అమానుషం | Depends | Sakshi
Sakshi News home page

అమానుషం

Published Thu, Mar 26 2015 2:34 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

Depends

ఓబులవారిపల్లె : ఆస్తి పంపకాల్లో మనస్పర్థలు రావడంతో రక్తం పంచుకుపుట్టిన తోబుట్టువునే కడతేర్చిన హృదయ విదారక ఘటన ఓబులవారిపల్లె మండలం గాదెల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు..  గాదెల గ్రామంలో కారం గంగయ్య, వెంకటమ్మలకు రత్నమ్మ, రాజమ్మ, బుజ్జమ్మ అనే ముగ్గురు సంతానం. మగ బిడ్డలు లేకపోవడంతో వారినే కొడుకులుగా భావించి ముగ్గురు కుమార్తెలను అదే గ్రామంలో ఇచ్చి పెళ్లిళ్లు చేశారు.

గ్రామంలో తనకున్న 1.20 ఎకరాలు భూమిని కూడా ముగ్గురు కుమార్తెలకు పంచారు. కొద్ది రోజుల క్రితం గంగయ్య మృతి చెందాడు. భర్త మృతితో భార్య వెంకటమ్మ.. పెద్ద కుమార్తె రత్నమ్మ వద్ద ఉంటోంది. బీదరికంలో ఉన్న మరో కూతురు రాజమ్మ(40) తన కూతురు వివాహ ఖర్చు కోసం తల్లి వెంకటమ్మ వద్ద నున్న బంగారం తీసుకుని కుదువ పెట్టింది. భూమిని పంచుకున్న తోబుట్టువులు తల్లి వద్ద ఉన్న బంగారం కోసం తరచూ గొడవపడేవారు.

ఈ నేపథ్యంలో కుదువ పెట్టిన బంగారం కోసం రాజమ్మతో అక్క రత్నమ్మ, చెల్లెలు బుజ్జమ్మ కొద్ది రోజుల క్రితం గ్రామంలో నిలదీశారు. బంగారం రాకపోవచ్చని భావించి రాజమ్మ భూమిని స్వాధీనం చేసుకున్నారు. తన భూమిని తన అక్కా, చెల్లెలు లాక్కున్నారని, తిరిగి తనకు ఇప్పించాలని నాలుగు రోజుల క్రితం రాజమ్మ ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భూమి తిరిగి ఇస్తే రూ.20 వేలు.. అక్క, చెల్లెలుకు ఇస్తానని ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు ఈ సమస్యను విచారిస్తుండగానే మంగళవారం సాయంత్రం రత్నమ్మ, బుజ్జమ్మలు ఆగ్రహించి ఇంట్లో ఒంటరిగా ఉన్న రాజమ్మపై దాడికి తెగబడ్డారు.

పోలీసు స్టేషన్‌లో కేసు పెడతావా... నీ అంతు చూస్తామంటూ గ్రామ పొలిమేర చివరి వరకు ఈడ్చుకెళ్లి తీవ్రంగా కొట్టారు. గొంతుపై కాలువేసి తొక్కారు. దాడిని అడ్డుకోబోయిన గ్రామస్తులను తీవ్ర పదజాలంతో దూషించారు. తనపై దాడి చేశారని రాజమ్మ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐకి ఫిర్యాదు చేసింది. దాడి చేసిన వారిని పిలిపించి విచారిస్తామని పోలీసులు చెప్పడంతో బాధితురాలు ఇంటికెళ్లింది. తీవ్ర గాయాలతో ప్రథమ చికిత్స చేయించుకుని నిద్రపోయిన రాజమ్మ బుధవారం ఉదయం ఎంతకూ లేవకపోవడంతో భర్త ఆంజనేయులు స్థానికుల సహాయంతో రైల్వేకోడూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు దర్యాప్తులో ఉంది.  
 
పోలీసుస్టేషన్ ఎదుట బంధువులు ధర్నా

రైల్వేకోడూరు ఆర్బన్ : రాజమ్మ మృతికి కారణమైన వారిని శిక్షించాలని ఆమె బంధువులు బుధవారం రైల్వేకోడూరు పోలీసుస్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. తామిచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుల ఒత్తిడితోనే ఫిర్యాదు తీసుకోలేదని నినదించారు. ఈ సంఘటన తమ పరిధిలోకి రాదని ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌కు వెళ్లాలని పోలీసులు సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని సీఐ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement