అదే ఆలస్యం.. అవే అవస్థలు
- రైళ్ల రాకపోకల్లో విపరీతమైన జాప్యం
- పడరాని పాట్లు పడుతున్న ప్రయాణికులు
పుష్కరఘాట్ (రాజమండ్రి) : పుష్కర స్నానమాచరించేందుకు రైళ్లలో రాజమండ్రి వస్తున్న ప్రయాణికులు అవే కష్టాలు ఎదుర్కొంటున్నారు. రైళ్లు ఆలస్యంగానే నడవడంతో అసహనానికి గురవుతున్నారు. కర్నూలు, కడప, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల నుంచి వచ్చే భక్తులు అధికంగా రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు 112 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నా సరిపోవడం లేదు.
రైలు ప్లాట్‌ఫారం మీదకు వచ్చేసరికి చోటు దొరకదనే భయంతో యాల్రికులు పట్టాలపై నుంచి పరుగులు తీసి రెలైక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. నాలుగైదు గంటలకు ఒకసారి తమ ప్రాంతానికి వెళ్లే రైలు రావడంతో యాత్రికుల నడుమ తోపులాటలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సోమవారం రద్దీ మరింత అధికం కావడంతో రాజమండ్రి , గోదావరి రైల్వే స్టేషన్లు భక్తులతో కిటకిటలాడాయి.
ఇబ్బందులు పడుతున్న పిల్లలు
రైళ్లలో ప్రయాణించే భక్తుల పిల్లలు ఆలస్యాన్ని, అసౌకర్యాన్నీ తట్టుకోలేక గగ్గోలు పెడుతున్నారు. వారిని సముదారుుంచడం తల్లిదండ్రుల వల్ల కావడం లేదు. కొంత మంది తిరుగు ప్రయాణంలో బస్సులను ఆశ్రయిస్తున్నారు. అవి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. రాజమండ్రి, గోదావరి రైల్వే స్టేషన్లు దుర్గంధభరితంగా మారాయి. పారిశుధ్య సిబ్బంది తక్కువగా ఉండడంతో పరిసరాలను పరిశుభ్రం చేయడం సాధ్యపడడం లేదు. యాత్రికులు తినుబండారాల వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ పారవేయడం, బహిరంగ మలమూత్ర విసర్జన చేయడం వల్ల పరిసరాలు దుర్గంధపూరితం అవుతున్నారుు. బయో టాయిలెట్లు కూడా పూర్తి స్థాయిలో నిర్వహణ లేక కంపుకొడుతున్నాయి.
సొమ్మసిల్లిపోతున్నారు..
రైల్వేస్టేషన్/ రాజమండ్రి సిటీ : సోమవారం ఉదయం నుంచి రైల్వే, బస్‌స్టేషన్‌లు రద్దీగా మారాయి. రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో ఒడిశా రాష్ర్టం పర్లాకిమిడికి చెందిన రాము రైలు ఎక్కబోయి సొమ్మసిల్లిపోగా రైల్వే ఆసుపత్రి సిబ్బంది సేవలు అందించారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే వికలాంగుడు రైలు ఎక్కే సమయంలో చాలా ఇబ్బంది పడ్డాడు. రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో నాలుగు, ఐదు ప్లాట్‌ఫారాలకు చేరుకోవాలంటే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది పట్టాలపైనే ఉంటూ రైళ్ల రాక కోసం ఎదురు చూస్తున్నారు.