వాకాడు: ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వరుస వాయుగుండాలు, భారీ వర్షాలు, అధికారుల హెచ్చరికలు వెరసి మత్స్యకారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొన్నటి వరకు వేట నిషేధంతో ఏదో ఒక రకంగా బతుకీడ్చిన మత్స్యకారులకు నేడు ప్రతికూల వాతావరణం నిరాశకు గురి చేస్తోంది. మత్స్య సంపద అభివృద్ధి కోసం 60 రోజులు వేటకు దూరంగా ఉన్నారు. ఈ వేట విరామానికి సంబంధించి ప్రభుత్వం ఇవ్వాల్సిన నగదు ఇంతవరకు అందలేదు. ఇలా అన్ని విధాలా మత్స్యకారులు నష్టపోతున్నారు.
జిల్లాలో 56 వేల మంది మత్స్యకారులు
జిల్లాలో 12 తీర ప్రాంత మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలోని 113 మత్స్యకార గ్రామాల్లో 56 వేల మంది జాలర్లు ఉన్నారు. వీరంతా కేవలం మత్స్య సంపదతోనే జీవనం సాగిస్తున్నారు. అయితే వేట విరామం సమయంలో ప్రభుత్వం అందించాల్సిన పరిహారం ఇంకా ఒక్కరికీ అందలేదు. మత్స్యకారులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అలల సాగరంలో మత్స్య సంపదను పట్టి సంతోషంగా ఉండే గంగపుత్రులు నేడు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. జిల్లా సముద్ర తీరం వెంబడి 40 మరపడవలు, 4,995 ఇంజిన్‌బోట్లుతోపాటు సాధారణ పడవలు ద్వారా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి వస్తుంటారు. వరుస ప్రతికూల వాతావరణంతో బోట్లన్నీ తీరంలో నిలిపివేశారు.
పూటగడవక కొందరు మత్స్యకారులు బకింగ్ హామ్‌కెనాల్, పులికాట్, ఉప్పుకయ్యల్లో నాటు పడవలద్వారా రోజులు తరబడి వేటకెళ్లినా మత్స్య సంపద అంతంత మాత్రంగానే దొరుకుతోంది. ఏవో చిన్నపాటి చేపలు వలలో పడుతుండటంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. దొరికిన చేపలను చిల్లరగా రోడ్లపై విక్రయించి పొట్ట నింపుకుంటున్నారు. మరికొందరు సమీప రొయ్యల హేచరీలలో కూలి పనులుకు వెళుతున్నారు. మత్స్యకారులకు ఎలాంటి పనులు చేతకాకపోయినా హేచరీ యజమానులు వీరిపై జాలితో పనుల్లో పెట్టుకుని ఎంతో కొంత డబ్బులు ఇచ్చిపంపుతున్నారు. వాతావరణం ఎప్పుడు చక్కబడుతుందో.. వేటకు ఎప్పుడు వెళ్తామా అని మత్స్యకారులు సముద్రం వద్ద నిరీక్షిస్తున్నారు. కొందరు తెగిన వలలకు మరమ్మతులు చేసుకుంటున్నారు.
పోరుగాలితో బోట్లు తిరగబడుతున్నాయి
వేటకు వెళితే సముద్రంపై పోరుగాలి వీస్తూ బోట్లు తిరగబడుతున్నాయి. తీరంలో ఈదురు గాలులుతోపాటు సముద్రంలో అలలు ఉద్ధృతి పెరిగింది. రెండు నుంచి నాలుగు మీటర్లు ఎత్తుకు అలలు ఎగసి పడుతున్నాయి. వేట మానేసి ఇంటి వద్ద పస్తులతో ఉంటున్నాం.
–సోమయ్య, మత్స్యకారుడు, తూపిలిపాళెం
మేము ఎలా బతకాలి?
సముద్రం ఉగ్ర రూపం దాల్చి భీకరమైన శబ్దాలతో కెరటాలు ఎగసి పడుతున్నాయి. వారం నుంచి బోటు సముద్రంపై వెళ్లలేకపోతోంది. మొన్నటి వరకు వేట విరామంతో పస్తులున్నాం. ఇప్పుడు మత్స్య సంపద దొరుకుతున్నా.. వాతావరణం అనుకూలించక వేట చేయలేకపోతున్నాం. వేట విరామం డబ్బులు రెండేళ్ల నుంచి అందడం లేదు. మేము ఎలా బతకాలో అర్థం కావడం లేదు.
–పామంజి యార్నావూర్, మత్స్యకారుడు కొండూరుపాళెం
Comments
Please login to add a commentAdd a comment