వాయిదాపడిన పంచాయతీలకు...18న పోలింగ్
Published Thu, Jan 2 2014 2:23 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు : వాయిదా పడిన గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ నెల 18న పోలింగ్ జరిపేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూలును జిల్లా కేంద్రాలకు విడుదల చేసింది. ఆయా వివరాలను కలెక్టర్ సురేశ్‌కుమార్ జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డీవోలకు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 1010 గ్రామ పంచాయతీలు, 10,654 వార్డులకు 2013 జులై 23, 27, 31 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. వీటిల్లో కొన్ని పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. సర్పంచ్ పదవిని బహిరంగ వేలం ద్వారా దక్కించుకున్నారని అందిన ఫిర్యాదుల మేరకు కలెక్టర్ కొన్ని చోట్ల ఎన్నికల్ని వాయిదా వేశారు. అదేవిధంగా రిజర్వుడ్ అభ్యర్థులు లేక నామినేషన్లు పడని పంచాయతీలకు కూడా అప్పట్లో ఎన్నికలు జరగలేదు. అమరావతి మండలం ముత్తాయపాలెం, పెదకాకాని మండలం రామచంద్రాపురం, పెదకూరపాడు మండలం ముస్సాపురం, ముప్పాళ్ల మండలం కుందురువారిపాలెం, పొన్నూరు మండలం కసుకర్రు, మంగళగిరి మండలం బేతపూడి గ్రామాల్లో జరగాల్సిన ఎన్నికలు అప్పట్లో వా యిదా పడ్డాయి. వీటితో పాటు మరో 23 పంచాయతీల్లోని 37 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు డీపీవో చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఇదీ ఎన్నికల షెడ్యూలు...
ఈ నెల 18న పోలింగ్ జరిగే పంచాయతీలు, వార్డులకు 3న నోటీసు విడుదల చేస్తారు. అదే రోజు నుంచి ఆరు వరకు నామినేషన్ల స్వీకరణ, 7న నామినేషన్ల పరిశీలన, 10వ తేదీలోగా నామినేషన్ల ఉపసంహరణ జరగాల్సి ఉంది. 18న పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. వీలైతే ఉపసర్పంచ్‌ని కూడా ఎన్నుకుంటారు. ఏదేని కారణంతో ఉపసర్పంచ్ ఎన్నిక ఆ రోజు జరగకపోతే మరుసటి రోజు నిర్వహిస్తామని డీపీవో చంద్రశేఖర్ వివరించారు. వివరాలను తెనాలి, గుంటూరు, నర్సరావుపేట ఆర్డీవోలకు వివరించామని తెలిపారు. కాగా గురువారం నుంచి సంబంధిత ఆర్డీవోలు ఓటర్ల జాబితాలను సరిచూసుకోవడం, బ్యాలెట్ బాక్సుల్ని సిద్ధం చేసుకోవడం, పోలింగ్ బూత్‌ల ఏర్పాటు వంటి పనుల్లో నిమగ్నం కానున్నారు.
Advertisement
Advertisement