సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రజలకు మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల కంటివెలుగు కార్యక్రమంతో అందరికి కంటి వైద్యం అందించిన యంత్రాంగం.. త్వరలో దంత వైద్యాన్ని ప్రజల దరికి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కంటి వెలుగుకు అనూహ్య స్పందన రావడంతో ఇదే తరహాలో దంత వైద్యాన్ని (పరీక్షలు, వైద్యం) పరిచయం చేయాలని సర్కారు యోచించింది. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందికి స్క్రీనింగ్ చేశారు. సుమారు 2 లక్షల మందికి కళ్లజోళ్లు అందజేశారు. మరో 60 వేల మందిని పెద్దాస్పత్రులకు రెఫర్ చేశారు. ఇదే స్ఫూర్తితో వచ్చే నెలలో దంత వైద్యాన్ని ప్రజల ముంగిటకు తేవడానికి చర్యలు మొదలైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
వివరాలతో నివేదిక
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం అందుతున్న దంత వైద్య సేవలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుంచి సర్కారు నివేదిక కోరింది. ఏయే ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.. ఎంత మంది వైద్యులు ఉన్నారనే విషయాలను అడిగినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేగాక ఉన్నపళంగా పంటి వైద్య సేవలు ప్రారంభించడానికి అవసరమైన సౌకర్యాలు, సామగ్రి స్థితి, రోజువారీగా ఆయా ఆస్పత్రులకు వస్తున్న అవుట్ పేషంట్ల సంఖ్య వివరాలను కూడా కోరినట్లు తెలిసింది.
ఈ వివరాలతో అధికారులు తాజాగా నివేదిక అందజేశారు. అయితే జిల్లాలో ఇబ్రహీంపట్నంలోని సామాజిక వైద్యశాల, యాచారం పీహెచ్‌సీ, ఆమనగల్లులోని యూపీహెచ్‌సీల్లో మాత్రమే మొత్తం నలుగురు వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఈ డాక్టర్లను వినియోగించి దంత సేవలను మొదలు పెడతారా లేదంటే ఇంకొందరిని నియమించుకుని ప్రారంభిస్తారా అనేది తేలాల్సి ఉంది. అంతేగాక కంటి వైద్యం మాదిరిగా పంటి వైద్యం కూడా విజయవంతమైతే మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నారు. చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) వైద్య సేవలందించే అంశమూ ప్రభుత్వ పరిశీలనలో ఉందని వివరిస్తున్నారు.
పైలెట్.. విజయవంతం
పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో నిర్వహించిన దంత వైద్యానికి అనూహ్య స్పందన లభించింది. మొబైల్ వాహనాన్ని వినియోగించి ఇటీవల యాచారం మండలం కొత్తపల్లిలో డెంటల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపుని రెండు రోజులు ఇక్కడ కొనసాగించగా వందల మంది సేవలు పొందినట్లు వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని కూడా నివేదికలో పొందుపర్చినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment