 ఏళ్లు. కళ్లు సరిగా కనబడవు. పింఛన్ సొమ్ముపై ఆధారపడి భార్యతో కలిసి గుడిసెలో నివాసం ఉంటున్నా. ఆధార్ కార్డు జిరాక్సు కాపీలను డీలర్‌కు నాలుగు సార్లు అందజేసినా. అయినప్పటికీ రేషన్ కార్డు రద్దు చేసినారు. మేమెట్టా బతకాల. నడవటమే కష్టమైన పరిస్థితుల్లో ఇరుగుపొరుగు సాయంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ప్రభుత్వమే రద్దు చేసిందంటున్నారు. ఎప్పటికొస్తాదో ఏమో తెలుస్తలేదు.
- పోలయ్య, ఆదోని
డీలర్ల అక్రమాలపై ఫిర్యాదుల్లేవు
ఒకటి కంటే ఎక్కువ చోట్ల రేషన్ కార్డులు ఉన్నా.. చనిపోయిన లబ్ధిదారులకు సంబంధించిన కార్డులు రద్దయ్యాయి. తమకు అన్ని అర్హతలున్నా కార్డులు రద్దయ్యాయంటూ కొందరు మా దృష్టికి తీసుకొస్తున్నారు. డీలర్ల వల్లే తమ కార్డులు రద్దయినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపడతాం.
- రమేశ్వరరెడ్డి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఆదోని
డీలర్ల, బోగస్ కార్డుల, ప్రయత్నం బెడిసికొట్టి,
డీలర్లు.. మాయగాళ్లు
Published Thu, Nov 27 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM
Advertisement
Advertisement