సాక్షి, విజయవాడ: వరద ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి భరోసా ఇచ్చారు. కృష్ణలంక ముంపు ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. తమ కష్టాలను వరద బాధితులు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రికి వెళ్లబోసుకున్నారు. నాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందరికీ రేషన్ కార్డులిస్తే.. చంద్రబాబు వాటిని రద్దు చేశారని డిప్యూటీ సీఎం వద్ద బాధితులు వాపోయారు. ఇళ్లు ముంపుకి గురై ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు వచ్చి బురద రాజకీయం చేసి వెళ్లారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో లేకపోయినా ఇళ్ల పట్టాలు ఇస్తానని చంద్రబాబు చెప్పడం పట్ల బాధితులు విస్మయం వ్యక్తం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మించి ముంపు నుంచి కాపాడాలని డిప్యూటీ సీఎంకు బాధితులు విన్నవించారు.
డ్వాక్రా మహిళలను టీడీపీ నట్టేట ముంచింది..
14వ డివిజన్ భూపేష్ గుప్తా నగర్ ప్రాంతంలో పర్యటించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి డ్వాక్రా మహిళలు తమ గోడును చెప్పుకున్నారు. టీడీపీ హయాంలో ఇల్లు ఇస్తామని చెప్పి..ఇప్పటి వరకు కేటాయించలేదని డిప్యూటీ సీఎం వద్ద డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో స్థలాలు ఇస్తామని చెప్పి డీడీలు కట్టమన్నారని.. చాలా మంది రూ.50 వేలు వరకు కట్టినా.. నేటికీ పట్టించుకోలేదన్నారు. ఇల్లు కేటాయిస్తారనే ఆశతో ఐదు రూపాయలకు వడ్డీకి తెచ్చి డబ్బులు కట్టామన్నారు. ప్లాట్ నెంబర్లు కేటాయించామని చెప్పారని.. అక్కడికి వెళ్ళిచూస్తే ఎటువంటి ప్లాట్ నెంబర్లు లేవని వాపోయారు. డ్వాక్రా మహిళలను టీడీపీ నట్టేట ముంచిందన్నారు. తమకు న్యాయం జరిపించాలని కోరారు.
చంద్రబాబును నిలదీయండి..
ఓట్లు కోసం చంద్రబాబు పేదలను మోసం చేశారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఆ భూములు ఎక్కడ ఉన్నాయో.. ఎక్కడ ఇల్లు కట్టి ఇస్తామని చెప్పారో.. డ్వాక్రా మహిళలే చంద్రబాబును నిలదీయాలన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment