‘ప్రసవ’ వేదన
సాక్షి , అనంతపురం : వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఇంటివద్దే ప్రసవాలు జరుగుతుండడం వైద్య, ఆరోగ్య శాఖ పనితీరును ప్రశ్నార్థకం చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో గత ఏడాది 75,331 ప్రసవాలు జరిగాయి. ఇందులో 31,030 ప్రభుత్వాస్పత్రుల్లో, 41,802 ప్రైవేటు ఆస్పత్రుల్లో, 2,499 ఇళ్ల వద్ద జరిగాయి. గతేడాది జిల్లా వ్యాప్తంగా ఏడాదిలోపు శిశువులు దాదాపు 450 మంది మృత్యుఒడికి చేరినట్లు రికార్డులు చెబుతున్నాయి. పది మంది తల్లులు కూడా ప్రాణాలొదిలారు.
గర్భిణుల్లో రక్తహీనత, రక్తపోటులో మార్పులు, పిండం ఎదగకపోవడం వంటి కారణాలతోనే అధిక శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ప్రసవం మహిళకు పునర్జన్మలాంటింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాల మీదకొస్తుంది. ఆస్పత్రుల్లో ప్రసవం సురక్షితమే కాకుండా.. తల్లీ బిడ్డకు శ్రేయస్కరం. అందుకే ప్రతి కాన్పు వైద్యుల సమక్షంలోనే జరగాలి. గర్భం దాల్చిన వెంటనే సదరు మహిళల వివరాలను నమోదు చేసుకుని.. ప్రతినెలా వైద్య పరీక్షలు చేయించుకునేలా, టీకాలు వేయించుకునేలా శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ఆయా పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బందిపై ఉంది. ప్రసవ సమయంలో 108 అంబులెన్స్‌ను వినియోగించుకుని ఆస్పత్రికి వెళ్లేలా చూడాలి. చాలా పీహెచ్‌సీల పరిధిలో ఇలా జరగడం లేదు. ఒక్కో పీహెచ్‌సీలో ప్రతి నెలా 15 ప్రసవాలు తప్పనిసరిగా చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించినా వైద్యుల నిర్లక్ష్యంతో సాధ్యపడడం లేదు. కొందరు ఇళ్లలోనే పాత విధానంలో ప్రసవాలు చేస్తుండడంతో మాతా శిశు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.
కరువైన చిత్తశుద్ధి
పీహెచ్‌సీల్లో ప్రసవాలను పక్కనపెడితే గర్భిణులు ఆస్పత్రులకువచ్చేలా చూడడంలోనూ వైద్యులు విఫలమవుతున్నారు. గర్భిణులను ఆస్పత్రులకు తీసుకొచ్చి.. తిరిగి తీసుకెళ్లేందుకు 108 వాహనాలను వినియోగించుకునే వెసులుబాటు ఉన్నా.. దీని గురించి సరైన ప్రచారం కల్పించడం లేదు.