సాక్షి, వైఎస్సార్ కడప: కరోనా తీవ్రత ఆధారంగా కడపలో నాలుగు ప్రాంతాలను ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా రెడ్‌జోన్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌తో పాటు వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సోమవారం ఆయన జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంజాద్ భాషా మాట్లాడుతూ.. దాదాపు 2 వేలకు పైగా ర్యాపిడ్ కిట్స్ జిల్లాకు అందాయన్నారు. నగరంలో ఇప్పటివరకు స్వాప్ టెస్ట్ ద్వారా 1000 మందికి పరీక్షలు చేశామని వెల్లడించారు. ఐదు రోజుల క్రితం సరోజిని నగర్‌లో కరోనా పాజిటివ్ వచ్చిన కానిస్టేబుల్‌కు తాజా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందన్నారు. మరోవైపు కరోనా నివారణకు ముందుండి పోరాడుతున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య కార్మికులకు ఆయన అభినందనలు తెలిపారు.
"నగరంలో దాదాపు 25 ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్‌లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలు గుంపులుగా రావడం లేదు. సామాజిక దూరం పాటిస్తూనే ప్రజలు మందులు, నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోలు చేయాలి. మరోవైపు మార్కెట్ యార్డులో రైతుల నుంచి పసుపు కొనుగోలుకు ఏర్పాట్లు చేశాం. టోకెన్ల ద్వారా వీటి కొనుగోలు జరుగుతుంది. అలాగే హార్టికల్చర్‌లో రైతులు పండించిన బొప్పాయి, అరటి, జామకాయలను కిట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఈనెల 29 నుంచి మూడో విడత రేషన్ సరుకుల పంపిణీ చేస్తాం. రంజాన్ ప్రార్థనలు ఇళ్లలో నుంచే చేసుకోవాలి. ప్రభుత్వ మార్గదర్శకాలను ముస్లింలు తప్పక పాటించాలి. కరోనా నివారణకు ప్రజలు సహకరించాలి" అని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా కోరారు. (అందరూ ఇళ్లలోనే నమాజ్...)
Comments
Please login to add a commentAdd a comment