
ప్లాన్ రాకుండానే నిర్మించేసిన టీడీపీ కార్యాలయం
సాక్షి, విశాఖపట్నం : అక్రమ భవన నిర్మాణదారులు ఎంతటివారైనా ఉపేక్షించొద్దన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో మహా విశాఖ నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం దూకుడుగా వ్యవహరిస్తోంది. అధికారం ఉంది కదానీ.. నిబంధనలకు తిలోదకాలిస్తూ ఐదేళ్ల పాటు అడ్డగోలుగా వ్యవహరించిన టీడీపీ నేతల ఆగడాలకు ముకుతాడు పడుతోంది. మహా విశాఖ నగరంలో అనధికార నిర్మాణాలపై టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఉక్కుపాదం మోపుతున్నారు. ప్లాన్‌కు విరుద్ధంగా.. ఎక్కడ అనధికార నిర్మాణం కనిపించినా.. దాని వెనుక ఎంతటివారున్నా వెనుకాడకుండా కూలగొడుతున్నారు. టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాగించిన దందాలకు చరమగీతం పాడుతున్నారు. టౌన్ ప్లానింగ్ అనే విభాగం ఉందన్న విషయం గుర్తులేనట్లుగా ఇష్టారాజ్యంగా అక్రమాల కోటలు కట్టేసి.. మోనార్క్‌ల్లా వ్యవహరించారు.
దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పట్టణ ప్రణాళికాధికారులు, సిబ్బంది ఉండిపోయారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కృష్ణా కరకట్టపై అనధికారికంగా నిర్మించిన ప్రజా వేదిక కూల్చివేతకు ఆదేశించి.. రాష్ట్రంలో ఎక్కడ ఈ తరహా నిర్మాణాలు కనిపించినా చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన సంకేతాలు.. టౌన్‌ప్లానింగ్‌లో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. వెంటనే అనధికార నిర్మాణాలపై చర్యలకు ఉపక్రమించేందుకు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దాదాపు 120కి పైగా భవనాలు, అదనపు అంతస్తుల్ని కూలగొట్టారు. ఈ క్రమంలో నగరం నడిబొడ్డున టీడీపీ నేతలు అడ్డగోలుగా నిర్మించిన అక్రమ భవనాలపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
పార్టీ కార్యాలయంతో మెదలు...
దసపల్లా వివాదస్పద భూముల్లోని సర్వే నెంబర్ 1196/7లో 2వేల చదరపు గజాల స్థలాన్ని టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. దీనికోసం 2002లో అప్పటి టీడీపీ ప్రభుత్వం లీజుకిస్తున్నట్లు కట్టబెట్టింది. లీజుకు తీసుకున్న 2వేల చదరపు గజాల స్థలంతో పాటు మరో వెయ్యి గజాలకు పైగా కొండను తొలచేసే మరీ భవనం నిర్మించేశారు. 2016 ఏప్రిల్ 18న భవన నిర్మాణ ప్లాన్ కోసం టీడీపీ నేతలు జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. జీవీఎంసీ పరిధిలోని 19 వార్డులోని పందిమెట్టలో 2016 ఏప్రిల్ 27న టీడీపీ కార్యాలయాన్ని నిర్మించేందుకు నారాలోకేష్ శంకుస్థాపన చేశారు. స్టిల్ట్ ప్లస్ జీ ప్లస్ 2 అంతస్తులతో నిర్మించిన ఈ భవనాన్ని 2018 అక్టోబర్ 30న నారాలోకేష్ ప్రారంభించారు.
అయితే.. 1086/0422/బీ/జెడ్3/ఆర్‌యూటీ/2016 దరఖాస్తులో లింక్ డాక్యుమెంట్ల విషయాన్ని ప్రస్తావించారే తప్ప.. దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు మాత్రం ఇప్పటికీ జీవీఎంసీకి అందివ్వలేదు. వీటిని అందిస్తే తప్ప ప్లాన్ అప్రూవ్ చేయమంటు అప్పట్లోనే జోన్–3 టౌన్‌ప్లానింగ్ అధికారులు సమాచారం ఇచ్చారు. అయినా.. ప్లాన్ అనుమతులతో సంబం ధం లేకుండానే భవనాన్ని నిర్మించేశారు. ప్లాన్ కోసం చేసిన దీంతో మరోసారి ఈ నెల 28న నోటీసులు సిద్ధం చేసుకున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు శనివారం కార్యాలయానికి టీడీపీ ప్రెసిడెంట్ పేరుతో ఉన్న నోటీసులను అక్కడ ఉన్న మేనేజర్‌కు అందించారు. వారం రోజుల్లోగా సంబంధిత డాక్యుమెంట్లు అందివ్వకపోతే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ 452 (2) ప్రకారం సదరు భవనాన్ని అనధికారిక నిర్మాణంగా గుర్తించి కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫైల్ కమిషనర్ వద్ద..
