సాక్షి, రాజమండ్రి : ఢిల్లీ సర్కారు దయ తలిస్తేనే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్టు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకంగా పుష్కరాలు నిర్వహించాలంటే సుమారు రూ.957 కోట్లు పైగా నిధులు కావాలని పలువురు అధికారులు మరోసారి సీఎంకు నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
వీటిలో కేంద్రం నుంచి రూ.600 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నట్టు ఎమ్మెల్యేల వద్ద ముఖ్యమంత్రి అన్నట్టు తెలిసింది. మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్డు పనుల కోసం ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.133 కోట్లు మంజూరు చేశారు. ఇందులో మన జిల్లాకు రూ.87 కోట్లు ఇచ్చారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో పంచాయతీరాజ్ శాఖకు రూ.27 కోట్లు ఇచ్చారు. సుమారు రూ.86 కోట్లతో ఇరిగేషన్ శాఖ చేసిన ప్రతిపాదనలను ఆమోదించే అంశం చివరి దశలో ఉంది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో చర్చించారు. ఇంకా వివిధ శాఖలు సమర్పించిన అంచనాలు, వాటిలో ముఖ్యంగా చేపట్టాల్సిన పనులు కూడా సీఎం సమావేశంలో చర్చకు వచ్చాయి.
ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అంచనాలతో కాలక్షేపం చేయకుండా, ఆయా శాఖలు పనులు ప్రారంభించాలని కోరారు. పుష్కరాలకు ఆరు నెలల సమయం మాత్రమే ఉందని, ఈలోగా పనులు పూర్తి కావడం కష్టమవుతుందని చెప్పారు. రోడ్లు, స్నానఘట్టాల నిర్మాణాలకు తగినంత సమయం లేకుంటే నాణ్యత లోపిస్తుందని రాజమండ్రి సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అంచనాల్లో అధికారులు కోతలు విధిస్తూ అనవసర కాలయాపన చేస్తున్నారంటూ పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రాజమండ్రి రోడ్ కం రైలు వంతెన మరమ్మతులు, గోదావరిపై నిర్మాణంలో ఉన్న నాలుగు లేన్ల వంతెన పనులపై కూడా చర్చించారు. సమావేశంలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కాగా గోదావరి పుష్కరాలపై కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో ముఖ్యమంత్రి బుధవారం మంగళగిరిలో సమీక్షించనున్నారు.
పనులు వేగవంతం చేయమన్నాం
పుష్కరాలు సమీపిస్తున్నందున పనులు వేగవంతం చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరినట్టు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయనతో ‘సాక్షి’ ఫోన్‌లో మాట్లాడింది. రోడ్ కం రైలు వంతెనకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేసే అంశంపై మెట్‌కో సంస్థ ఇచ్చిన నివేదికను థర్‌డ పార్టీ పరిశీలనకు పంపి త్వరగా పనులు చేపట్టాలని కోరామన్నారు. గోదావరి కాలుష్యం భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తోందని, కాలుష్య నివారణ చర్యలు ముఖ్యమని చెప్పాన్నారు. నగరంలోని మురుగు నీటిని గోదావరిలో కలిపే నల్లా చానల్‌ను మళ్లించాలని, ధవళేశ్వరం నుంచి కోటిలింగాలరేవు వరకూ ఉన్న గోదావరి గట్టు రోడ్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ సర్కారు దయతలిస్తేనే..
Published Wed, Jan 7 2015 1:10 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement
Advertisement