చంద్రబాబు, రామోజీలకు లీగల్‌ నోటీసు | Defamation suit against Chandrababu and Eenadu and Andhra Jyothi | Sakshi
Sakshi News home page

చంద్రబాబు,ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై పరువునష్టం దావా

Published Sun, Jun 21 2020 3:23 AM | Last Updated on Sun, Jun 21 2020 1:16 PM

Defamation suit against Chandrababu and Eenadu and Andhra Jyothi - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రతిష్టను మంటగలపడమే లక్ష్యంగా అసత్య అభియోగాలు మోపిన విపక్ష నేత చంద్రబాబునాయుడు, తప్పుడు వార్తలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు పరువు నష్టం దావాతోపాటు చట్ట ప్రకారం ప్రభుత్వం తీసుకునే సివిల్, క్రిమినల్‌ చర్యలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ హెచ్చరించింది. ఈ మేరకు మాజీ సీఎం చంద్రబాబుతోపాటు ఉషోదయా పబ్లికేషన్స్‌ (ఈనాడు), ఆమోద పబ్లికేషన్స్‌ (ఆంధ్రజ్యోతి)కి లీగల్‌ నోటీసులు జారీచేసినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సంచాలకులు వెంకటరెడ్డి శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వంపై దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడం.. అసత్య కథనాలు ప్రచురించడాన్ని వారు తప్పుబట్టారు. కనీసం తమ వాదన (వాస్తవాలను) ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు చోటు కల్పించనందునే తాము మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని వారు వివరించారు. ద్వివేది పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి..
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న గోపాలకృష్ణ ద్వివేది. చిత్రంలో వెంకటరెడ్డి  

► గుంటూరు జిల్లాలో సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌కు సున్నపురాయి మైనింగ్‌ లీజును కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారమే 50 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వందకు వంద శాతం కేంద్రం నిబంధనల ప్రకారమే ఈ జీఓ ఇచ్చాం. 
► వాస్తవం ఇది కాగా.. ప్రభుత్వానికి, గనుల శాఖకు చెడ్డపేరు తెచ్చేలా ‘సొంత సంస్థకు లీజు పెంపా?’ అంటూ ‘ఈనాడు’..  ‘సొంత కంపెనీకి మేలు సిగ్గుచేటు’ అంటూ ఆంధ్రజ్యోతి ఈనెల 10న తప్పుడు కథనాలు ప్రచురించాయి. ‘సరస్వతి’కి వందకు వంద శాతం చట్టబద్ధంగానే ప్రభుత్వం లీజును పొడిగించిందని చంద్రబాబుకు తెలుసు. ఆయన కుట్రతోనే అసత్య అభియోగాలు చేశారు. ఈ రెండు పత్రికలూ కూడా దురుద్దేశంతో ఈ తప్పుడు కథనాలు ప్రచురించాయి.  ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేయాలనే కుట్రే ఇందుకు కారణం. 
► అందువల్ల 15 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరంగా ప్రభుత్వం సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటుందంటూ చంద్రబాబుతోపాటు ఆ రెండు సంస్థలకు లీగల్‌ నోటీసులు జారీచేశాం.
► ఒక పత్రిక (ఈనాడు) ఖండన వార్త ప్రచురించినా అది ఏమాత్రం సంతృప్తిగాలేదు. మరో పత్రిక అసలు రిజాయిండర్‌నే ప్రచురించలేదు.
► కేంద్ర ప్రభుత్వ గనులు, ఖనిజాల అభివృద్ధి–నియంత్రణ సవరణ చట్టం–2015 ప్రకారం.. ఇప్పటివరకూ 31 సంస్థలకు మైనింగ్‌ లీజులను 50 ఏళ్లకు పెంచుతూ జీఓలు ఇచ్చాం. ఇందులో సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కూడా ఒకటి. ఇందులో ఏమీ తప్పులేకపోయినా ఆ పత్రికలు తప్పుడు వార్తలు ప్రచురించాయి. 
► అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు, తప్పుడు.. నిరాధార వార్తలు ప్రచురించిన ఆ పత్రికలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. లేకపోతే చట్టపరంగా పరువు నష్టం దావా వేయడంతోపాటు ప్రభుత్వం క్రిమినల్, సివిల్‌ చర్యలు తీసుకుంటుంది.

