యశ్వంత్ మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి
సైనింగ్ ఆఫ్!...
– విషాదం నింపిన వైద్య విద్యార్థి ఆత్మహత్య
– ‘పరీక్షల’ ఒత్తిడిని జయించలేక బలవన్మరణం
– శోకసంద్రంలో మెడికల్ కళాశాల విద్యార్థులు
– గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు
– కళాశాల సెంట్రల్ హాల్‌లో సంతాప సభ
ఒత్తిడి.. ఓ జీవితాన్ని చిదిమేసింది. మానసిక సంఘర్షణ.. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. ఈ ప్రపంచాన్ని జయించలేకపోతున్నాననే భావన.. రెండు పదుల వయస్సు దాటని ఓ యువకుడికి మరణశాసనం రాసింది. చదువులో వెనుకబడ్డాననే ఆత్మన్యూనత.. ఓ వైద్య విద్యార్థిని బలిగొంది. రోగులకు ధైర్యం చెప్పాల్సిన వైద్య విద్యార్థి.. తనే ఆత్మస్థైర్యం కోల్పోయిన విషాదమిది. ఊపిరి పోయాల్సిన చేతులతో తనకు తానే రాసుకున్న మృత్యుగీత ఇది. తల్లిదండ్రుల ఆశలను సమాధి చేస్తూ.. బంగారు భవిష్యత్తును కాలరాస్తూ ఓ విద్యా కుసుమం శాశ్వత సెలవు తీసుకున్న ఘటన ‘అనంత’ వేదనాభరితం.
‘‘నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు.. నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. కానీ నేను ఈ ప్రపంచాన్ని జయించలేకపోతున్నాను.. అందుకే ‘సైనింగ్ ఆఫ్.’’- జి.యశ్వంత్
ఎన్నో కలలు.. మరెన్నో ఆశయాలు.. ఉజ్వల భవిష్యత్ కళ్లముందు కదలాడుతోంది.. కానీ పోటీ ప్రపంచంలో ఒత్తిడిని జయించలేకపోయాడు. స్నేహితులంతా చదువులో ముందుకెళ్తుంటే ఎక్కడ వెనుకబడిపోతానోనన్న భయం అతడిని వెంటాడింది. మానసికంగా కుంగిపోయి ఈ ప్రపంచాన్ని జయించలేకపోతున్నానంటూ చివరకు మృత్యుఒడి చేరాడు. తల్లిదండ్రుల ఆశలను సమాధి చేస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం పరీక్షలు ముగిసే చివరి రోజు గురువారం వైద్య విద్యార్థి జి.యశ్వంత్ మహేంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
అనంతపురం మెడికల్: ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 8 నుంచి థియరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బయోకెమిస్ట్రీ పేపర్–1, 2, అనాటమీ పేపర్–1, 2, ఫిజియాలజీ–1 పరీక్షలను యశ్వంత్ రాశాడు. అనాటమీ పేపర్–2 పరీక్ష ముగిశాక సరిగ్గా రాయలేదని తోటి విద్యార్థులతో చెప్పాడు. అయితే అందరూ ధైర్యం చెప్పారు. వాస్తవానికి కళాశాలలో నిర్వహించిన ఇంటర్నల్స్‌లో యశ్వంత్‌కు మంచి మార్కులు వచ్చినట్లు అధ్యాపకులు తెలిపారు. చదువులో చురుగ్గా ఉండే అతడు ఎక్కడ తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అవుతానోనని భయ పడేవాడని తెలిసింది. ఈ క్రమంలోనే మూడ్రోజుల క్రితం ‘టెన్షన్’ పడుతుండడంతో తండ్రి చంద్రశేఖర్ కళాశాలలోని హాస్టల్‌కు వచ్చి ధైర్యం చెప్పారు. సీనియర్లు, అధ్యాపకులు సైతం మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కానీ ఇవేమీ అతడి ‘మృత్యు’పయనాన్ని ఆపలేకపోయాయి. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో హాస్టల్ నుంచి ‘పెద్దమ్మ’ ఇంటికి వెళ్తున్నానని బయటకు వచ్చాడు. ఎక్కడికెళ్లాడో తెలియదు గానీ ఉదయానికి విగతజీవిగా మారాడు. సూసైట్ నోట్ రాసి రాంనగర్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
అన్యాయం చేసి పోయావు కదరా..!
హిందూపురంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక నివాసముంటున్న యశ్వంత్ తండ్రి చంద్రశేఖర్ లేపాక్షి మండలం చోళసముద్రం పాఠశాలలో ఉపాధ్యాయుడు. తల్లి సుమతి పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్. సోదరి నాగ తేజశ్వని సైతం వైద్య వృత్తిపై మక్కువతో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడన్న నిజాన్ని చంద్రశేఖర్ దంపతులు జీర్ణించుకోలేకపోయారు. మృతదేహాన్ని గుర్తించిన వెంటనే సమాచారాన్ని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావుకు తెలియజేశారు. ఆయన తల్లిదండ్రులకు చేరవేయడంతో 11.30 గంటల సమయంలో వారు మార్చురీ వద్దకు చేరుకున్నారు. లోపలికి వచ్చే సమయంలోనే తల్లి కుప్పకూలిపోగా ‘మమ్మల్ని అన్యాయం చేసి వెళ్లిపోయావు కదరా..’అంటూ తండ్రి గుండెలవిసేలా రోదించారు. ‘మేం ఏ పాపం చేశాం దేవుడా..మాకెందుకింత శిక్ష వేశావు..’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.
పరీక్ష ముగిశాక విద్యార్థులకు షాక్
ఫిజియాలజి పేపర్–2 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగింది. 9 గంటలకే పరీక్ష గదిలోకి యశ్వంత్ స్నేహితులు, తోటి విద్యార్థులంతా వెళ్లారు. పరీక్ష ప్రారంభం అయ్యాక యశ్వంత్ కుర్చీ ఖాళీగా ఉండడంతో గైర్హాజరయ్యాడేమోనని అంతా భావించారు. ఇదే సమయంలో యశ్వంత్ ఆత్మహత్య విషయం ఎగ్జామినర్‌గా ఉన్న ఆదిరెడ్డి పరదేశినాయుడుకు తెలిసింది. అయితే ఆ విషయాన్ని చెబితే అందరూ ఆందోళన చెందుతారన్న భావనలో అలాగే ఉండిపోయారు. పరీక్ష ముగిసిన వెంటనే చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. నేరుగా మార్చురీ గది వద్దకు వచ్చి కంటతడిపెట్టారు. పోస్టుమార్టం ముగిశాక మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో తీసుకెళ్లే సమయంలో అక్కడంతా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. వైద్య విద్యార్థులంతా అలా చూస్తూ నిలబడిపోయారు. ఈ దృశ్యాలను చూసిన వారంతా ‘అయ్యో’ ఎంతో ఘోరం జరిగిందయ్యా.. అంటూ నిట్టూర్చారు.
కళాశాల సెంట్రల్ హాల్‌లో సంతాపం
కళాశాలలోని సెంట్రల్ హాల్‌లో గురువారం సాయంత్రం యశ్వంత్ మృతికి సంతాప సభ నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వైద్యవిద్యార్థులంతా హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ ఉషాదేవి, జేసీ రెడ్డి, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు యెండ్లూరి ప్రభాకర్, మైరెడ్డి నీరజ, శాంతాబాయి, వరలక్ష్మి, రేణుకాదేవి, ఆదిరెడ్డి పరదేశినాయుడు, సాయి సుధీర్, మెన్స్ హాస్టల్ వార్డెన్ డాక్టర్ మహేశ్, ఉమెన్స్ హాస్టల్ వార్డెన్ డాక్టర్ సంధ్య, డాక్టర్ ఆది నటేశ్, డాక్టర్ వైఎంఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.