
రుణ సంక్షోభం
సాక్షి, నెల్లూరు: రుణమాఫీపై సీఎం చంద్రబాబునాయుడు స్పష్టత ఇవ్వకపోవడంతో అన్నదాతల్లో రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. బాబు అధికారపీఠం అధిష్టించి రెండు నెలలు కావస్తున్నా ఆయన ఎన్నికల హామీ రుణమాఫీ అమలుకు నోచుకోలేదు. ఇంకెన్నాళ్లకు అమలు జరుగుతుందో కూడా తెలియకపోవడంతో అన్నదాతలతో పాటు డ్వాక్రా మహిళల్లో ఆందోళన నెలకొంది. బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి మాత్రం వడ్డీలు పెరుగుతున్నాయి. పోనీ రీషెడ్యూల్ ద్వారా రుణమన్నా ఇస్తారనుకుంటే అతీగతీలేదు. బ్యాంకులవద్దకెళితే తమకు ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని అధికారులు తేల్చి చెబుతున్నారు.
దీంతో రుణమాఫీ ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్ సాగుకు రైతులకు రుణాలు అందే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది మార్చి 31 నాటికి 5,01,637 మంది రైతులకు వివిధ బ్యాంకులు రూ.1,944 కోట్ల రుణాలు ఇచ్చాయి. బ్యాంకుల ఖరీఫ్ లక్ష్యం రూ.896 కోట్లు కాగా రూ.921 కోట్లు ఇచ్చాయి. ఇక రబీలో రూ.1506 కోట్లు లక్ష్యంకాగా రూ.1535 కోట్ల రుణాలు ఇచ్చాయి. 2,66,340 మందికి గోల్డ్‌లోన్ కింద రూ.2,597 కోట్ల రుణాలు అందించాయి.
ఈ మొత్తానికి ఏడాదికి రూ.545 కోట్లు వడ్డీ వస్తోంది. బాబు ఎన్నికల హామీ రుణమాఫీని నమ్మి రైతులు ఓట్లేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చిన బాబు హామీని తుంగలో తొక్కి దాదాపు రెండునెలల తర్వాత అరకొర మాఫీ హామీతో సరిపెట్టారు. పోనీ ఇదైనా అమలు జరుగుతుందా అంటే లేదనే చెప్పాలి. బ్యాంకులకు బకాయిలు చెల్లిస్తేనే రైతులకు తిరిగి రుణాలు ఇస్తారు. ఇప్పటి వరకూ రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపలేదు. దీంతో రుణమాఫీపై బ్యాంకులకు ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారంలేదు. మరోవైపు రీషెడ్యూల్ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అది కూడా అమలుకు నోచుకొనే పరిస్థితి కానరావడంలేదు. నిబంధనల మేరకు రీషెడ్యూల్ చేయాలంటే జిల్లాలో కరువులేదా వరద పరిస్థితులు నెలకొనాలి.
ఈ మేరకు పంటనష్టం డ్యామేజీ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. 50 శాతానికి మించి పంటనష్టం జరిగి ఉంటేనే రుణాల రీషెడ్యూల్ వర్తిస్తుంది. ఈ మేరకు ఒక సంవత్సరం మారిటోరియం మూడు నుంచి ఐదేళ్లపాటు రుణాల రీషెడ్యూల్‌కు అవకాశం ఉంది. ఈ లెక్కన నెల్లూరు జిల్లాలో పంటనష్టం, కరువు పరిస్థితులు లేవు. అలాంటపుడు రీషెడ్యూల్ ఎలా చేస్తారో అర్థం కావడంలేదని బ్యాంకు అధికారులే పేర్కొనడం విశేషం.
పోనీ ప్రభుత్వం చెప్పినట్టు అన్ని జిల్లాలకు కామన్‌గా రీషెడ్యూల్ చేస్తారని అనుకున్నా నిబంధనలు అడ్డుపడే పరిస్థితి ఉంటుందన్నది బ్యాంకు అధికారుల మాట. ఇక జిల్లాలో 44 వేల డ్వాక్రా సంఘాలకు సంబంధించి రూ.400 కోట్ల రుణాలు ఉన్నాయి. ఒక్కో సంఘానికి రూ.లక్ష మాత్రమే రుణమాఫీ జరిగితే కేవలం రూ.50 కోట్లకు మించి రుణమాఫీ జరగదు. 70 నుంచి 80 శాతం లోపు సంఘాలు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ రుణాలు తీసుకున్నవే. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ అవకాశం లేదన్నది అధికారుల మాట. ఒక వేళ తిరిగి రుణం ఇవ్వాలంటే రూ.4 లక్షలు బకాయిలున్న సంఘాలు రూ.లక్ష పైచిలుకు చెల్లిస్తే రీషెడ్యూల్‌కు అవకాశం ఉంటుందన్నది అధికారుల మాట. మొత్తంగా చంద్రబాబు మాయాజాలంతో ఇటురైతుల,అటు డ్వాక్రాల రుణమాఫీ సక్రమంగా అమలు జరిగే పరిస్థితి కానరావడంలేదు. మరోవైపు రీషెడ్యూల్‌దీ అదే పరిస్థితి. దీంతో అన్నదాతలు, డ్వాక్రా మహిళలు చంద్రబాబు మోసంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.