బుధవారం అసెంబ్లీకి హాజరైన సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ
వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన మధ్య ప్రారంభించిన మంత్రి వట్టి వసంతకుమార్
బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానంటూ మొదలు
2 నిమిషాలకే సభను వాయిదా వేసిన స్పీకర్
సాక్షి, హైదరాబాద్: తీవ్ర గందరగోళం, వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల ‘సమైక్య’ ఆందోళన మధ్య ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ బుధవారం శాసనసభలో చర్చ ప్రారంభించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను పక్కనపెట్టి, సంప్రదాయాల స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని, ఆంధ్రా, రాయలసీమ, ప్రజలపై బలవంతంగా రుద్దుతున్న విభజన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ఈ విధమైన విభజన భారత సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. నదీ జలాలు, సాంకేతిక విద్య, విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారం బిల్లులో లేదని విమర్శించారు. విభజన బిల్లు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మంత్రి పేర్కొన్నారు. అరుుతే ఇలా చర్చ ప్రారంభమైన రెండు నిమిషాలకే స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అర్ధాంతరంగా గురువారానికి వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది.
వైఎస్సార్‌సీపీ, టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించినట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందే వైఎస్సార్‌సీపీ సభ్యులు సమైక్య తీర్మానం చేయాలని పట్టుబడుతూ పోడియంలోకి వెళ్లి నినాదాలు ప్రారంభించారు. టీడీపీ సీమాంధ్ర సభ్యులు కూడా ఇదే పద్దతిని అనుసరించడంతో సభ వాయిదా పడింది. ఉదయం 11 గంటల సమయంలో సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ ఎలాంటి మార్పు లేకపోవడంతో మరోసారి సభను స్పీకర్ వాయిదా వేశారు. మూడోసారి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సభ ప్రారంభమైనప్పుడు కూడా వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి ఆందోళన కొనసాగించారు. టీడీపీ సీమాంధ్ర సభ్యులు కూడా పోడియంలోకి వెళ్లారు. అధికారపక్ష సీమాంధ్ర సభ్యులు తమతమ స్థానాల్లోనే సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. గందరగోళం మధ్యే ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కల్పించుకుని.. ‘రాష్ట్రపతి పంపించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై చర్చ జరగాలి.
ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల నాయకులు మాట్లాడాలి. అరుుతే చర్చకు బిల్లుకు సంబంధించిన సంపూర్ణ సమాచారం కావాలని ప్రధాన ప్రతిపక్షం మిమ్మల్ని కోరింది. వారు కోరిన అంశాలను మీరు ప్రభుత్వానికి పంపించారు. ప్రతిపక్షం అడిగిన ఆర్థికాంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వద్దనున్న సమాచారాన్ని ఒకటి రెండురోజుల్లో సభ్యులకు ఇస్తాం. చర్చకు టీడీపీ, వైఎస్సార్‌సీపీ సభ్యులు సహకరించాలి..’ అని కోరారు. దీంతో అప్పటివరకు పోడియంలో నినాదాలు చేస్తున్న టీడీపీ సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లిపోయారు. ఈ దశలో వైఎస్సార్‌సీపీ సభ్యులు తమ చేతుల్లో ఉన్న కాగితాలను చింపి గాల్లోకి విసిరేశారు. వారు గట్టిగా నినాదాలు చేస్తున్న సమయంలోనే స్పీకర్ మనోహర్ మంత్రిని చర్చ ప్రారంభించాల్సిందిగా కోరారు.