అసలేం జరిగిందంటే..
► సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌కు 2009 మే 18న అప్పటి ప్రభుత్వం 613 హెక్టార్ల సున్నపురాయి మైనింగ్‌ లీజును మంజూరు చేస్తూ జీఓ జారీచేసింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఏడాది అక్టోబర్‌ 9న దీనిని రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చింది.
► ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 2015లో గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ (ఎంఎండీఆర్‌–2015) చట్టం తెచ్చింది. ఇది అమల్లోకి వచ్చిన నాటికే మైనింగ్‌ లీజులున్న సంస్థలు దరఖాస్తు చేసుకుంటే లీజును 50 ఏళ్లకు కచ్చితంగా పొడిగించాలని ఈ చట్టంలోని సెక్షన్‌ 8ఎ (3) స్పష్టంగా చెబుతోంది. 
► అప్పట్లో టీడీపీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం లో భాగస్వామి కూడా. దీని ప్రకార మే చంద్ర బాబు అనేక సంస్థలకు మైనింగ్‌ లీజులను 50 ఏళ్లకు పొడిగిస్తూ జీఓలు ఇచ్చారు. 
► ఇలా ఇప్పటివరకు 31 సంస్థలకు అనుమతులు జారీ అయ్యాయి. వీటిల్లో రాంకో సిమెంట్స్, జైపే బాలాజీ సిమెంట్స్, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ వంటి సంస్థలకు వందలాది ఎకరాల లీజును 50ఏళ్లకు చంద్రబాబు సర్కారు పొడిగించింది.
► ఈ నేపథ్యంలో.. కక్షపూరితంగా తమ లీజును రద్దుచేశారంటూ ‘సరస్వతీ పవర్‌’ హైకోర్టుకు వెళ్లగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
► హైకోర్టు ఆదేశాల మేరకు గనుల శాఖ   ‘సరస్వతి’ లీజు పునరుద్ధరిస్తూ 2019 డిసెంబరు 12న జీఓ  109 జారీచేసింది.

ఇప్పుడేం జరిగిందంటే..
► ‘సరస్వతి పవర్‌’ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8న జీఓ ఇచ్చింది. ఇందులో ఏమైనా తప్పు ఉంటే విపక్ష నేతగా చంద్రబాబు ఏదైనా మాట్లాడవచ్చు. కానీ, ఇది కేవలం సీఎం వైఎస్‌ జగన్‌ది అయినందున లీజు పొడిగించారని ఆయన ఇష్టమొచ్చిన రీతిలో ఆరోపణలు చేశారు.

చంద్రబాబు, రామోజీలకు లీగల్‌ నోటీసు
వారంలో క్షమాపణ చెప్పాలి 
ఈనాడు ఎడిటర్‌కూ నోటీసులు
నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం ఉద్దేశించిన సంచులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన సంస్థ నుండి ప్రభుత్వం టెండర్లు వేయకుండానే కొనుగోలు చేసిందంటూ ఆరోపణలు చేసిన చంద్రబాబు, ఆ వార్తను ప్రచురించినందుకు ఈనాడు ఫౌండర్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ రామోజీరావు, ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావులకు రాష్ట్ర ప్రభుత్వం లీగల్‌ నోటీసు జారీచేసింది. ఈ నోటీసు అందిన ఏడు రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం కింద పరిగణించి దావా వేస్తామని హెచ్చరించింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను ఐపీసీ 499, 500, 501, 502 సెక్షన్ల కింద శిక్ష తప్పదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీనివాసరెడ్డి పేరిట జారీచేసిన నోటీసులో పేర్కొన్నారు. 

ఈనాడు, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో టెండర్‌ ప్రకటన
నిజానికి పాలీ ప్రొపెలిన్‌ సంచుల కొనుగోలుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ గత ఏడాది డిసెంబర్‌ 3న ఈనాడు, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో టెండరు ప్రకటన ఇచ్చింది. ఈ–రివర్స్‌ టెండరు విధానాన్ని పౌర సరఫరాల శాఖ పక్కాగా నిర్వహించి పాలీ ప్రొపలిన్‌ సంచులను కొనుగోలు చేసింది. కానీ, ‘తన సొంత పాలిమర్స్‌ సంస్థ నుంచి టెండరు లేకుండా సంచులు సరఫరా చేస్తున్నారు’ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్టను దిగజార్చే విధంగా చంద్రబాబు ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలను ఈనాడులో ప్రచురించారని ఆ నోటీసులో వివరించారు. కానీ, సంచుల కొనుగోలులో పౌర సరఫరాల శాఖ ఏ సంస్థకూ అనుకూలంగా వ్యవహరించలేదని అధికారులు అందులో పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోపణలు చేసినట్లు ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి, వారి అనుబంధ సంస్థలకు ఎటువంటి ప్రమేయం లేకపోయినా తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement