helath department
-
Hyderabad: పబ్బుల యాజమాన్యాలకు సీపీ సీరియస్ వార్నింగ్!!
Omicron Restrictions In Hyderabad హైదరాబాద్: నూతన సంవత్సరవేడుకలు సందర్భంగా పబ్బుల యాజమాన్యాలకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మైనర్లకు లిక్కర్ అమ్మితే బార్లు, పబ్ లకు చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నూతన సంవత్సరాల వేడుకలు పై ఆరోగ్య శాఖ ఇచ్చే సూచనల మేరకు ముందుకు పోతామన్నారు. ఆంక్షల ప్రకారమే సెలెబ్రేషన్స్ జరుపుకోవాలని, నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి అన్ని ఏరియాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో మాత్రమే వేడుకలు జరుపుకోవాలని, వేడుకల్లో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని నగరవాసులకు సూచనలు జారీ చేశారు. చదవండి: గుజరాత్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు: 4 మృతి, 11 మందికి తీవ్ర గాయాలు -
పిల్లలకు టీకాలపై ఆరోగ్య శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: భారతీయ చిన్నారులు కీలకమైన కోవిడ్ టీకాను పొందలేకపోతున్నారనే వార్తలు నిరాధారమని ప్రభుత్వం స్పందించింది. అన్ని రాష్ట్రాలతో కోవిడ్ నెగిటివ్ ప్రభావాలను తగ్గించే చర్యలపై నిరంతరం చర్చిస్తున్నామని తెలిపింది. సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ టీకాలు అందిస్తామని భరోసా ఇచ్చింది. ప్రపంచంలో భారత్‌లోనే అత్యధికంగా టీకా పొందని పిల్లలున్నారని, వీరి సంఖ్య సుమారు 35 లక్షలని యూనిసెఫ్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా... ఇవన్నీ నిరాధార నివేదికలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా ఆరంభం నుంచి అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామని వివరణ ఇచ్చింది. 2021 తొలి త్రైమాసికానికి దేశంలో 99 శాతం డీటీపీ3 కవరేజ్ చేశామని తెలిపింది. సార్వత్రిక టీకా ప్రోగ్రామ్‌లో భాగంగా అందరికీ టీకాలు తప్పక అందిస్తామని తెలిపింది. -
పట్నంలో అడవి దోమ!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటి దాకా ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకే పరిమితమైన దోమలు ఇప్పుడు గ్రేటర్‌లోనూ దాడులు చేస్తున్నాయి. ప్రధానంగా మలేరియాలో ప్రమాదకరమైన ప్లాస్మోడియం పాల్సీ ఫారం(పీఎఫ్) నగరంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి దాకా 191 మలేరియా కేసులు నమోదవగా, వీటిలో 150 మందిలో పీఎఫ్ లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. అనధికారికంగా ఈ లెక్క మరింత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి ద్వారా మలేరియా సోకుతుంది. మలేరియాలో ప్లాస్మోడియం వైవాక్స్(పీవీ), ప్లాస్మోడియం పాల్సీఫారం(పీఎఫ్) అనేవి రెండు రకాలు. ప్లాస్మోడియం వైవాక్స్ వ్యాపించినపుడు జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు ఉంటాయి. మందులు వాడితే తగ్గిపోతుంది. ఇది అంత ప్రమాదకరమైంది కాదు. కానీ ప్లాస్మోడియం పాల్సీఫారం మలేరియా చాలా ప్రమాదకరమైంది. గతంలో ఎక్కడో గిరిజన, అటవీ ప్రాంతాల్లో కన్పించే ఈ జ్వరాలు.. ప్రస్తుతం నగరంలోనూ వ్యాపిస్తున్నాయి. శివారు ప్రాంతాలు విస్తరించడం, కొత్తగా ఫామ్‌హౌస్‌లు అందుబాటులోకి రావడం, నిర్మాణానికి సంబంధించిన గుంతల్లో వరద నీరు చేరి నిల్వ ఉండటం, వాటి నిండా చెత్త పేరుకపోవడం వల్ల ఈ దోమల వ్యాప్తికి కారణమవుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రక్త పరీక్ష చేసేవారే లేరు హైదరాబాద్ జిల్లాలో ఫీవర్ ఆస్పత్రి, కింగ్‌కోఠి, మాసాబ్ ట్యాంక్, మలక్‌పేట, సికింద్రాబాద్, కంటోన్మెంట్లలో మలేరియా సబ్‌సెంటర్లు ఉన్నాయి. 