గంటా శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంతో పాటు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ అక్రమ నిర్మాణాల అంతు చూసేందుకు జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం సమాయత్తమైంది. ఇప్పటికే టీడీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేసిన టౌన్‌ప్లానింగ్ అధికారులు.. మిగిలిన రెండు భవనాలకూ నోటీసులు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ ఫైల్ జీవీఎంసీ కమిషనర్ సృజన వద్ద ఉంది. ఆమె అనుమతి రాగానే ఈ అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ప్లానూ లేదు.. పన్నూ చెల్లించలేదు..
పార్టీ ప్రధాన కార్యాలయమే కాదు.. నేతల క్యాంపు కార్యాలయాలూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించేశారు. భీమిలిలో ఉన్న గంటా క్యాంపు కార్యాలయమే ఇందుకు ఉదాహరణ. 2014లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి భీమిలి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆనుకుని సుమారు అర ఎకరం స్థలంలో క్యాంపు కార్యాలయాన్ని అడ్డగోలుగా నిర్మించేశారు. ఇప్పటికీ దీనికి సంబం«ధించి అనుమతులకు సంబంధించిన పత్రాలేవీ జీవీఎంసీ వద్ద లేకపోవడం విడ్డూరం. 1997 నుంచి 2014 వరకు ఒకరి పేరుతో ఖాళీ స్థలాల పన్ను(వీఎల్‌టీ) చెల్లించిన పత్రాలున్నాయి. ఆ తర్వాత క్యాంపు కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున వ్యక్తి పేరుతో కరెంట్ బిల్లు వస్తోంది. భవనం నిర్మించినప్పటి నుంచి ఇంతవరకూ ఆస్తి పన్నుగానీ, నీటి పన్నుగానీ చెల్లించలేదు. ఈ విషయాన్ని అడిగేందుకు ఏడాదిన్నర క్రితం వెళ్లిన జీవీఎంసీ రెవెన్యూ అధికారులపై క్యాంపు కార్యాలయంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడటంతో అప్పటి నుంచి భవనం వైపు వెళ్లే సాహసం చెయ్యలేదు.
నిబంధనలు గోవిందా...
అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా వెంకట గోవింద్ సత్యనారాయణదీ అదే దారి. ప్రమాదకరమైన గెడ్డ పక్కనే నిబంధనలను పాటించకుండా.. ఆరంతస్తుల భవనాన్ని కట్టేస్తున్నా కార్పొరేషన్ అధికారులు కళ్లు మూసేసుకున్నారు... కాదు కాదు.. అధికార మదంతో జీవీఎంసీ కళ్లు మూయించారు. ఎమ్మెల్యే గోవింద్‌కు ఆయన భార్య పి.విజయలక్ష్మి పేరిట నగరంలోని బీవీకే కళాశాల రోడ్‌లో సర్వే నెంబర్ 32లో 300 గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. నిబంధనల మేరకు భవన నిర్మాణం జరిగితే ఎవరికీ ఇబ్బంది లేదు కానీ... సదరు ఎమ్మెల్యే మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా నిర్మాణం చేసేస్తున్నారు. ఆ స్థలం పక్కనే దక్షిణ భాగాన భారీ గెడ్డ ఉంది. వాస్తవానికి 168 జీవో ప్రకారం... బఫర్ జోన్ కింద గెడ్డకు పది అడుగుల దూరం, భవన నిర్మాణ కాంపౌండ్ నుంచి మరో పది అడుగులు.. మొత్తంగా 20 అడుగుల దూరం వదిలి నిర్మాణం చేపట్టాలి. కానీ ఎమ్మెల్యే ఈ నిబంధనను పూర్తిగా పక్కన పెట్టేశారు. దీనిపై జీవీఎంసీ అధికారులడిగితే.. మా ఇష్టమంటూ హూంకరించారు. మరోవైపు 300 చదరపు గజాల స్థలంలో జీ ప్లస్ 2 భవన నిర్మాణానికే జీవీఎంసీ అధికారులు అనుమతులిచ్చారు. కానీ అక్కడ ఆరంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేస్తున్నారు. అక్రమంగా నిర్మించేస్తున్న ఈ భవనానికీ మూడింది.
సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గంటా క్యాంపు కార్యాలయం

టీడీపీ కార్యాలయానికి జీవీఎంసీ జారీ చేసిన నోటీసు
Comments
Please login to add a commentAdd a comment