ఎత్తిపోస్తే..డెల్టా ఎడారే
కాకినాడ సిటీ :ఉభయ గోదావరి జిల్లాల్లో డెల్టా రైతులను నట్టేట ముంచే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని రైతుల, రైతుసంఘాల ప్రతినిధులు ఎలుగెత్తారు. ఈ డిమాండ్‌తో సోమవారం కాకినాడలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. భారతీయ కిసాన్ సంఘ్, నీటి వినియోగదారుల సంఘాలు, రైతులు ప్రభుత్వం విడుదల చేసిన మోసపూరితమైన జీఓ నంబర్-1ని వెంటనే రద్దు చేయాలని, ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని విరమించుకోవాలని నినదించారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ గేటు వద్ద రెండు గంటల పాటు ధర్నా చేసి... ‘ఎత్తిపోతలు వద్దు - పోలవరం ముద్దు’ అంటూ నినాదాలుచేశారు. కలెక్టరేట్ ఎదుట రాస్తారోకోకు దిగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం ఎత్తిపోతల నిర్మాణానికి విడుదల చేసిన జీఓ-1 జిరాక్స్ ప్రతులను దహనం చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్‌చార్జ్ కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు రైతు సంఘాల నాయకులు అందజేశారు.
‘పోలవరం’ ఉండగా ఎత్తిపోతలెందుకు?
ధర్నానుద్దేశించి నీటివినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి మాట్లాడుతూ 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్న ప్రభుత్వం ఎత్తిపోతల పథకం ఎందుకు తలపెట్టినట్టని ప్రశ్నించారు. ఈ పథకం వల్ల డెల్టాలో మొదటి పంటకే నీరు రాని పరిస్ధితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే చిత్తశుద్ధి లేనట్టు కనిపిస్తోందన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయరామరాజు మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్థిక లబ్ధి పొందాలన్న పాలకుల దురాలోచన అన్నారు. సర్కార్ ఎత్తుగడలను ఎదుర్కొని పోరాడకుంటే గోదావరి డెల్టా భవిష్యత్‌లో ఎడారైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం వల్ల గోదావరి, కృష్ణా ఆయకట్లకు నష్టమే తప్ప ప్రయోజనం లేదన్నారు.
పోలవరం హెడ్‌వర్క్స్ వద్ద ఏడు గ్రామాల వారికి ఇప్పటికీ పునరావాసం అందలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోలవరంపై దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండివైఖరితో ముందుకు వెళుతోందని పోలవరం సాధన సమితి నాయకుడు గోపాలకృష్ణ విమర్శించారు. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరం కల సాకారం అవుతున్న తరుణంలో ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావడం అసమంజసమన్నారు.ఆందోళనలో వైఎస్సార్ కాంగ్రెస్ రైతు విభాగం జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, భారతీయ కిసాన్‌సంఘ్ రాష్ట్రప్రధాన కార్యదర్శి జలగం కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ళ వెంకటానంద్, మండపేట వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభి, కిసాన్ సంఘ్ నాయకులు ముత్యాల జమీలు,
అడ్డాల గోపాలకృష్ణ, రైతు సంఘ సభ్యుడు వైట్ల విద్యాధర్, జిల్లా కార్యదర్శి చెల్లుబోయిన కేశవశెట్టి, బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, డీసీసీబీ డెరైక్టర్ గోదశి నాగేశ్వరరావు, రైతు సంఘాల నాయకులు జి.జమీ, పిన్నమరాజు పెదబాబు, కడియం తమ్మయ్య, పెమ్మిరెడ్డి సత్యం, కలిదిండి సూరిబాబురాజు, పిన్నమరాజు శ్రీను, పెద్దిరెడ్డి మునీంద్రరావు, సలాది శేషారావు, వట్టూరి తాతయ్యకాపు, పశ్చిమగోదావరి జిల్లా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పండురాజు, కొమరిపాలెం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కొవ్వూరి సుధాకరరెడ్డి, రాయవరం మాజీ ఎంపీపీ సిరిపురపు శ్రీనివాసరావు, మట్టా బాబు తదితరులు పాల్గొన్నారు.