- వైఎస్సార్ సీపీ నేతలకు త్రిసభ్య కమిటీ సూచన
- కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశం
- పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టాలి
- సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలి
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసి రైతులు, డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31, ఫిబ్రవరి ఒకటి తేదీల్లో తణుకులో జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేస్తున్నారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొనాలని సూచించారు.
విజయవాడలోని వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి దుర్గాప్రసాదరాజు సమావేశం నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పార్టీ ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ అధికార తెలుగుదేశం పార్టీ రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని విమర్శించారు. రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతులు, డ్వాక్రా మహిళల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన టీడీపీ.. పాలన ప్రారంభించి ఏడు నెలలైనా వాటిని అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలక్షేపం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రస్తుతం పాలకులు అన్నింటికీ సింగపూర్ జపం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో రెండు రోజులు దీక్ష చేస్తున్నారని తెలిపారు.
రాజధాని నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు...
రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పేరుతో మూడు పంటలు పండే భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకోవడం దారుణమని విజయసాయిరెడ్డి అన్నారు. అక్కడి ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. తమ పార్టీ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. అయితే రైతులను ఇబ్బంది పెట్టకుండా రాజధాని నిర్మించాలనేది తమ డిమాండ్ అని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా రైతులకు బ్యాంకుల్లో కొత్త రుణాలు మంజూరు చేయకపోగా, పాత రుణాలు చెలిచాలని వరుస నోటీసులు జారీ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రతి జిల్లాలో సగటున రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు రుణాలు మాఫీ కావాల్సి ఉందని వివరించారు. ప్రభుత్వం మాత్రం మొదటి విడత మాఫీ పేరుతో కనీసం వడ్డీకి కూడా సరిపోని విధంగా నిధులు కేటాయించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోందన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించే దీక్షకు పెద్ద సంఖ్యలో రైతులు, డ్వాక్రా మహిళలు స్వచ్ఛందంగా వచ్చేలా ఈ కార్యక్రమం గురించి నియోజకవర్గాల్లో నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం గురించి ప్రచారం చేసే బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు పర్యవేక్షించాలని చెప్పారు. అన్ని గ్రామాల్లో రైతులు, మహిళలు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారని, పార్టీ నేతలు వారి తరఫున పోరాటం సాగించాలని సూచించారు. సాగి దుర్గా ప్రసాదరాజు మాట్లాడుతూ పార్టీని నిర్మాణాత్మకంగా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు.
సభ్యత్వ నమోదుపై చర్చ...
త్రిసభ్య కమిటీ సభ్యులు పార్టీ సభ్యత్వ నమోదుపై ముఖ్య నాయకులతో చర్చించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు దృష్టి సారించాలని సూచించారు. కృష్ణా జిల్లాలోని 16, గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో నూరు శాతం పార్టీ సభ్యత్వ నమోదు జరిగేలా కృషిచేయాలని చెప్పారు. పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి విధివిధానాలు రూపొందించి సభ్యత్వ నమోదు కార్యక్రమ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో వేర్వేరుగా సమావేశమై నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై చర్చించారు.
రెండు జిల్లాల నేతల హాజరు
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు (సత్తెనపల్లి), దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, ఉత్తర కృష్ణా అధ్యక్షుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), విజయవాడ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ (విజయవాడ పశ్చిమ), గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు (నూజివీడు), కొక్కిలిగడ్డ రక్షణనిధి (తిరువూరు), కోన రఘుపతి (బాపట్ల), మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ (రేపల్లె), పార్టీ ముఖ్యనేత ఆళ్ల పేరిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు అన్నాబత్తుని శ్రావణ్‌కుమార్ (తెనాలి), కత్తెర క్రిస్టీనా (తాడికొండ), జోగి రమేష్ (మైలవరం), డాక్టర్ దుట్టా రామచంద్రరావు (గన్నవరం), సింహాద్రి రమేష్‌బాబు (అవనిగడ్డ), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), నియోజకవర్గ నాయకుడు ఉప్పాల రాంప్రసాద్, కృష్ణా జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి తదితరులు పాల్గొన్నారు.