ఐసీడీఎస్ పీడీ కార్యాలయం
నెల్లూరు (వేదాయపాళెం): అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ఖాతాలలో బిల్లులు జమ కావడంతోనే వారివద్దనుంచి నిర్దేశిత పర్సంటేజీలలో కొందరు సీడీపీఓలు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆయా సెక్టార్లలో అంగన్‌వాడీ కార్యకర్తలుగా పనిచేస్తూ సెక్టార్ల లీడర్లుగా కొనసాగేవారే తోటి అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి బలవంతపు వసూళ్లు సాగిస్తూ కీలకంగా మారుతున్నారు.
అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి వసూలు చేసిన పర్సంటేజీల నగదును గుట్టుచప్పుడు కాకుండా సూపర్‌వైజర్లకు అందజేస్తుంటారు. సూపర్‌వైజర్లు సీడీపీఓలకు చెల్లించాల్సిన స్థాయి మొత్తాన్ని గోప్యంగా వారికి చేరుస్తున్నారు. ఆయా ప్రాజెక్ట్‌ల పరిధిలో నెలవారీ మామూళ్లు రూ.లక్షలు సీడీపీఓలు, సూపర్‌వైజర్ల పరమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి.
వసూళ్ల పరంపర ఇలా..
టీఏ బిల్లులలో 10 శాతం వసూలు చేస్తున్నారు. అదేమిటంటే ట్రెజరీలో మూడు శాతం సమర్పించుకోవాలని, మిగతాది వేరే ఖర్చులు అంటూ అక్రమ వసూళ్లను సమర్థించుకుంటున్నారు. గ్యాస్ బిల్లులు, అంగన్‌వాడీ కేంద్రం అద్దె బిల్లులు విషయంలో ఐదు శాతం వసూలు చేస్తున్నారు. ఇచ్చే నెల వారీ గ్యాస్ బిల్లులు అంతంత మాత్రంగా ఉండగా పర్సంటేజ్‌లు వసూలు చేస్తుండటంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లపై ఆర్థికభారం పడుతోంది. అలాగే అర్బన్ ప్రాంతాల్లో ఇంటి అద్దెలు అధికంగా ఉన్నా రూ.3వేలు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారు.
అద్దె బిల్లులు విషయంలో కూడా సూపర్‌వైజర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కోతలు విధిస్తున్నారు. నెల వారీ ఇంటి అద్దెలు సక్రమంగా పడకున్నప్పటికీ అంగన్‌వాడీ కార్యకర్తలే ఇంటి యజమానులకు నచ్చజెప్పకోవడమో లేదా తామే ఆర్థిక భారాన్ని భరించటమో చేస్తున్నారు. ఈ క్రమంలో బిల్లులు పడినప్పడు తమ పర్సంటేజ్‌లు తమకు ఇవ్వాల్సిందేనంటూ బెదిరింపులకు పాల్పడటం కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుడ్లలోనూ కమీషన్లే..
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ నుంచి అధికారులు నెలవారీ మామూళ్లకు పాల్పడుతున్నారు. నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ కమీషన్ దండుకుంటున్నారు. అక్రమ వసూళ్ల కారణంగా కోడిగుడ్ల సరఫరాలో లోపాలున్నప్పటికీ సీడీపీఓలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
కనీస గుడ్డు బరువు 50 గ్రాములు ఉండాల్సి ఉండగా తక్కువ బరువు కలిగిన గుడ్డులు సరఫరా చేస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంగన్‌వాడీ కార్యకర్తలు కోడిగుడ్ల విషయం సూపర్‌వైజర్లు, సీడీపీఓలకు చెబుతున్నప్పటికీ పట్టించుకోవటంలేదు. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోవాలంటూ సూపర్‌వైజర్లు, సీడిపీఓలు అంగన్‌వాడీ కార్యకర్తలకు సర్దిచెబుతున్నారు. కమీషన్‌లే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమావేశాల్లో బెదిరింపులు
ప్రాజెక్ట్, సెక్టార్ మీటింగ్‌లలో పర్సంటేజీలు చెల్లించని అంగన్‌వాడీ కార్యకర్తలను సీడీపీఓలు, సూపర్‌వైజర్లు బెదరిస్తున్నారు. విధి నిర్వహణలో రికార్డులన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ సమావేశంలో నిలబెట్టి దూషిస్తున్నారు. పర్సంటేజీలు ఇవ్వకపోవడమే ఇందకు కారణమని సమాచారం. జిల్లా అధికారులు దృష్టి సారించి ఐసీడీఎస్‌లో ఉన్న అవినీతిని ప్రక్షాలన చేయాల్సిన అవసరం ఉంది.
ట్రెజరీలో పర్సంటేజీల మోత
ప్రతిబిల్లు విషయంలో జిల్లాలోని 17 ప్రాజెక్ట్‌లలో అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి పర్సంటేజీలు వసూలు చేస్తున్న మాట వాస్తవమే. టీఏ బిల్లులు, గ్యాస్, ఇంటి అద్దె బిల్లులు విషయంలో సీడీపీఓలు బలవంత వసూళ్లకు పాల్పడుతున్నారు.
–వై.సుజాతమ్మ, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి
ఫిర్యాదు చేస్తే చర్చలు తీసుకుంటాం
ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లలో బిల్లుల చెల్లింపుల విషయంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు ఈ విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకుని వస్తే పరిస్థితిని చక్కదిద్దుతాం.
–పి.ప్రశాంతి, ఇన్‌చార్జి పీడీ, ఐసీడీఎస్
Comments
Please login to add a commentAdd a comment