17 మంది ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు ఉండగా, వీటన్నింటికీ ఒక్క టెక్నీషియన్ మాత్రమే ఉన్నాడు. మిగతా 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆయా ఆస్పత్రుల్లో రక్త పరీక్షలు చేసే నాథుడే కనిపించడం లేదు. ఒక ప్రాంతంలో మలేరియా, డెంగీ కేసు నమోదైన వెంటనే ఆ కుటుంబంలోని మిగతా సభ్యులతో పాటు సదరు కాలనీలో 50 మందికి తక్కువ కాకుండా రక్త నమూనాలు సేకరించాలి. వాటిని ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలు నమూనాలు సేకరించాలి. కొన్ని ఏరియాల్లో సేకరిస్తున్నా అవి ల్యాబ్‌లకు పంపి చేతులు దులుపుకొంటున్నారు. వాటిని పరీక్షించేందుకు తీవ్రంగా సిబ్బంది కొరత వేధిస్తోంది. పారిశుధ్యంపై దృష్టి దోమల నియంత్రణ చేపట్టాల్సిన బల్దియా చోద్యం చూస్తోంది. విజృంభిస్తున్న డెంగీ జ్వరాలు కొన్ని రోజులుగా నగరంలో డెంగీ జ్వరాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో గతేడాది 150 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైతే.. ఈ ఏడాది ఇప్పటి దాకా 205 కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి ఈ జ్వర లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డెంగీని పూర్తిగా నివారించవచ్చు. అయితే, అందుకు తొలుత రక్త పరీక్షలు చేయాల్సి ఉన్నా ఆస్పత్రుల్లో ఆ అవకాశం దాదాపు ఉండడం లేదు. నగరంలో మలేరియా, డెంగీ జ్వరాలు ప్రబలుతున్నా సరే వైద్య ఆరోగ్యశాఖ మాత్రం నివారణ చర్యలు తీసుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం ఆ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. లక్షణాల గుర్తింపు ఇలా.. ప్లాస్మోడియం పాల్సీఫారం రకం మలేరియాను వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. చికిత్స అందించడంలో ఆలస్యమైతే కాలేయం, మూత్ర పిండాలను దెబ్బతీస్తుంది. మెదడుపైనా దాడి చేసి రోగి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. దోమ కుట్టిన 10 నుంచి 14 రోజుల్లో జ్వరం వస్తుంది. రోజు విడిచి రోజు ఒక సమయంలో ఎక్కువగా సాయంత్రం వేళల్లో చలి జ్వరం వస్తుంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు మూడు రోజులు మించి ఉంటే వెంటనే రక్త పరీక్షలు చేసుకోవాలి. – డాక్టర్ శ్రీహర్ష, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ -
ఇక.. దంత వైద్యం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రజలకు మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల కంటివెలుగు కార్యక్రమంతో అందరికి కంటి వైద్యం అందించిన యంత్రాంగం.. త్వరలో దంత వైద్యాన్ని ప్రజల దరికి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కంటి వెలుగుకు అనూహ్య స్పందన రావడంతో ఇదే తరహాలో దంత వైద్యాన్ని (పరీక్షలు, వైద్యం) పరిచయం చేయాలని సర్కారు యోచించింది. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందికి స్క్రీనింగ్ చేశారు. సుమారు 2 లక్షల మందికి కళ్లజోళ్లు అందజేశారు. మరో 60 వేల మందిని పెద్దాస్పత్రులకు రెఫర్ చేశారు. ఇదే స్ఫూర్తితో వచ్చే నెలలో దంత వైద్యాన్ని ప్రజల ముంగిటకు తేవడానికి చర్యలు మొదలైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వివరాలతో నివేదిక జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం అందుతున్న దంత వైద్య సేవలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుంచి సర్కారు నివేదిక కోరింది. ఏయే ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.. ఎంత మంది వైద్యులు ఉన్నారనే విషయాలను అడిగినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేగాక ఉన్నపళంగా పంటి వైద్య సేవలు ప్రారంభించడానికి అవసరమైన సౌకర్యాలు, సామగ్రి స్థితి, రోజువారీగా ఆయా ఆస్పత్రులకు వస్తున్న అవుట్ పేషంట్ల సంఖ్య వివరాలను కూడా కోరినట్లు తెలిసింది. ఈ వివరాలతో అధికారులు తాజాగా నివేదిక అందజేశారు. అయితే జిల్లాలో ఇబ్రహీంపట్నంలోని సామాజిక వైద్యశాల, యాచారం పీహెచ్సీ, ఆమనగల్లులోని యూపీహెచ్‌సీల్లో మాత్రమే మొత్తం నలుగురు వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఈ డాక్టర్లను వినియోగించి దంత సేవలను మొదలు పెడతారా లేదంటే ఇంకొందరిని నియమించుకుని ప్రారంభిస్తారా అనేది తేలాల్సి ఉంది. అంతేగాక కంటి వైద్యం మాదిరిగా పంటి వైద్యం కూడా విజయవంతమైతే మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నారు. చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) వైద్య సేవలందించే అంశమూ ప్రభుత్వ పరిశీలనలో ఉందని వివరిస్తున్నారు. పైలెట్.. విజయవంతం పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో నిర్వహించిన దంత వైద్యానికి అనూహ్య స్పందన లభించింది. మొబైల్ వాహనాన్ని వినియోగించి ఇటీవల యాచారం మండలం కొత్తపల్లిలో డెంటల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపుని రెండు రోజులు ఇక్కడ కొనసాగించగా వందల మంది సేవలు పొందినట్లు వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని కూడా నివేదికలో పొందుపర్చినట్లు చెప్పారు. -
‘ప్రసవ’ వేదన
సాక్షి , అనంతపురం : వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఇంటివద్దే ప్రసవాలు జరుగుతుండడం వైద్య, ఆరోగ్య శాఖ పనితీరును ప్రశ్నార్థకం చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో గత ఏడాది 75,331 ప్రసవాలు జరిగాయి. ఇందులో 31,030 ప్రభుత్వాస్పత్రుల్లో, 41,802 ప్రైవేటు ఆస్పత్రుల్లో, 2,499 ఇళ్ల వద్ద జరిగాయి. గతేడాది జిల్లా వ్యాప్తంగా ఏడాదిలోపు శిశువులు దాదాపు 450 మంది మృత్యుఒడికి చేరినట్లు రికార్డులు చెబుతున్నాయి. పది మంది తల్లులు కూడా ప్రాణాలొదిలారు. గర్భిణుల్లో రక్తహీనత, రక్తపోటులో మార్పులు, పిండం ఎదగకపోవడం వంటి కారణాలతోనే అధిక శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ప్రసవం మహిళకు పునర్జన్మలాంటింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాల మీదకొస్తుంది. ఆస్పత్రుల్లో ప్రసవం సురక్షితమే కాకుండా.. తల్లీ బిడ్డకు శ్రేయస్కరం. అందుకే ప్రతి కాన్పు వైద్యుల సమక్షంలోనే జరగాలి. గర్భం దాల్చిన వెంటనే సదరు మహిళల వివరాలను నమోదు చేసుకుని.. ప్రతినెలా వైద్య పరీక్షలు చేయించుకునేలా, టీకాలు వేయించుకునేలా శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ఆయా పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బందిపై ఉంది. ప్రసవ సమయంలో 108 అంబులెన్స్‌ను వినియోగించుకుని ఆస్పత్రికి వెళ్లేలా చూడాలి. చాలా పీహెచ్‌సీల పరిధిలో ఇలా జరగడం లేదు. ఒక్కో పీహెచ్సీలో ప్రతి నెలా 15 ప్రసవాలు తప్పనిసరిగా చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించినా వైద్యుల నిర్లక్ష్యంతో సాధ్యపడడం లేదు. కొందరు ఇళ్లలోనే పాత విధానంలో ప్రసవాలు చేస్తుండడంతో మాతా శిశు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. కరువైన చిత్తశుద్ధి పీహెచ్‌సీల్లో ప్రసవాలను పక్కనపెడితే గర్భిణులు ఆస్పత్రులకువచ్చేలా చూడడంలోనూ వైద్యులు విఫలమవుతున్నారు. గర్భిణులను ఆస్పత్రులకు తీసుకొచ్చి.. తిరిగి తీసుకెళ్లేందుకు 108 వాహనాలను వినియోగించుకునే వెసులుబాటు ఉన్నా.. దీని గురించి సరైన ప్రచారం కల్పించడం లేదు.