రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి గండి
Published Fri, Sep 6 2013 4:00 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
విజయనగరం రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి భారీస్థాయిలో గండిపడింది. జిల్లాలో ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో ఆదాయాన్ని తెచ్చేపెట్టే శాఖల్లో ఈ శాఖ ముందు వరుసలో ఉంటుంది. రాష్ట్ర విభజన నిర్ణయంతో జిల్లాలో సమైక్య ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఎన్జీఓల పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా స్టాంప్స్ అండ్ రిజి స్ట్రేషన్ శాఖ అధికారులు, సిబ్బంది ఉద్యమం లో పాల్గొనడంతో ఆ శాఖ ఆదాయాన్ని కోల్పోతోంది. గత నెల 12 అర్ధరాత్రి నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సబ్ రిజిస్ట్రార్లు, సీని యర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది ఎన్జీవోల సమ్మె పిలుపు మేరకు సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారు. దీంతో గత నెల 13 నుంచి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్థిరాస్తుల, ఇతర రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
పతీ నెల రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకు 13 సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల నుంచి సరాసరి ఏడు నుంచి తొమ్మిది కోట్ల రూపాయల వరకూ ఆదాయం సమకూరుతుంది. గత 20 రోజులు గా ఆ శాఖ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో స్థిర, ఇతర ఆస్తులకు సంబంధించి ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. దీంతో ఆ శాఖ రూ.కోట్లలో ఆదాయం కోల్పోతోంది. ఈసీలు, నకళ్లు, స్టాంప్స్ అమ్మకాలు కూడా జరగకపోవడంతో 20 రోజులుగా ఆ శాఖకు పైసా ఆదాయం సమకూరలేదు. అలాగే సమ్మెలో ఆ శాఖ డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ కూడా పాల్గొనడంతో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం సైతం తెరుచుకోవడం లేదు. ప్రతీ రోజూ స్థిరాస్తి రిజిస్ట్రేషన్లకు వచ్చిన క్రయ విక్రయదారులతో బిజీబిజీగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రస్తుతం మూసివేసి వెలవెలబోతున్నాయి.
Advertisement