
కేసుల పురో‘గతి’ ఏది?
= నేరాలు తగ్గాయి.. దర్యాప్తు జోరూ తగ్గింది
= జిల్లాలో పోలీస్ దర్యాప్తులోనే మగ్గుతున్న కేసులు
= జాప్యంతో బాధితులకు న్యాయం జరిగేనా?
జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందని పోలీసు అధికారులు గర్వంగా చెప్పుకొంటున్నారు. గత 11 నెలలుగా నేరాల అదుపులో తాము చేసిన కృషిని ప్రస్తుతించుకుంటూ సమీక్షలకు సైతం సిద్ధమయ్యారు. నేరాల సంఖ్య కాస్త తగ్గింది సరే.. నమోదైన కేసుల్లో అత్యధికం దర్యాప్తులోనే ఉన్నట్టు తేటతెల్లమవుతోంది. వాటి పరిస్థితి ఏమిటనేది అధికారులే తేల్చాలి.
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో ఈ ఏడాది నమోదైన కేసులను పరిశీలిస్తే దర్యాప్తు నత్తనడకగానే సాగుతున్నట్టు చెప్పకతప్పదు. గత మూడేళ్లలో కేసుల తీరును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. గత ఏడాదితో పోల్చితే నేరాల సంఖ్య కాస్త తగ్గినా.. దర్యాప్తు మాత్రం సాగదీత ధోరణిలో సాగుతోందని తెలుస్తోంది.
2011లో కేసుల తీరు ఇదీ...
జిల్లాలో 2011లో 894 కేసులు నమోదయ్యాయి. వాటిలో 111 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి. 213 కేసుల్లో నేర నిరూపణ కాలేదు. 267 కేసులు విచారణ దశలో ఉన్నాయి. రూ.3 కోట్ల 78 లక్షల 31 వేల 173 విలువైన సొత్తు చోరీకి గురికాగా వాటిలో రికవరీ అయింది కోటీ 78 లక్షల 90 వేల 194 రూపాయలు మాత్రమే. రెండేళ్లు గడుస్తున్నా ఇంకా దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన సొత్తు రికవరీ కాలేదు.
2012లో ఇలా...
జిల్లాలో 2012లో 987 కేసులు నమోదయ్యాయి. 108 కేసుల్లో నిందితులకు శిక్ష పడింది. 149 కేసుల్లో నేర నిరుపణ కాలేదు. కోర్టులో 393 కేసులపై విచారణ జరుగుతోంది. గత ఏడాదికి సంబంధించిన 119 కేసుల్లో ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. రూ.5 కోట్ల 49 లక్షల 41 వేల 109 విలువైన సొత్తు చోరీకి గురికాగా, రూ.3 కోట్ల 50 లక్షల 10 వేల 008 మాత్రమే రికవరీ చేశారు. ఇంకా దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు రికవరీ లేదు.
ఈ ఏడాది విచారణలో 584 కేసులు...
ఈ ఏడాది నవంబర్ 30 వరకు జిల్లాలో 855 కేసులు నమోదయ్యాయి. వాటిలో 29 కేసుల్లో నిందితులకు శిక్ష పడింది. 54 కేసుల్లో నేర నిరూపణ కాలేదు. కోర్టు పరిధిలో విచారణ జరుగుతున్నవి 170 కేసులు. పోలీసుల విచారణలో ఉన్నవి 584. గత 11 నెలల కాలంలో రూ.3 కోట్ల 13 లక్షల 21 వేల 322 మేర సొత్తు చోరీకాగా, కోటీ 32 లక్షల 99 వేల 713 రూపాయలు మాత్రమే రికవరీ చేయగలిగారు. ఇంకా రూ.1.70 కోట్ల మేర సొత్తు రికవరీ కావాల్సి ఉంది.
తగ్గిన అత్యాచారాలు, అపహరణలు...
ఈ ఏడాది నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తే అత్యాచారాలు, అపహరణలు తగ్గినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 51 అత్యాచార, 47 అపహరణ కేసులు నమోదయ్యాయి. హత్య కేసులు 49 నమోదు కాగా 38 ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయి. హత్య చేసి సొత్తు దొంగిలించిన కేసులు 6 నమోదు కాగా 5 విచారణలో ఉన్నాయి. దోపిడీలు 16 నమోదు కాగా, 12 కేసుల్లో విచారణ సాగుతోంది. పగటి పూట ఇళ్ల చోరీలు 59 నమోదు కాగా వాటిలో మూడు కేసుల్లో శిక్ష పడింది. 45 కేసుల్లో విచారణ సాగుతోంది.
రాత్రిపూట ఇళ్లలో చోరీ కేసులు 219 నమోదు కాగా వాటిలో 9 కేసుల్లో శిక్ష పడగా 41 కేసులు దర్యాప్తులోను, 164 కేసులు కోర్టు విచారణలో ఉన్నాయి. మెడలో గోలుసు చోరీలు 49 నమోదు కాగా 39 విచారణలో ఉన్నాయి. సైకిల్ దొంగతనాలపై 15, జేబు దొంగతనాలపై 9, సాధారణ దొంగతనాలపై 408, గేదెల దొంగతనాలపై 25 కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల్లో పెద్దవి 349 నమోదవగా, స్వల్ప గాయాల కేసులు 972 ఉన్నాయి. జిల్లాలో ఘర్షణలపై 1331 కేసులు నమోదైనట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.