సాక్షి, రొంపిచర్ల: అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే 90 శాతం ఎన్నికల హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్ (ఆళ్ల నాని) చెప్పారు. నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల గ్రామంలో నిర్మించిన ప్రాథమిక వైద్యశాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సభలో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమం, ప్రజారోగ్యాన్ని విస్మరించి కేవలం అక్రమార్జన, కబ్జాలకే ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించటమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అక్రమ ఇసుక రవాణా, ప్రకృతి వైపరీత్యాల వలన కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో పది స్టాకు పాయింట్లలో 49 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. ఇసుక లభ్యతకు 29 రీచ్‌లను గుర్తించామన్నారు. టీడీపీ నాయకులకు ఇవేమీ కనిపించట్లేదని, కేవలం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో 24లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు అవసరమైన భూసేకరణ పనులు పూర్తికావచ్చాయన్నారు.
రైతులకు పెట్టుబడిలో వెసులుబాటు కల్పించేందుకే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కంటే ప్రతి రైతుకు ఎక్కువ ఆర్థికసాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ వైద్యశాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు నిధుల కేటాయించాలని మంత్రిని కోరారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా తాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. రూ.2,750 కోట్లతో బుగ్గవాగు రిజర్వాయర్‌ను ఆధునికీకరించి తాగునీరు అందజేయనున్నట్లు తెలిపారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిలుస్తోందన్నారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.50లక్షల వ్యయంతో తలపెట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అరుణకుమారి, డీఎంఅండ్‌హెచ్‌వో యాస్మిన్, ఆర్డీవో మొగిలి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ జాన్‌సైదులు, ఎండీవో అర్జునరావు, వైఎస్సార్ సీపీ నాయకులు పిల్లి ఓబుల్‌రెడ్డి, పచ్చవ రవీంద్రబాబు, అన్నెంపున్నారెడ్డి, చపారపు గోపాలరెడ్డి, పడాల చక్రారెడ్డి, కల్లి మస్తాన్‌రెడ్డి, గెల్లి బ్రహ్మారెడ్డి, గెల్లి చినకోటిరెడ్డి, ముండ్రు హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్యశాఖలో ప్రక్షాళన..
నరసరావుపేట: ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని డెప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యఆరోగ్యశాఖలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మంగళవారం నరసరావుపేట నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి పర్యటించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో అన్ని విభాగాలను పరిశీలించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్లలో ఆరేళ్ల కిందట నిర్మించిన వైద్యశాల ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదన్నారు. కానీ, సీఎం చొరవతో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఆ వైద్యశాలను ప్రారంభించి, ప్రహరీ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు.
నరసరావుపేట ఏరియా వైద్యశాలలో డ్రెయినేజీ లోపాలను సరి చేసేందుకు రూ.58 లక్షల నిధులను మంజూరు చేస్తున్నామన్నారు. ఎన్‌ఎస్పీ స్థలంలో కొత్తగా నిర్మిస్తున్న 200 పడకల వైద్యశాలలో మరో రూ.3.5 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉందని, వాటి ప్రతిపాదనలు పరిశీలించి నిధులు విడుదల చేసి, త్వరలోనే ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో సుమారు 3 వేల మంది డాక్టర్లు కొరత ఉందన్నారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం పొందిన సిబ్బందిని కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పను కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment