fake cards
-
అక్రమ వలసదారులకు ‘ఆధార్’ బంగ్లా ముఠా అరెస్టు
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఏటీఎంను దోచుకున్న దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులకు అనూహ్యంగా నకిలీ ఆధార్ కార్డులను తయారు చేస్తున్న బంగ్లా దేశీయుల ముఠా చిక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దుండగులు ఏటీఎం నుంచి రూ.18 లక్షలు లూటీ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు షేక్ ఇస్మాయిల్ కితాబ్ అలీ అనే బంగ్లాదేశీయుడిని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు, దేశంలోకి అక్రమంగా ప్రవేశించి 2011 నుంచి బెంగళూరులో పాత సామాను వ్యాపారం చేస్తున్న సయ్యద్ అకూన్ గురించి వెల్లడించాడు. నకిలీ పత్రాలు సృష్టించి, అక్రమ వలసదారులకు ఆధార్ కార్డులతోపాటు ఇతర పత్రాలను అందజేస్తున్నట్లు విచారణలో అకూన్ అంగీకరించాడు. అకూన్ ఇంట్లో 31 ఆధార్‌కార్డులు, 13, పాన్‌కార్డులు, 90 ఆధార్ నమోదు దరఖాస్తులు లభ్యమయ్యాయి. హవాలా మార్గంలో ఇతడు ఏడాదికి రూ.4 కోట్ల భారత కరెన్సీని బంగ్లాదేశ్ కరెన్సీగా మార్చి సొంత దేశానికి పంపుతున్నట్లు నిర్థారణయింది. ఈ కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా గుర్తించారు. -
నకిలీ కార్డులతో రూ. 4 కోట్లు మేరకు షాపింగ్
న్యూఢిల్లీ : నకిలీ ఐడీలతో బ్యాంకులను బురిడీ కొట్టిస్తూ డెబిట్, క్రెడిట్ కార్డులు పొందిన ఎనిమిది మందిని ఢిల్లీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి రూ. 15 లక్షల నగదు, ఆభరణాలు, కార్డులు తయారుచేసే రెండు మెషీన్లు సీజ్ చేశారు. 31 పాన్ కార్డులు, 18 ఆధార్ కార్డులు 30 ఓటర్ ఐడీలు, వీటిని ఉపయోగించి కొనుగోలు చేసిన 15 సిమ్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి బ్యాంకు ఖాతాల్లోని రూ.50 లక్షలను స్తంభింపజేశామని తెలిపారు. వివరాలు... ఈ ముఠా నకిలీ ఐడీ కార్డులు సృష్టించి 13 బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచి 63 డెబిట్, క్రెడిట్ కార్డులు పొందింది. వీటితో షాపింగ్ చేస్తూ దాదాపు రూ.3-4 కోట్లు కాజేశారు. ఇటీవల సిటీ బ్యాంక్ నిర్వహించిన ఆడిట్ సందర్భంగా 36 నకిలీ ఖాతాలను బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోతుగా దర్యాప్తు చేపట్టగా, వీరంతా వేరువేరు పేర్లతో మారువేషాల్లో బ్యాంకులకు వెళ్లి అకౌంట్లు తెరిచేవారని తేలింది. ఇక ఈ ముఠాలోని ఎనిమిది మంది సభ్యుల్లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. కన్వల్రాజ్, ఆయన భార్య, ఇద్దరు కుమారులు అజయ్, మహేశ్ క్షత్రియ, ఇద్దరు కోడళ్లు ఈ ముఠాలో ఉన్నారు. వీరికి అరుణ్ శర్మ దంపతులు కూడా తోడయ్యారని, అంతా కలిసే ఈ నేరాలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి ఓపీ మిశ్రా మాట్లాడుతూ.. ‘ఈ మొత్తం నేరాలకు అరుణ్ శర్మ అనే 25 ఏళ్ల యువకుడు ప్రధాన సూత్రధారి. నిందితుడి తండ్రి గతంలో స్విచ్ బోర్డులు తయారు చేసే కంపెనీ ప్రారంభించాడు. అందులో భారీగా నష్టాలు రావడంతో డబ్బుల కోసం అరుణ్ నేరాల బాట పట్టాడు. అతడికి నకిలీ ఆధార్, పాన్ కార్డులు తయారు చేయడానికి రవి సచ్దేవ్, ఉమేష్ సాయం చేశారు’ అని చెప్పారు. సచ్దేవ్, ఉమేష్‌లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. -
ఏమార్చి... ఏటీఎం కార్డులు మార్చి
ఆనందపురం(భీమిలి): అతను ఏటీఎం కేంద్రాల వద్ద మాటు వేస్తాడు... కేంద్రాలకు వచ్చి నగదు తీసుకునేందుకు సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారితో మాటలు కలుపుతాడు... సాయం చేస్తానని నమ్మించి వారి వద్ద నుంచి కార్డు తీసుకుని కొంతసేపు ప్రయత్నిస్తాడు... కార్డు పనిచేయడం లేదని చెప్పి అప్పటికే తన వద్ద ఉన్న నకిలీ కార్డుని సదరు వ్యక్తికి ఇచ్చేసి అసలు కార్డుతో అక్కడి నుంచి ఉడాయిస్తాడు. అనంతరం ఆ కార్డు సాయంతో ఖాతాలోని డబ్బులన్నీ తస్కరిస్తాడు. ఇదీ సులువుగా డబ్బు సంపాదించేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగేంద్రసింగ్ ఎంచుకున్న మార్గం. కొంత కాలం సాఫీగా దొంగతనాలు సాగినా, అతనిపై పోలీసులు గట్టి నిఘా ఉంచి అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. మండలంలోని వెల్లంకితో పాటు పలు చోట్ల చోరీకి పాల్పడిన దొంగను స్థానిక పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ఆర్.గోవిందరావు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్‌ఘర్ జిల్లా పూరి పాండేక పూర్వ గ్రామానికి చెందిన యోగేంద్ర సింగ్ (31) తన భార్యతో కలిసి కొంత కాలం క్రితం బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలోని ఓ పరిశ్రమలో ఫ్యాబ్రికేషన్ పనిలో చేరాడు. భార్యను కూడా అక్కడే పనిలోకి కుదుర్చాడు. ఇదిలా ఉండగా పని ద్వారా వచ్చే ఆదాయం సరిపోక పోవడంతో సులువుగా డబ్బు సంపాదించాలని ఆలోచన చేసి ఏటీఎం కేంద్రాలను ఎంచుకున్నాడు. కొన్నాళ్లు క్రితం విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద గల ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేయడానికి అవస్థలు పడడం చూసి తాను సాయం చేస్తానంటూ వెళ్లి ఏటీఎం కార్డుతో సొమ్ము డ్రా చేసినట్టు నటించి కార్డు పనిచేయలేదని చెప్పి అసలు ఏటీఎం కార్డుని తన వద్దు ఉంచుకొని నకిలీ కార్డుని ఆ వ్యక్తి చేతిలో పెట్టి చల్లగా జారుకున్నాడు. అనంతరం ఆ ఏటీఎం కార్డుతో రూ.40 వేలు డ్రా చేశాడు. దీంతో అప్పట్లో బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. పట్టించిన సీసీ కెమెరా ఫుటేజీ గత ఏడాది నవంబర్ 17న మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన గొలగాని అప్పలరాజు అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అప్పటికే అక్కడ యోగేంద్ర సింగ్ మాటు వేసి ఉన్నాడు. డబ్బులు డ్రా చేయడానికి అప్పలరాజు ఇబ్బందులు పడడాన్ని గమనించిన యోగేంద్ర సింగ్ తాను సాయం చేస్తానని చెప్పి ఎప్పటిలాగే కార్డులో సమస్య ఉందని, డబ్బులు రావడం లేదని చెప్పి నకిలీ ఏటీఎం కార్డు అప్పలరాజుకి ఇచ్చి అసలు కార్డుతో జారుకున్నాడు. ఆ కార్డుతో యోగేంద్ర సింగ్ నాలుగు రోజులలో ఆన్లైన్లో వివిధ వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు కొంత సొమ్ము డ్రా చేశాడు. ఇదిలా ఉండగా ఆన్లైన్లో తాను వస్తువులు కొనుగోలు చేసిన్టటు అప్పలరాజు సెల్‌కు సమాచారం రావడంతో బ్యాంక్‌కు వెళ్లి విచారించగా రూ.1.52 లక్షలు తన ఖాతా నుంచి మళ్లిపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీఐ ఆర్.గోవిందరావు ముందుగా ఏటీఎం కేంద్రంలోని సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించారు. అతనిపై పాత నేరాలు కూడా ఉన్నట్టు రూఢీ చేసుకున్నారు. ఎస్ఐ గణేష్ ఇతర పోలీసు సిబ్బంది నిఘా ఏర్పాటు చేసి మంగళవారం విశాఖ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న యోగేంద్ర సింగ్‌ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.1.20 లక్షలు నగదు, ఒక సెల్ ఫోన్‌ని స్వాధీనం చేసుకొని కోర్టుకి తరలించారు. గతంలో గాజువాకతోపాటు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, వివరాలు రావాల్సి ఉందని సీఐ తెలిపారు. సీఐ గోవిందరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగ క్రెడిట్ కార్డుల ముఠా అరెస్ట్
సనత్‌నగర్: ఐసీఐసీఐ బ్యాంక్‌కు వచ్చే దరఖాస్తుదారులకు తెలియకుండా వారి చిరునామాల ఆధారంగా పొందిన ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో రూ. 20 లక్షలు షాపింగ్ చేసి మోసానికి పాల్పడిన ముగ్గురు ముఠా సభ్యులను బేగంపేట్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బేగంపేట్ ఎస్ఐ రాంచందర్ తెలిపిన వివరాల ప్రకారం...చందానగర్ పాపిరెడ్డికాలనీకి చెందిన సారధికుమార్ (42) గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడలోని ఐసీఐసీఐ టవర్స్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను దరఖాస్తుదారుల చిరునామాలపై ఎస్బీఐ క్రెడిట్‌కార్డుకు ఆప్లై చేసి కార్డులు తీసుకునేవాడు. ఇలా 22 మంది పేర్లపై తీసుకున్న కార్డులతో రూ. 22.95 లక్షలు షాపింగ్ చేశాడు. క్రెడిట్ కార్డులపై ఉన్న చిరునామాల్లో ఉండే వ్యక్తులను కలిసి షాపింగ్ కోసం చేసిన మొత్తాన్ని చెల్లించాలని ఎస్బీఐ సిబ్బంది కోరడంతో బాధితులు తాము కార్డు తీసుకోలేదని చెప్పారు. దీంతో ఎస్బీఐ క్రెడిట్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ విశాల్ విన్సెంట్ మే 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ జగన్ నేతృత్వంలో ఎస్ఐ రాంచందర్ దర్యాప్తు చేపట్టి సారథికుమార్ ఈ మోసానికి సూత్రధారిగా గుర్తించారు. అతనికి సహకరించిన నామాలగుండుకు చెందిన వీరబాబును గతంలోనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న శివచంద్ర, నర్సింహరావు, ఉపేంద్రలను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. -
డీలర్లు.. మాయగాళ్లు
ఆదోని/కోడుమూరు: డీలర్ల అతి తెలివి నిరుపేదలకు శాపంగా మారింది. బోగస్ కార్డులను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి.. లబ్ధిదారులకు నెల సరుకులను దూరం చేసింది. అన్ని అర్హతలున్నాకార్డు రద్దు కావడంతో ఎన్నో కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా రేషన్ కార్డులకు ఆధార్ నెంబర్లను అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమాన్ని అధికారులు డీలర్లకు అప్పగించారు. నియోజకవర్గంలో 76,844 తెల్ల రేషన్‌కార్డులు ఉండగా.. 124 మంది డీలర్లు ఉన్నారు. ఆధార్ అనుసంధానం చేసే సైట్లోకి లాగిన్ అయ్యేందుకు వీరందరికీ ఒకే పాస్వర్డ్ కేటాయించారు. డీలర్లు వారి పరిధిలోని వినియోగదారుల నుంచి ఆధార్ కార్డుల జిరిక్స్ కాపీలను సేకరించుకుని నెట్ సెంటర్లు, తహశీల్దార్ కార్యాలయాల్లో ఆధార్ నెంబర్లను అనుసంధానం చేశారు. ఆధార్ నెంబర్లు ఇవ్వకపోతే రేషన్ కార్డులను బోగస్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమ వద్దనున్న బోగస్ కార్డులు రద్దయితే అక్రమార్జనకు తెరపడుతుందని భావించిన కొందరు డీలర్లు సరికొత్త ఎత్తుగడ వేశారు. నిరుపేదల కడుపు మాడ్చయినా తమ జేబులు నింపుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందరికీ ఒకే పాస్వర్డ్ కేటాయించడం వీరి ఆలోచనలకు కలిసొచ్చింది. ఇతర డీలర్ల పరిధిలోకి చొరబడి అర్హుల రేషన్ కార్డులకు అనుసంధానం చేసిన ఆధార్ నెంబర్లను బోగస్ కార్డులకు జతచేశారు. ఇలా డీలర్లు ఎవరికి వారు బోగస్‌లను కాపాడుకోవడంతో వేలాది మంది నిరుపేదలు కార్డులను కోల్పోయారు. నియోజకవర్గంలో ఆధార్ నెంబర్లు అనుసంధానం కాని 15,154 కార్డులు రద్దయ్యాయి. ఫలితంగా 3,273 మెట్రిక్ టన్నుల బియ్యం కోటాకు కత్తెర పడింది. ఇందులో సగానికి పైగా అర్హులైన వారే కావడం గమనార్హం. వీరంతా మూడు నెలలుగా రేషన్ అందక.. కూలీ పనులను వదులుకుని డీలర్లు, అధికారుల చుట్టూ ఆధార్ జిరాక్స్ కాపీలతో ప్రదక్షిణ చేస్తున్నారు. తమ తప్పేమీ లేదని.. ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో తెలియదంటూ అధికార యంత్రాంగం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. మరోసారి ఆధార్ జిరాక్స్ కాపీ ఇవ్వమనే ఉచిత సలహాతో తిప్పిపంపుతున్నారే తప్ప.. డీలర్ల మాయాజాలాన్ని గుర్తించకపోవడం గమనార్హం. తెలిసినా.. ఎక్కడ తమ మామూళ్లకు గండి పడుతుందోనని మౌనం దాలుస్తున్నారనే చర్చ జరుగుతోంది. నోటికాడి కూడు లాగేసినారు కూలీ పని చేసుకునేటోళ్లం. ఆధార్ కార్డు అడిగితే డీలర్‌కు ఇచ్చినాం. అయినా కార్డు రద్దు చేసినారు. అన్నీ సక్రమంగా ఉన్నా ఇలా చేస్తే ఎవరికి సెప్పుకోవాల. నాలెక్క సానా మందికి కార్డులు పోయినాయి. సారోళ్లకు సెబితే మళ్లీ ఆధార్ కార్డు జిరాక్సు ఇవ్వండి చూస్తామంటున్నారు. కార్డు ఎప్పుడొస్తాదంటే ఎవరూ సరిగా సెప్పరు. మూన్నెల్లు అయితాంది. కడుపు మాడ్చుకుంటున్నాం. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవాల. - రాణి, ఆదోని ముసలోళ్లం.. ఎట్టా బతికేది నా వయసు 70 ఏళ్లు. కళ్లు సరిగా కనబడవు. పింఛన్ సొమ్ముపై ఆధారపడి భార్యతో కలిసి గుడిసెలో నివాసం ఉంటున్నా. ఆధార్ కార్డు జిరాక్సు కాపీలను డీలర్‌కు నాలుగు సార్లు అందజేసినా. అయినప్పటికీ రేషన్ కార్డు రద్దు చేసినారు. మేమెట్టా బతకాల. నడవటమే కష్టమైన పరిస్థితుల్లో ఇరుగుపొరుగు సాయంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ప్రభుత్వమే రద్దు చేసిందంటున్నారు. ఎప్పటికొస్తాదో ఏమో తెలుస్తలేదు. - పోలయ్య, ఆదోని డీలర్ల అక్రమాలపై ఫిర్యాదుల్లేవు ఒకటి కంటే ఎక్కువ చోట్ల రేషన్ కార్డులు ఉన్నా.. చనిపోయిన లబ్ధిదారులకు సంబంధించిన కార్డులు రద్దయ్యాయి. తమకు అన్ని అర్హతలున్నా కార్డులు రద్దయ్యాయంటూ కొందరు మా దృష్టికి తీసుకొస్తున్నారు. డీలర్ల వల్లే తమ కార్డులు రద్దయినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపడతాం. - రమేశ్వరరెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆదోని డీలర్ల, బోగస్ కార్డుల, ప్రయత్నం బెడిసికొట్టి,