
టీడీపీవి దిగజారుడు రాజకీయాలు
కర్నూలు(ఓల్డ్‌సిటీ):
తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారమే పరమావధిగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. డీసీసీబీ చైర్మన్ గిరి కోసం అధికార పార్టీ నేతలు కుట్రపన్నారని ఆయన ఆరోపించారు. సోమవారం స్థానిక కళావెంకట్రావు భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోట్ల మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికలో భాగంగా డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మాన ప్రక్రియను టీడీపీ నాయకులు వాయిదా వేయించారని ఆరోపించారు. డెరైక్టర్లను భయపెట్టి క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. డీసీఓ సుబ్బారావుకు గుండెపోటు రావడం, కలెక్టర్ విజయమోహన్ సెలవులో వెళ్లడం.. ఇదంతా టీడీపీ నాయకుల వ్యూహమన్నారు. ఏ సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి, డీసీసీబీ శ్రీదేవిలపై తప్పుడు కేసులు పెట్టడం ఆ పార్టీ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శమన్నారు. అడ్డదారిలో పదవులు చేజిక్కించుకునేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హైడ్రామా నడుపుతున్నారని ఆరోపించారు. తాను కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడే కర్నూలుకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెప్పించానని, బడ్జెట్ కేటాయింపులను ఎవరూ ఆపలేరని చెప్పారు. కోడుమూరు, దేవనకొండ రహదారులు కాంగ్రెస్ హయాంలో మంజూరు చేసినవేనని గుర్తు చేశారు. డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ లేకున్నా నాడు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి జెడ్పీ పీఠం లాక్కున్నారని, నేడు కాంగ్రెస్ వారి నుంచి కేడీసీసీ చైర్మన్ పదవి పొందేందుకు క్యాంపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు మాట్లాడుతూ టీడీపీ నాయకులు డోన్, బేతంచెర్ల, వెల్దుర్తి, కర్నూలులో యథేచ్ఛగా ఇసుక తరలింపు, అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు తప్పడు వాగ్ధానాలు చేసి తీరా అధికారంలోకి వచ్చాకా ఆదర్శరైతులను ఇంటికి పంపించారని, వికలాంగులు, వితంతువులు, వృద్ధుల పింఛన్లు రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో డీసీసీ సెక్రటరీ ఎస్.ఖలీల్‌బాష, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, డీసీఎంఎస్ చైర్మన్ లక్కసాగరం లక్ష్మిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ఎం.పి.తిప్పన్న, చున్నుమియ్య, సలాం, భాస్కరరెడ్డి, ఇమాంపటేల్ పాల్గొన్నారు.