ప్రియమైన శరీర వాసన ఉన్నవారిపైనే దోమల దాడి!
కొత్త పరిశోధన
మిమ్మల్ని దోమలు విపరీతంగా కుడుతున్నాయంటే కారణం... మీ శరీరం నుంచి వెలువడే వాసనే అంటున్నారు బ్రిటిష్ అధ్యయనవేత్తలు. దీన్ని నిరూపించడం కోసం 36 మంది కవల పిల్లలను ఎంచుకున్నారు. వీరంతా ఒకేలాంటి కవలలన్నమాట. అంటే ఐడెంటికల్ ట్విన్స్. ఇక ఐడెంటికల్ ట్విన్స్ కాని కవల పిల్లలను మరో 38 మందినీ ఎంచుకొని వారిని మరో గదిలో ఉంచారు.
ఈ రెండు గదుల్లోకీ ఒకేసారి వెళ్లేలా ఇంగ్లిష్ అక్షరం ‘వై’ ఆకృతిలో ఉండే ఒక గొట్టాన్ని ఏర్పాటు చేసి... ఈ రెండు గదుల్లోకీ ఒకేసారి దోమల్ని పంపారు. ఐడెంటికల్ ట్విన్స్ ఉన్న గదిలోనికే ఎక్కువ దోమలు వెళ్లాయి. ఐడెంటికల్ ట్విన్స్ అంటే వారిలో శరీర వాసనను వెలువరించే ఒకేలాంటి జన్యువులు ఉంటాయి కాబట్టి... వారి మీదకే ఎక్కువ సంఖ్యలో దోమలు వెళ్లాయన్నమాట. అదే ఒకేలాంటి కవలలు కానివారి విషయంలో వేర్వేరు జీన్స్ వల్ల వేర్వేరు శరీర వాసనలు వెలువడ్డాయి కాబట్టి... వాటిలో దోమలకు ప్రియంగా లేని శరీర వాసనలు వెలువడేవారిదగ్గరకు అస్సలు దోమలే వెళ్లలేదట.
వీటన్నింటినీ సమీక్షించి చూస్తే తమకు ప్రియమైన శరీర వాసనను వెలువరించే వారిపైకే దోమలు దాడి చేస్తాయని వెల్లడైందని ఈ పరిశోధనవేత్తలు పేర్కొంటూ ఇదే విషయాన్ని ‘ప్లాస్ ఒన్’ అనే జర్నల్‌లో సైతం పొందుపరిచారు. మరో కొత్త విషయం ఏమిటంటే... ఈ శరీరవాసనకు కారణమయ్యే జన్యువుకూ... ఎత్తుతో పాటు, ఐక్యూకూ కారణమయ్యే జన్యువుతో దగ్గరి పోలికలున్నాయట.