విజృంభిస్తున్న డెంగీ | Dengue booming | Sakshi
Sakshi News home page

విజృంభిస్తున్న డెంగీ

Published Tue, Oct 21 2014 3:26 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

విజృంభిస్తున్న డెంగీ - Sakshi

విజృంభిస్తున్న డెంగీ

నెల్లూరు (విద్యుత్) : జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలకు అపరిశుభ్రత తాండవిస్తోంది. ఈ నేపథ్యంలో డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి.  వెంకటగిరి నియోజకవర్గంలోనే 20 డెంగీ కేసులు నమోదైనట్టు సమాచారం. జిల్లా వైద్యారోగ్యశాఖ నిద్రావస్థలో ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాలు మొదలుకాగానే వైద్యశాఖ క్షేత్ర స్థాయిలో క్యాంపులను నిర్వహించి రోగులకు పరీక్షలతో పాటు అవగాహన కల్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియ తూతూ మంత్రంగా సాగుతోందన్న విమర్శలున్నాయి.  

  ప్రాణాపాయం తక్కువే
 ఉదయం పూట తిరిగే దోమలు కుట్టడం వల్ల డెంగీ వ్యాధి వైరస్ శరీరంలోకి చేరుతుంది. ఈ జ్వర బాధితులు దాదాపుగా కోలుకుంటారు. ఒక్క శాతం కంటే తక్కువ మందికే ప్రాణాపాయం ఉన్నట్టు వైద్యులు తెలిపారు. జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ మాత్రలను వాడాలి. ఇష్టం వచ్చినట్లు యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. యాంటీజెన్, యాంటీ బాడీ, ఎలీసా టెస్ట్‌ల ద్వారా డెంగీ వ్యాధిని నిర్ధారించవచ్చు.

ఈ వ్యాధికి వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ వ్యాధి సోకిన వారికి రక్తంలోని ప్లేట్‌లెట్స్ అందించాల్సిన అవసరం లేదు. సాధారణంగా మన రక్తంలో 2 లక్షల ప్లేట్‌లెట్స్ కౌంట్ ఉండాలి. ఈ సంఖ్య 20 వేలకు పడిపోతేనే పరిస్థితి విషమిస్తుంది. అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. అందుకే ప్లేట్‌లెట్స్ కౌంట్ 40 వేలు ఉన్నప్పుడే వాటిని తిరిగి ఎక్కించాలి. దీనివల్ల ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు.

 లక్షణాలు : చలి, జ్వరం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, విరేచనాలు,
 చర్మం కందిపోవడం డెంగీ వ్యాధి ప్రధాన లక్షణాలు.ప్రైవేట్ వైద్యశాలలకు పండగ జ్వరపీడితులు ప్రభుత్వ వైద్య శాలలపై నమ్మకంలేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అవసరం లేకున్నా అక్కడ ప్లేట్‌లెట్ కౌంట్ టెస్ట్, డెంగీ నిర్ధారణ టెస్ట్, ప్లేట్‌లెట్ కణాలను ఎక్కిస్తూ వేలాది రూపాయలు గుంజుతున్నారు. సాధారణ జ్వరం అయినప్పటికీ డెంగీ బూచి అని భయపెడుతూ రోగుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఒకవేళ డెంగీ పాజిటివ్‌గా తేలిందా ఇక వైద్యుల పంట పండినట్టే.


 తీసుకోవాల్సిన జాగ్రత్తలు
 వర్షాకాలంలో ఎక్కువగా విష జ్వరాలు సోకుతుంటాయి. ఎక్కువగా నీరు నిల్వ ఉన్న చోటు, చెత్తా చెదారాలు పేరుకుపోయిన చోట, మురుగుగుంతలు ఎక్కువగా ఉన్నచోట దోమలు వ్యాప్తి చెందుతాయి. దోమల వల్ల విష జ్వరాలు, డెంగీ వంటి వ్యాధులు వస్తుంటాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు చేరవు. నిత్యం తమ నివాసంతో పాటు పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. తాగేసిన కొబ్బరి బోండాలు, రబ్బరు టైర్లు, గాజు సీసా లు, వాడని ట్యాంకులు ఇంటి సమీపం  లేకుండా చూసుకోవాలి. దోమ తెరలు, దోమల నివారణ మందులను వాడాలి. జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్సను పొందాలి.

 వెంబులూరులో ప్రబలిన డెంగీ
 డక్కిలి: మండలంలోని వెంబులూరు గ్రామంలో  పలువురికి డెంగీ సోకింది. వీరంతా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ గ్రామానికి చెందిన పూల విజయ నెల్లూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కందికట్టు సుబ్బమ్మ, మరో ఇద్దరు చిన్నారులు కూడా నెల్లూరులో వైద్యం తీసుకుంటున్నారు.

 శాంపిల్స్ సేకరిస్తున్నాం: కోటేశ్వరి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ
 జిల్లా వ్యాప్తంగా డెంగీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక  క్యాంపుల ద్వారా గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. రోజుకు 15 శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. పీహెచ్ కేంద్రాల్లోని వైద్యులను అప్రమత్తం చేశాం. విష జ్వరాలకు సంబంధించిన మందులను అన్ని చోట్ల అందుబాటులో ఉంచుతున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement