సాక్షి, ఏలూరు : ఓటమి భయంతో తెలుగుదేశం నాయకులు పలుచోట్ల దాడులకు దిగారు. ఏదోవిధంగా ఓటింగ్‌కు జనం రాకుండా చేయాలనే కుట్రలు పన్నారు. అయినా వారి పన్నాగాలు సాగలేదు. ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు తరలివచ్చారు. దీంతో పలుచోట్ల తెలుగుదేశం నాయకులు వీరంగం వేశారు. ఏలూరులో ఎమ్మెల్యే బడేటి బుజ్జి పలువురిపై స్వయంగా పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలపై దాడులు చేశారు.
ఉదయం పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకూ పలు పోలింగ్ కేంద్రాలకు తిరుగుతూ అక్కడ కనిపించిన నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడం, వారిని బెదిరించడం వంటి పనులకు పూనుకున్నారు. పలువురు రౌడీషీటర్లను వెంటేసుకుని హల్‌చల్ చేశారు. ఎన్నికల సమయంలో రౌడీషీటర్లను బైండోవర్ చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యే పక్కన తిరుగుతున్నా వారిని అదుపులోకి తీసుకోకపోవడంతో వారు రెచ్చిపోయారు.
ఉదయం శనివారపుపేట పోలింగ్ కేంద్రానికి వెళ్లిన బడేటి బుజ్జి వైసీపీ కార్యకర్త మట్టా రాజును తీవ్రస్థాయిలో గాయపరిచారు, అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన రాజుపై అక్కడ కూడా దాడి చేసి వెంటాడి మరీ కొట్టారు. మాజీ డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్, మాజీ కార్పొరేటర్ అక్కిశెట్టి చందు, మరో కార్యకర్త కొండబాబు, మరో ఇద్దరిపై బుజ్జి స్వయంగా దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ మరికొందరు రౌడీషీటర్లతో కలిసి బుజ్జి హల్‌చల్ చేస్తున్నా పోలీసు యంత్రాంగం చోద్యం చూసింది తప్ప అడ్డుకునే యత్నమే చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఏలూరు నగరంలో రామకోటి సమీపంలోని బాలికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద మరోసారి బుజ్జి గొడవకు దిగారు. మాజీ డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్‌పై దాడి చేశారు. ఓటర్లను సైతం భయబ్రాంతులకు గురిచేస్తూ చెలరేగిపోయారు. అనంతరం 3వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్ అక్కిశెట్టి చందుపై దౌర్జన్యం చేశారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. చందుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
అనంతరం వంగాయగూడెంలో 16, 17డివిజన్‌లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన బడేటి బుజ్జి మరోసారి అక్కడ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కొండబాబు, ఇతర వ్యక్తులపై దాడి చేశారు. పోలీసులూ బడేటికి వంతపాడుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనే లాఠీలు ఝుళిపించారు. బుజ్జి వైఖరిని ఖండిస్తూ ఏలూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ ఆళ్ళనాని జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన రౌడీషీటర్లు బయట తిరుగుతుంటే పోలీసులు ఏమి చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. టీడీపీకి చెందిన రౌడీషీటర్లు భీమవరపు సురేష్, గుండాల దుర్గారావు తదితరులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు.
దీంతో ఎస్పీ రవిప్రకాష్ స్పందించి బడేటి బుజ్జి వెనుక ఒక స్ట్రైకింగ్ ఫోర్స్‌ను పంపడంతో బుజ్జి ఆగడాలకు అడ్డుకట్టపడింది. టీడీపీ నేతల హల్‌చల్ కార్లు, మోటారుసైకిళ్ళపై టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని అక్కడ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌గా గొడవలకు దిగారు. ఎమ్మెల్యే బుజ్జి అల్లుడు కొట్టు మనోజ్ గురువారం సాయంత్రం వీరంగం చేశారు. స్థానిక 150వ పోలింగ్ స్టేషన్ వద్ద వైఎస్సార్ సీపీ కార్యకర్త రామరాజుపై మనోజ్, అతని అనుచరుల దాడి చేశారు.
తీవ్రంగా గాయపడిన రామరాజును ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం పోలింగ్ స్టేషన్ వద్ద డబ్బులు పంచుతున్నారని సమాచారం ఇచ్చిన రామరాజు అతని తల్లి తండ్రులపై బుజ్జి దాడి చేశారు. మరోసారి రామరాజుపై ఎమ్మెల్యే అల్లుడు కొట్టు మనోజ్ దాడిచేయడం విమర్శలకు దారితీసింది. ఉంగుటూరులో ఉదయం ఎన్నికల సమయంలో టీడీపీ చెందిన నేత వైఎస్సార్ సీపీకి చెందిన దళితులను దూషించడంపై రాత్రి ఎన్నిక ముగిసిన తర్వాత మరోవర్గం వారు జాతీయ రహదారిని దిగ్బంధించారు.
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. భీమవరం నియోజకవర్గంలో జనసేన ఓటమి పాలవుతుందన్న విషయాన్ని జీర్జించుకోలేక జనసైనికులు వైఎస్సార్‌సీపీ నేతలపై గురువారం దౌర్జన్యానికి దిగారు. వీరవాసరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ కేంద్రంలో జనసైనికులు ఎరుపు రంగు తువాలు కట్టుకుని ప్రచారం నిర్వహించారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం నిలిపివేయాలని ఎర్రకండువాలు తొలగించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరారు.
ఇదే విషయాన్ని ఎన్నికల అధికారికి తెలియచేయడంతో కండువాలు తొలగించాలని వివరించారు. ఈ సమయంలో కొంత మంది జనసైనికులు వైఎస్సార్‌సీపీ నాయకులపైకి దౌర్జన్యానికి దిగారు. ఇదే మండలం రాయకుదురులో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నాయకులు ఘర్షణకు దిగారు. రోడ్డుపై ఓటర్లను కలుసుకుంటున్న సందర్భంలో కొంతమంది టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులపై దురుసుగా ప్రవర్తించారు. ఏలూరు రూరల్ మండలం పత్తికోళ్ల లంకలో ఇరువర్గాల మద్య జరిగిన ఘర్షణలో ఐదుగురు గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment