
విభజనపై ముందుకెళితే తీవ్ర నిర్ణయాలు: గంటా
తగరపువలస: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ముందుకు వెళితే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం విశాఖ జిల్లా భీమునిపట్నంలో రచ్చబండ ప్రారంభం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధిష్టానం ఓట్లు, సీట్లు కోసమే రాష్ట్ర విభజనకు పూనుకున్నదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయన్నారు. కాంగ్రెస్‌కు దేశంలో అనేక రాష్ట్రాల్లో సీట్లు బాగా తగ్గిపోయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో సాధించిన సీట్లు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయన్నారు.
కొందరు ఢిల్లీ పెద్దల కన్ను ఆంధ్రపై పడిందని.. అందుకే రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి పూనుకున్నారని విమర్శించారు. అయితే కేంద్రం తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తుందనే నమ్మకముందన్నారు. వెస్టిండీస్-ఇండియా మ్యాచ్‌ను తాము అడ్డుకుంటామని వస్తున్న కథనాలను ఖండించారు. భీమిలి పోర్టు పనులు త్వరలో ప్రాంరంభమవుతాయని చెప్పారు. ప్రాజెక్టు రిపోర్టు కోసం కన్సెల్టెన్సీకి అప్పగించామన్నారు.